52. ఆత్మప్రియత్వ నిరూపణము

చతుశ్చత్వారింశద్వర్ణకము
52. ఆత్మప్రియత్వ నిరూపణము

శ్లో||  విత్తాత్పుత్రః ప్రియః పుత్రాత్‌ స్వపిండం చ తథా ప్రియమ్‌
        ఇంద్రియాశ్చ ప్రియాః ప్రాణాః ప్రాణా దాత్మా పరః ప్రియః

            విత్తమునకన్న పుత్రుఁడు ప్రియుడు. పుత్రునికన్న శరీరము ప్రియము. శరీరముకన్న ఇంద్రియంబులు ప్రియంబులు. ఇంద్రియంబుల కన్న ప్రాణంబులు ప్రియంబులు. ప్రాణంబులకన్న ఆత్మ ప్రియుఁడు అని విచారించవలెను. అది యెటువలె ననిన లోకమందు పుత్రుఁడైనవాఁడు అకృత్యము చేసినప్పుడు వానిని నగరివారు దండన చేయుటకు ప్రయత్నపడి రేని వాని తల్లిదండ్రుల కా కొమారుఁడు దండిపఁబడుట సంహించక యింట నుండెడి పదార్థంబుల నెల్ల నగరివారికి లంచమిచ్చి ఆ పుత్రుని విడిపించుకొనుచున్నారు. కాఁబట్టి విత్తముకన్న పుత్రుఁడు ప్రియుడాయెను. ఆ యకృత్యము చేసిన పుత్రుని లంచములు తీసుకొని వదలక, వాని దండనకు నీవు లోఁబడితే వానిని వదలెదమని నగరివారు చెప్పినచో ఆ తండ్రియైనవాఁడు అందుకు సమ్మతించక ఆ నగరితో  నాకును చిన్న వానికిని, సంబంధము లేదని చెప్పి తాను తప్పించుకొనవచ్చును. కాఁబట్టి పుత్రునికన్న శరీరంబు ప్రియంబు. మఱియును అకృత్యము చేసిన యే పురుషుఁడయినను నగరివారు దండించునపుడు వానికండ్లు పొడువుఁడని చెప్పినచో అప్పుడా పురుషుడు శరీరదండనంబునకు సమ్మతించి ఇంద్రియంబులను గూర్చి మండ్రాడుచున్నాఁడు. కాఁబట్టి శరీరముకన్న ఇంద్రియంబులు ప్రియంబులు. ఆ యకృత్యము చేసిన వానిని నగరివారు శరీరముతో వదలక తలఁగొట్ట నాజ్ఞాపించిరేని నింద్రియములను విడిచి తలను గూర్చి మండ్రాడుచున్నాఁడు గనుక, ఇంద్రియంబుల కన్న ప్రాణంబులు ప్రియంబులు. అటువలెనే తాను పరలోకమందును సుఖంబుగ నుండవలయునని ఇచ్ఛ యించుచున్నాడు. ప్రాణంబును త్యజించుటకు సమ్మతించినవాడు పరంబు నందిచ్ఛ యుంచుచున్నాఁడు గనుక, ప్రాణంబు కన్న ఆత్మ ప్రియుఁడు. ఈ ప్రకారంబుగ విచారించి పుత్ర మిత్ర కళత్ర దేహేంద్రియాదులనెల్ల దుఃఖరూపంబుగ నెఱింగి వానియంద భిమానంబును వదలి ప్రియతముఁడైన తన్ను ఆత్మగా నెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడు ముక్తుఁడని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.


ఇది చతుశ్చత్వారింశద్వర్ణకము.