49. మనోనిగ్రహ నిరూపణము

ఏకచత్వారింశద్వర్ణకము
49. మనోనిగ్రహ నిరూపణము

            మనస్సు చంచలము. ఒక దిక్కున నుండెడిది కాదు. తనతోఁగూడి యుండెడి పురుషునిఁ దప్పింపఁజేయును. ఒక విషయంబునందుఁ  బడియెనేని, దీని దప్పింపఁగూడదు. మిక్కిలి వేగముగల వాయువును, నిగళంబులు ద్రెంచుకొని పారిపోవునట్టి యేనుఁగును అడ్డగింప నెటుల వశముగాదో అటులే మనస్సును నిలుప వశముగాదని అర్జునుఁడు భగవంతుని గూర్చి చెప్పినాఁడనియును, సముద్రంబునైన పానంబు సేయ వచ్చును, మేరుపర్వతంబునైనఁ బెల్లగింపవచ్చునుగాని, చిత్తనిరోధంబు చేయుట అశక్యమని వసిష్ఠుఁడు శ్రీరామున కుపదేశించినాఁడనియును గీతయందును జ్ఞానవాసిష్ఠమందును చెప్పఁబడియున్నది. ఆ భగద్వసిష్ఠులే చిత్తనిరోధంబు దుర్లభంబని చెప్పిరని ఆ వాక్యములను విడిచిపెట్టి లోక మందు కొందఱు చిత్తనిరోధబు కఠినమని చెప్పెడి కావ్యములను మాత్రము విని, చిత్తనిరోధ మెవరికిని సర్వాత్మనా కూడదని నిశ్చయించి వేదాంత విచారమందు అధికారియే లేఁడని చెప్పుచున్నారు. వారి మాటలను విని మఱికొందరు జనులు భ్రమియించుచున్నారు. వారల యొక్క భ్రమను పోఁగొట్టుటకై చిత్తనిరోధము మిక్కిలి సులభమనుటను దృష్టాంత పూర్వ కంబుగ నిరూపించుచున్నారము. మనస్సు ఒంటిపసరంబు వంటిది. ఒంటి పసరము సర్వదా పైరునుగూర్చి పోవును. పట్టవచ్చినఁ బారిపోవును. దానిని బ్రయాసమునఁ బట్టి తెచ్చి గృహంబునందుంచి దానిముందుఁ గసవు వేసినట్లయిన ఆ కసవు నాఘ్రాణించి పైరునే చింతించుచుండును. కొంతసేపు ఈ ప్రకారంబుగా నుండిన తరువాత దానిని విడిచిపెట్టి రేని, అది మరల పైరును గూర్చియే పోవును. మరునాఁడును మునుపటివలెనే పట్టి తెచ్చి గృహమందు కట్టివేసి కసవు ప్రత్తిగింజలు తవుడు మొదలగువానిని వేసి రేని, దాని నించుకసేపు భక్షించి తిరుగా నా పైరునే ధ్యానించుచుండును. మరల దానిని విడిచిపెట్టుచు పట్టితెచ్చి కట్టివేయుచు రాఁగా రాఁగా ఇంటి తిండి అభ్యాసమై బైట తోలినప్పటికిని తిరుగా గృహంబునకే వచ్చును. పైరుమీది యిచ్ఛ మాని గృహంబునందే యుండును. కాఁబట్టి యభ్యాస వశంబున నొంటిపసరము గృహమందు కట్టఁబడినట్లు మనస్సును నభ్యాసముచేత నిలుపవచ్చును.

            అది యెటువలె ననఁగా, నిత్యమును దనకభీష్టమయిన మూర్తిని రెండు గడియలు ధ్యానము సేయునపుడు ఆ చిత్తంబు తిరుగా విషయంబు లయందే వ్యాపించుచుండును. దానిని తిరుగా ఆ మూర్తిని ధ్యానించునట్లు త్రిప్పి విడచుట యభ్యాసము. ఈ ప్రకారమే మఱునాఁడు నాలుగు గడి యలు, ఆమఱునాఁ డాఱుగడియలు, ఆమఱునాఁడెనిమిది గడియలు ధ్యానంబు చేయుచు రాఁగా నీయభ్యాసము వలన చిత్తము నెక్కడ నిలిపిన నక్కడ నిలుచును. అనేక జన్మంబులయందు చేసిన విహిత కర్మములనెల్ల నీశ్వరార్పణంబుగాఁ జేయుచు రాఁగా నొక జన్మమునందు పురుషునికి చిత్తము పరిపక్వమవును. తరువాత విషయములందు దోషదృష్టి కలుగును. పిదప ఆ విరించ్యాదులు మిథ్యయని బ్రహ్మలోక తృణీకారము కలుగును. అదియే వైరాగ్యమని చెప్పఁబడును. అట్టి వైరాగ్య పురుషుని చిత్తంబు శ్రవణాదుల యందెక్కడ నిలిపినను చంచలము లేక నిలుచును. కాఁబట్టి చిత్తనిరోధంబు సర్వత్ర సాధ్యంబు గాకపోయినను ఈశ్వర సద్గురు కటాక్షము గల వారికి అభ్యాస వైరాగ్యంబుల చేత చిత్తనిరోధము సులభసాధ్యంబుగానే యుండును  గనుక, వేదాంత విచారమందు సాధన చతుష్టయ సంపన్నుడైన అధికారి లేడని భ్రమించవలసినది లేదు. ఈ చిత్త నిరోధము కఠినంబు గాదు. సులభంబే యనుటకు సమ్మతి వచనంబులు:

శ్లో||  చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్‌
            తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌
            అబ్ధిపానాదపి హతః సుమేరూన్మూలనాదపి
            అపవర్ణ్యావనాత్సాధో విధుతశ్చిత్తనిగ్రహః
            అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌
            అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే
            అపి వ్రజ్యాతదళనాదపి లోచనమీలనాత్‌
            సుకరో హరివృత్తిత్వా నక్లేశా ప్రమనాగపి

            ఈ ప్రకారంబుగా విచారించి వైరాగ్యమును సంపాదించి వైరాగ్య పూర్వకంబుగ శ్రవణాదులు చేసి జ్ఞానము నెవఁడు సంపాదించుచున్నాడో వాఁడు ముక్తుఁడని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.


ఇది ఏకచత్వారింశద్వర్ణకము.