47. తాదాత్మ్య నిరూపణము

ఏకోనచత్వారింశద్వర్ణకము
47. తాదాత్మ్య నిరూపణము

            తాదాత్మ్యము సహజజన్య తాదాత్మ్యమనియును, కర్మజన్య తాదాత్మ్య మనియును భ్రాంతిజన్య తాదాత్మ్యమనియును మూఁడు విధంబులయి యుండును. చిత్తు అహంకారమందు ప్రతిబింబించి యాప్రతిబింబంబు నయ్యహంకారంబును గూడి తప్తాయఃపిండంబువలె నేకమై చిత్తువలెనే తోఁచును. ఆ చిత్ప్రతిబింబంబునం గూడుకొని యుండెడి అహంకారమునకు ఆ ప్రతిబింబంబుతోడి తాదాత్మ్యము సహజజన్య తాదాత్మమనఁబడును. అది యెటులనగా, పుట్టునప్పుడు రెండును కూడ పుట్టినవి గనుక సహజజన్య తాదాత్మ్యమని పేరు వచ్చెను. చిత్ప్రతిబింబంబును గూడి చిత్తువలెఁదోఁచునట్టి యహంకారము స్థూలదేహంబుతో సంబంధమైనప్పుడాయహం కారంబునకు స్థూలశరీరంబుతోడ తాదాత్మ్యము కర్మజన్య తాదాత్మ్య మనఁ బడును. జాగ్రద్భోగమయిన కర్మంబు జనించినప్పుడు జనించి, ఆ కర్మంబు నశించెనేని తానును నశించును గనుక దీనికి కర్మజన్మ తాదాత్మ్యమని పేరు వచ్చెను. కర్మంబు గలిగిన తాదాత్మ్యంబును గలుగును. కర్మంబు లేకున్న, తాదాత్మ్యంబును లేదనుటకు జాగ్రత్స్వప్నంబులే దృష్టాంతము. ఈ తాదాత్మ్యము వలన స్థూలదేహంబు అచేతనంబయ్యు చేతనంబువలె నయ్యెను. నేను బ్రాహ్మణుఁడను, క్షత్రియుఁడను, వైశ్యుఁడను, శూద్రుఁడను, బ్రహ్మచారిని, గృహస్థుఁడను, వానప్రస్థుఁడను, సన్యాసిని, అనే చిత్త వృత్తులతోఁ గూడుకొని యుండెడి అహంశబ్దార్థమైన సాక్షితోడి తాదాత్మ్యము భ్రాంతిజన్య తాదాత్మ్య మనఁబడును. సర్వాధిష్ఠానమయిన ఆత్మస్వరూపము తానని యెఱుఁగనందువలన వచ్చినది గనుక దీనికి భ్రాంతిజన్య తాదాత్మ్య మని పేరు వచ్చెను. ఈ ప్రకారంబుగా సహజజన్య తాదాత్మ్యంబు, కర్మజన్య తాదాత్మ్యంబు, భ్రాంతిజన్యతాదాత్మ్యంబునని మూఁడు తాదాత్మ్యంబులు చెప్పఁబడెను గదా. ఈ తాదాత్మ్యత్రయంబునకు నివృత్తి యెప్పుడనిన, సంబం ధమయిన చిచ్ఛాయ అహంకారమయి యెంతపర్యంతంబుండునో, అంత పర్యంతంబును సహజజన్య తాదాత్మ్యంబునకు నివృత్తి రానేరదు. ఆ యహం కార మెప్పుడు నశించునో, అప్పుడే సహజజన్య తాదాత్మ్యంబునకు నివృత్తియని తెలుసుకోవలసినది. ప్రతినిత్యమును కర్మప్రదమయిన కర్మము సుషుప్తి కాలమందు నాశంబు కలుగుచుండఁగా ఆ కర్మజన్య తాదాత్మ్యంబునకు నాశమని కనుఁగొనవలసినది. ఇది సర్వానుభవసిద్ధము. ఈ తాదాత్మ్యంబునకు విదేహ కైవల్యంబునందు అత్యంతిక నాశము. భ్రాంతిజన్య తాదాత్మ్యము నేను బ్రహ్మమనెడి జ్ఞానము పుట్టినపుడు నశించును. విద్యారణ్య స్వాములవారు ‘‘ఉద్ధృత్య వివేకమందు’’ ఈ చొప్పుననే నిరూపించినారు. మేము ఎక్కడెక్కడ నేవేని నిరూపించి యున్నారమో అవి యన్నియు శాస్త్రంబులయందు నిరూపించి యుండునవి యని తెలుసుకోఁదగినది. ఈ యర్థమందు సంశయము లేదు గనుక నెవఁడు ఈ తాదాత్మ్యత్రయంబును విచారించి యిది యహంకారంబునకే కాని అహంకార సాక్షియు, నిర్వికారుడు, నసంగుఁడు నైన తనకు (ఆత్మకు) లేదని యెఱుఁగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.

ఇది ఏకోనచత్వారింశద్వర్ణకము.