51. సుఖదుఃఖ విచారఘట్టము

త్రిచత్వారింశద్వర్ణకము
51. సుఖదుఃఖ విచారఘట్టము

            లోకమందు వేదాంతులకంటె నన్యులలో కొందఱు విద్వాంసులు మరి కొందఱు తార్కికులు మరికొందఱు పామరులునై యున్నారు. వీరందఱును ఆభాసశాస్త్రపురాణాదులను జదివి విని అదే సత్యమని యెంచుకొని, కొమాళ్ళు గలవారికి ఇహలోకమందును పరలోకమందును సుఖము కలదు. కొమాళ్ళు లేనిచో నిహపరములయందును సుఖము లేదు అని కొందఱు చెప్పగా విని మఱికొందఱు భ్రమసియున్నారు. వారల యొక్క భ్రమను పోఁగొట్టుటకై కొమాళ్ళు కలవారికే దుఃఖ మధిక మనెడి శాస్త్రంబును విచారించి ముముక్షువులయినవారు కొడుకులు మొదలయిన వారి యందు మమకార ముంచుకొనక ఆత్మస్వరూపుఁడై తనయందే పరమప్రీతిని కల్పించుకొని ఆత్మనిష్ఠుఁడై యుండవలయుననుటను నిరూపించు చున్నారము. అది యెటులనఁగా

శ్లో||  అలభ్యమానస్తనయః పితరౌ క్లేశయే చ్చిరమ్‌
           లబ్ధో ఽపి పిండపాతేన ప్రసవేన చ బాధతే
           జాతస్య గ్రహరోగాది కుమారస్య చ ధూర్తతా
           ఉపనీతేఽప్య విద్యత్వ మనుద్వాహశ్చ పండితే
           యౌవనశ్చ పరదారాది దారిద్య్రం చ కుటుంబినః
           పుత్రో దుఃఖస్య నాస్త్యంతో ధనీ చే త్మ్సృ తయే తథా
           ఏవం వివిచ్య పుత్రేఽసౌ ప్రీతిం త్యక్త్వా నిజాత్మని
           నిశ్చిత్య పరమప్రీతీం వీక్ష్యతే తదహర్నిశమ్‌

అని యీ ప్రకారంబుగ చెప్పుట వలన కొడుకులుపుట్టియుఁ బుట్టకయు తల్లిదండ్రులకు సర్వదా క్లేశమునే యిచ్చుచున్నారు. అది యెటువలె ననిన, కొడుకులు లేనివారలు సంతానము లేదనే దుఃఖము చేతనొక బ్రాహ్మణుని బిలిచి మాకు పుత్రులు లేకపోయిరే యిఁక మాకేమి గతియని యడిగితే మీరు పాపకర్ములు కాఁబట్టి సంతానము లేనివారలైతిరి. రామేశ్వరంబు మొదలయిన పుణ్య తీర్థంబులయందు స్నానంబుచేసి వచ్చితి రేని మీ పాపం బులు నశించును. పుత్రులు కలుగుదురని ఆ బ్రాహ్మణుఁడు చెప్పఁగానే ఆ మాటలను విని అదే ప్రకారముగా అనేక దినములు తీర్థయాత్రలు చేసి అక్కడక్కడ కాలానుసారంబుగ కాయక్లేశాది సకల దుఃఖంబులు ననుభ వించియు నిష్టసిద్ధి పొందనేరక మరియొక శాస్త్రజ్ఞుని రావించి మాకు కొమా రుఁడు లేక పోయెనే, ఇందుకేమి చేయవచ్చునని యడిగితే, అతఁడు మీకు ప్రతిబంధములు కలిగియుండుటచేత మ్రుగ్గులు వేసి మంత్రింపించి ఆ ప్రతిబంధంబులను బాపుకొంటిరేని పుత్రులు కలుగుదురని చెప్పఁగానే వా రామంత్రవాది మాటలను నమ్మి యేవిధంబున నయిన మాకు కొమారుఁడు కలుగునట్లు చేయవలయునని అతని వేడుఁకొని అందుకుఁ దగిన ప్రయత్నంబు చేయఁగా, ఆ మంత్రవాదియు పుట్టమ్మ, మాచకమ్మ, మాతంగి, సహాదేవి మొదలయిన వారలకు తృప్తి చేయవలెనని వారిచేత విశేషంబుగ ద్రవ్యవ్యయంబు చేయించి మోసగించును. అందుచేతను కొమారుఁడు కలుగకపోవుటకు దుఃఖించి మరియొక కర్మఠుని యొద్దకు పోయి మాకు సంతానము లేకపోయెనే మాగతి యేమియని యడిగితే మీరు మహా పాపాత్ములరు గనుక సంతానంబు లేకపోయెను. దంపతులయిన మీరి ద్దరును నిరాహారులయి మిక్కిలి నియతితో నోటిబీగాలు వేసుకొని తిరుపతికి పోయి వేంకటేశ్వరులను దర్శించి నూఱుమాడలు కానుకపెట్టి ఆ దేవుని నుద్దేశించి అనేక సమారాధనలు దీపారాధనలు మొదలయినవి చేసి, నియ మము దప్పక యింటికివచ్చి యింటిలో తిరుగా బ్రహ్మణ సంతర్పణలు చేయించినచో మీకు కొమాళ్ళు కలుగుదురు. సందేహంబు లేదని చెప్పఁగా అతని వాక్యములు నమ్మి విశ్వాసయుక్తులై ఆ ప్రకారమే సకలంబును చేసి అప్పటికిని సంతానంబు లేక దుఃఖపరంపరలో మునుఁగుచుఁ దేలుచు నుండుదురు. కాఁబట్టి లేని పుత్రుఁడు తల్లిదండ్రులను బహు దుఃఖంబులను బెట్టుచున్నాఁడనుటకు సంశయంబు లేదు.

            కలిగిన పుత్రుఁడు దుఃఖపెట్టుట యెటువలెననిన, దైవాధీనంబున సంతానకాంక్ష కల్గినవారికి తనంతటనే గర్భము నిలిచినట్లయితే గర్భము ధరించిన కొన్ని దినంబుల కొకకర్మవశము వలన గర్భపాతమౌను. అందు వలన తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖింతురు. అటులగాక ఆ గర్భము పది నెలలు నిండునంతవరకు నిలిచియుండిన యెడల ప్రసవ కాలమందు ప్రసవ వేదనచేత తల్లికి బహు బాధలు కలుగును. ఆ బాధలు చూడఁజాలక మంత్రసాని మొదలైనవారు అయ్యా తిరుమలభట్లూ మీ భార్య ప్రసవ వేదనచేత మిక్కిలి బాధపడుచున్నది. ప్రార్థన లేమైననుండెనేని చేసుకొనుఁడు అని చెప్పుదురు. అప్పుడతఁడు నేను సమస్త ప్రార్థనలు మునుపే చేసుకొని యున్నాను. కుమారునికి ఆశపడినందుకు పెద్ద ప్రాణికే హాని వచ్చెనుగదా! ఇంక నేమి చేతును? అది బ్రతికితే చాలును. దేవుఁడు మమ్మును సకల విధములను దుఃఖపెట్టుచున్నాఁడనును. అందువలననుం తల్లిదండ్రులకు దుఃఖమే కలుగుచున్నది. ఒకవేళ సుఖముగా ప్రసవించినట్లయినచో ఆ పుట్టినవానికి ముట్టుదోషము పక్షిదోషము మొదలైన దోషంబులు తాకును. అది చూచి తల్లిదండ్రులు వానికి రక్షలు కట్టించి విభూతి మంత్రింపించి బహు శ్రమపడి పెంచుదురు. అటువలె రాక నిశ్చింతగా పెరిగిన యెడల ఆ కుమారుఁడు పదియేండ్లవాఁడై మిక్కిలి దుర్మార్గముచేత నూరిలోని చిన్న వాండ్రనందఱను కొట్టి తాను వారి చేతనుం దెబ్బలు దిని వచ్చి తన పెద్దలకును నూరిలోని పెద్దలకును కలహము పెట్టును గనుక, ఇందు చేతను తల్లిదండ్రులకు దుఃఖమే కలుగును. అటువలెఁగాక బుద్ధిమంతుఁడై  యుండెనేని వానికి ఉపనయనము చేసి వానిని చదువవేతురు. వాఁడు చదువురానివాఁడయ్యెనేని వాని మూఢత్వము నెంచక చదువు చెప్పెడి యుపాధ్యాయునితో మాచిన్నవానికి చదువు చెప్పక మావద్ద ద్రవ్యము తీసుకొని తింటివి. నీకు ఋణముండి యిచ్చితిమని జగడము వేయుదురు. అందువలనను తల్లిదండ్రులకు దుఃఖమే కలుగుచున్నది. మఱియు నా కుమారుఁడు విద్యా విహీనుఁడుగాక చదువరి యయ్యెనేని వానికి వివాహము చేయవలయునని కన్యకలు గలవారి యిండ్లకు పోయి పడుచుల నడిగిన నొకరు ముప్పది వరహాలియ్యవలయుననియు, మఱి యొకరు నలువది వరహాలిమ్మనియు నడుగునపుడు తమకు ద్రవ్యోపపత్తి లేకపోయెనుగదా? యనియు, ఇంకొకరు కన్యాప్రదానము చేయుటకు సమ్మతి పడినను వధూవరుల రాశి నక్షత్రంబులు అనుకూలంబులు గాక పోవుట వలన నది తమ యిష్ఠానుసారంబుగాఁ గుదిరియు ననుకూలించక పోయెను గదా యనియును దుఃఖింతురు. కాఁబట్టి ఇందువలనను ఆ కుమారుఁడు తల్లిదండ్రులకు దుఃఖమునే సంపాదించుచున్నాఁడు.

            అట్లుగాక అన్ని విషయంబులును జక్కపడి వివాహ మయ్యెనేని తరువాత ఆ పడుచు పోది గలిగి యుండక క్షయరోగివలె చిక్కిపోయి పుడకవలె నుండిన దానికి తల్లిదండ్రులు కూశ్మాండఘృతము మొదలయిన ఔషధంబులు చేయుచుండఁగా జూఁచి ఆ కుమారుఁడు కామాతురుఁడయి భార్యను తనకుపయోగింపదని యెంచి జారుఁడయి పరస్త్రీలను గలయు చుండును. అప్పుడు అపకీర్తికి హేతువులయిన వాని పనులు చూచి నగరి వారు విని దండనబెట్టింతురు. ఇందువలనను తల్లిదండ్రులకు దుఃఖమే కలుగుచున్నది. ఇట్లుండునపుడు ఆ పుత్రుని యొక్క భార్య యెదిగి సంసారం బునకు వచ్చి దానికి బిడ్డలు గలిగినట్టయిన అప్పుడు సంసార బాహుళ్యంబు వలనను తమ దారిద్య్రదశ వలనను బిడ్డలతోడ పుత్రుఁడు కష్టపడుచుండగాఁ జూచి తల్లిదండ్రులు దుఃఖించుదురు. అప్పుడు తటస్థులు వారలను చూచి యేల దుఃఖించెదరని యడిగితే పిన్న వాండ్రకు కట్టుకోవడమునకు బట్టలు లేవు. కడుపుకు అన్నము లేదు. ఇది చూచి మేము తాళలేము. మాకు మరణంబు సంప్రాప్తంబు గాకపోయెను. అని బహువిధంబుల దుఃఖించు చున్నారు. ఇందువలననుం దల్లిదండ్రులను పుత్రుఁడు దుఃఖపెట్టు చున్నాఁడు. ఈ ప్రకారంబుగ పుత్రులు గలిగినను కలుగకున్నను తల్లి దండ్రులకు దుఃఖమే కలుగుననుటకు చక్కగా విచారించి అందువలన ఇహపరములు రెంటియందును సుఖము లేదని తెలుసుకొని ముముక్షువులైన వారలు పుత్రమిత్ర కళత్రాదులయందు ప్రీతిని వదలి ఆత్మ స్వరూపుఁడైన తనయందు పరమప్రీతి నునిచి సర్వదా ఆత్మనిష్ఠుఁడై యుండవలయుననియు, అద్వితీ యాత్ముఁడు తాననియు నెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంతశాస్త్ర సిద్ధాంతము.

ఇది త్రిచత్వారింశద్వర్ణకము.