46. సప్తావస్థల నిరూపణము

అష్టత్రింశద్వర్ణకము
46. సప్తావస్థల నిరూపణము

            లోకమందు కొందఱు శాస్త్రజ్ఞులు వేదాంత వాక్యంబులు పరోక్ష జనకంబులనియు నపరోక్షజనకంబులు గావనియు సర్వదా అపరోక్షుండగు ఆత్మ పరోక్షాపరోక్షంబులకు విషయుండు కాఁడనియు స్వయం ప్రకాశుఁడైన ఆత్మకు జ్ఞానాజ్ఞానయుక్తత్వము కూడదనియుఁ జెప్పుటవలన నా మాటలను విని యనేకులు భ్రమనొందుచున్నారు. కాఁబట్టి అట్టి భ్రమ నివారించుటకై యాత్మయందు సప్తావస్థలను దృష్టాంతపూర్వకముగా నిరూపించుచున్నారము. అది యెట్లనినలోకమందు పరమజీయ’ రని యొక సన్యాసి కలఁడు. అతని కనేకులు శిష్యులు గలరు. ఆ శిష్యులలో పదిమందిని బిలిచి యొక కార్యంబునకుఁ బంపెను. ఆ పదుగురు నాకార్యార్థంబుగ నరుగునప్పుడు మార్గమందొక యేఱు ప్రవహించుచుండఁగా వారందఱును వరుసగా నా యేరు దాఁటి యావలిగట్టు చేరిరి. అప్పుడు వారిలో ముఖ్యుఁ డయినవాఁడు తనతోడ వచ్చిన వారందఱును దరిఁజేరిరో లేక నదిలోఁ గొట్టుకొనిపోయిరోయను సంశయంబున నందఱిని లెక్కపెట్టెడివాఁడు. తొమ్మిదిమంది యందేచిత్తము నిలిపిఅజ్ఞానము చేత గణనకర్తయైన తన్ను పదియవ వాఁడని యెఱుఁగకపోయెను. అదియె అజ్ఞానంబు. ఆవరణము లెట్టివనిన సదావరణమనియుఅసదావరణ మనియు రెండువిధంబులు. పదియవవాఁడు తన్నుఁదా నెఱుఁగకపదియవ వాఁడుండినచో కనఁబడఁడాకాఁబట్టి దశముఁడు లేఁడని పలుకు చున్నాడు. ఈ వ్యవహారంబునకు గారణ మెయ్యదియో అదియె అజ్ఞాన కార్యమైన యావరణద్వయ మనబడును. ఆ దశుముఁడు లేడు. నదియందు మునిఁగిపోయెనని నిశ్చయించి దుఃఖించెను. కనుక అది యజ్ఞాన కార్యమైన విక్షేపము. ఆ దశముఁడు దుఃఖించుచుండఁగా ఆప్తుడైనవాఁడు వచ్చి యెందుకు రోదనము సేసెదవు. దశముఁడు చచ్చి పోలేదు ఉన్నాఁడని చెప్పఁగా వాఁడామాట విని శాస్త్రముచేత స్వర్గాదుల నెఱిఁగినట్లు దశముని పరోక్షంబుగ నెఱిఁగెను. ఇది పరోక్షజ్ఞానము. ఆ దశముని యాభా సావరణంబు నివర్తకమైన యపరోక్షజ్ఞాన మెయ్యది యనినఆప్తుని మాటలు విని యేడ్పుమానిన పదియవవాఁడు దశముఁడెక్కడనని పిలిచి పలుక కున్నందున ఆప్తునిం జూచి పదియవవాడెక్కడనని యడిగి వానివలన దశముఁడు తానగుట దెలిసికొని సందేహమును వదలి నా మనస్సు చేతనే భ్రమను బొందితినికాలత్రయమందును నేనే పదియవ వాఁడనని తన్ను అపరోక్షజ్ఞానంబుగా నెఱిఁగెను. తరువాత రోదనంబును విడిచిపెట్టి సంతోషించెను.

            ఈ ప్రకారముగానే చిదాభాసుఁడు సంసారమం దాసక్తి గలవాఁడయి యొకానొకప్పుడు తనకు స్వరూపభూతుఁడును స్వప్రకాశుఁడు  అగు కూటస్థుని నెఱుఁగ ననుటయే అజ్ఞానము. ఒకఁడాచిదాభాసుని బిలిచి కూటస్థు నెఱుఁగుదువా యని యడుగుచుండఁగా కూటస్థుఁడని యొకడు న్నాఁడాఉంటే తోఁచఁడా ! లేఁడు అని పలుకుటయే అజ్ఞాన కార్యమగు నావరణద్వయము. నేను కర్తను భోక్తను సుఖిని దుఃఖిని మనుష్యుఁడను బ్రాహ్మణుఁడను అనెడి యారూఢునకు కారణమై దేహ ద్వయంబుతోడఁ గూడుకొని యుండెడు చిదాభాసుఁడు నిక్షేపుఁడనఁబడును. ఈ చిదాభాసుఁడు గురూపదేశంబుచే మొదట కూటస్థుఁడొకఁడు కలఁడని పరోక్షంబుగ నెఱుఁగుట పరోక్షజ్ఞానంబు. చిదాభాసుఁడు గురువుల దగ్గర శ్రవణాదులను చేసి జ్ఞానంబును సంపాదించి తరువాత నా కూటస్థుడు నేను అని యెఱుఁగుట యపరోక్షజ్ఞానము. అనర్థనివృత్తి యెటులనినఈ చిదాభాసుఁడు నిర్వికారుఁడు నసంగుఁడునైన యాత్మ నేనని యెఱిఁగిన తర్వాత కర్తృత్వాదులు శోకజాతంబులని యెఱుఁగుట యనర్థనివృత్తి. ఆనందావాప్తి యనఁగాసకలకర్తవ్యజాతంబును పొందఁదగిన ఫలజాతం బంతయును తనవలననే కల్పింతంబులయి పొందఁబడునని సంతోషించుటయె ఆనందా వాప్తి. ఇప్పుడు నిరూపింపఁబడిన అజ్ఞానఆవరణవిక్షేపపరోక్షఅపరోక్షఅనర్థనివృత్తిఆనందావాప్తులనెడి సప్తావస్థలయందును మొదటి మూడవస్థలు బంధహేతువులు. తక్కిన నాలుగవస్థలును మోక్ష హేతువులు. ఈ ప్రకారంబుగా విచారించి యీ యవస్థ లేడును ఆరోపితమైన అహంకారంబునకే కాని యహంకార సాక్షియై నిర్వికారుఁడైన తనకు లేవని యెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.

ఇది అష్టత్రింశద్వర్ణకము.