54. ఆత్మానాత్మ వివేక నిరూపణము

            ఆత్మ యనంగా నెవ్వరనిన, స్థూల సూక్ష్మ కారణములకంటె వ్యతి రిక్తుఁడై అవస్థాత్రయ సాక్షియై నిత్యుఁడై నిర్వికారుఁడై పుణ్యపాపంబుల చేత స్పృశింపఁబడనివాఁడై సర్వసంబంధ శూన్యుఁడై సత్యుఁడై కాలత్రయా బాధ్యుఁడై పరమానంద స్వరూపుఁడైనవాఁడు ఆత్మయని చెప్పఁబడును. అనాత్మ యనఁగా సమష్టి స్వరూపమైన స్థూల సూక్ష్మ కారణ శరీరంబులు అనాత్మయని చెప్పఁబడును. స్థూలశరీరమనగా నెయ్యది యనిన పంచీకృత భూతకార్యమై ప్రారబ్ధ కర్మంబుచేత సంపాదింపఁబడినదై జీవుని యొక్క కర్మానుభవ ఫలరూపమయిన సుఖదుఃఖముల యొక్క భోగమునకు ఆశ్రయ స్థానమయినది స్థూలశరీరమని చెప్పఁబడును.
ఇందుకు సమ్మతి:

శ్లో||  పంచీకృత మహా భూతసంభవం కర్మసంచితమ్‌
            శరీరం సుఖదుఃఖానాం భోగాయతన ముచ్యతే

            ఈ స్థూలశరీరమే అన్నమయ కోశమని చెప్పఁబడును. అన్నమయ కోశమనఁగా తల్లిదండ్రుల చేత భుజింపబడిన అన్నము వలనఁబుట్టిన శుక్ల శోణితంబులచేత నే దేహంబు పుట్టెనో తరువాత క్షీరాన్నంబుల చేత నే దేహంబు వృద్ధిఁబొందుచున్నదో ఆ దేహము అన్నమయకోశమని చెప్పఁబడును. ఈ స్థూలదేహము పుట్టకమునుపు, మరణానంతరమందును లేదు గనుకను, పంచమహాభూతంబుల యొక్క కార్యంబును దృశ్యంబును జడం బును పరిచ్ఛిన్నంబును గనుకను, కుడ్యాదుల వలెనే ఆత్మ కానేరదు. కనుక కుడ్యాది ద్రష్టయైనవాఁడు కుడ్యాదులకన్న భిన్నుండెటులో అటుల స్థూల శరీర ద్రష్టయైనవాఁడు స్థూలశరీరంబునకన్న భిన్నుఁడని విచారించి ముము క్షువైనవాఁడు ఆ స్థూలదేహసాక్షి చేతనుఁడైన ఆత్మ నేనని యెఱుఁగవలెను.

సూక్ష్మశరీరమనఁగా అపంచీకృత భూతకార్యమయిన పదునేడు అవయ వములతోఁ గూడుకొనినది సూక్ష్మశరీరమని చెప్పఁబడును. ఆపదునేడవ యవంబులునేవి యనిన, జ్ఞానేంద్రియపంచకంబును, కర్మేంద్రియ పంచకంబును, ప్రాణాదిపంచకంబును, మనస్సును, బుద్ధియు గూడి పదునేడవయవంబులని చెప్పఁబడును.

శ్లో||  పంచప్రాణమనోబుద్ధి దశేంద్రియసమన్వితమ్‌
            ఆపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగసాధనమ్‌

            ఈ సూక్ష్మదేహము కోశత్రయాత్మకమని చెప్పఁబడును. కోశత్రయ మనఁగా ప్రాణమయకోశమనియు, మనోమయకోశమనియు, విజ్ఞానమయ కోశమనియు మూఁడు విధంబులు. ప్రాణమయకోశమనఁగా పదివయవయ వంబులతోఁ గూడుకొని యుండును. ఆ పదియవయవంబులు నేవియనిన అపంచీకృత భూతకార్య మహాభూతంబుల యొక్క ఆదియైన రజోభాగంబు వలన ప్రత్యేక ప్రత్యేకంబులుగా క్రమంబుగా బుట్టిన వాక్పాణి పాద పాయూపస్థలనెడి పేరు గలిగిన కర్మేంద్రియంబులు, ఆ భూతంబుల యొక్క రజోగుణ సమష్టి వలన బుట్టిన ప్రాణాపానోదాన వ్యానసమానంబు లనెడి పేరు గలిగిన ప్రాణాది పంచకంబులును, ఇవి పదియుంగూడి ప్రాణమయ కోశమని చెప్పఁబడును. మనోమయకోశమనఁగా అదియు నాఱవయ వంబులతోఁ గూడుకొని యుండును. ఆ యాఱవయవంబులు నేవి యనిన, ఈ చెప్పఁబడిన అపంచీకృత పంచమహాభూతంబుల యొక్క ఆదియైన సత్త్వగుణ భాగంబుల వలన ప్రత్యేక ప్రత్యేకంబుగా క్రమంబుగాఁబుట్టిన త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబులనెడి పేరు గలిగిన జ్ఞానేంద్రియంబులును, ఆ భూతంబులయొక్క సమష్టి వలనఁ బుట్టిన సంశయాత్మకమయి అంతఃకరణ వృత్తిరూపమయిన మనస్సును, ఈ యాఱవయవంబులును మనో మయకోశమని చెప్పఁబడును. విజ్ఞానమయకోశమనఁగా అదియు నాఱవ యవంబులతోఁ గూడుకొని యుండును. ఆ యాఱవయవయంబు లెయ్యవి యనిన, ఈ చెప్పఁబడిన శ్రోత్రాదిజ్ఞానేంద్రియంబులును, ఆ భూతంబుల యొక్క సత్త్వగుణ సమష్టి వలనఁబుట్టిన నిశ్చయాత్మకమయిన అంతఃకరణ వృత్తి రూపకమయిన బుద్ధి యీ యాఱును గూడి విజ్ఞానమయకోశమని చెప్పఁబడును. ఈ కోశత్రయమును లింగశరీరమందే అంతర్భూతము. ఈ లింగశరీరము దృశ్యంబును జడంబును పరిచ్ఛినంబును భూత కార్యంబును శరీరియుఁ గనుక, స్థూలశరీరంబువలెనే ఆత్మ కానేరదు. అయిన నీలింగశరీరంబునకు భూతకార్య మెట్లనిన, ‘అన్నమయంహి సౌమ్య మన ఆపోమయః ప్రాణస్తేజోమయీవాగనెడి శ్రుతిచే నిశ్చయింప బడుచున్నది. కాబట్టి యీ శరీరమును భూతకార్యమే కనుక, స్థూలదేహంబు వలెనే దీనికి దృశ్యత్వంబును, జడత్వంబును, పరిచ్ఛిన్నత్వంబును, వికారత్వంబును నిశ్చయింపఁబడుచున్నది. స్థూలదేహద్రష్టయైన నేను  స్థూల దేహము కన్న నెటుల భిన్నుఁడనో అటులనే లింగదేహద్రష్టయైన నేను ఆ లింగదేహంబుకన్న భిన్నుఁడను, ఆ లింగ దేహంబునకు సాక్షియని నిశ్చయించుకోఁదగినది. కాఁబట్టి శరీరమనఁగా నేది యనిన, హేతువై అనాదియై అనిర్వచనీయమై నిరుపాధికమయన బ్రహ్మజ్ఞానంబు చేతను నశింపఁబడునదై భావరూపమై జడమై మోహాత్మకమయిన ఆత్మ ఆశ్రయంబు గాఁ గలిగినదై బ్రహ్మవారక మయినటువంటి ఆత్మజ్ఞానంబు కారణ శరీరమని చెప్పఁబడును. ఇందుకు సమ్మతి:

శ్లో||  అనాద్యవిద్యానిర్వాచ్యా కారణోపాధి రుచ్యతే
            ఉపాధిత్రితయాదన్య మాత్మాన మవధారయేత్‌

            కారణశరీరమే ఆనందమయకోశమని చెప్పఁబడును. దీనికి ఆనందమయకోశత్వ మెట్లనిన ప్రియ మోద ప్రమోదవృత్తి మంతమగు అంతఃకరణము ఉపసర్జనంబుగాఁ గలిగినది గనుక, ఆనందమయకోశమని చెప్పఁబడును. ప్రియ మోద ప్రమోద వృత్తులనఁగా, ఇష్టమయిన వస్తువును చూచిన మాత్రముచేత వచ్చునట్టి సంతోషంబునకు ప్రియమని పేరు. ఆ వస్తువు లభించిన వెనుక వచ్చిన సంతోషమునకు మోదమని పేరు. ఆ వస్తువును భుజించినందువల్ల గలిగిన సంతోషము ప్రమోదమని చెప్పఁబడును. ఈ యజ్ఞానంబునకు భావరూపత్వ మెట్లనిన, నేను అజ్ఞుఁడను జడుఁడను మోహితుఁడను అసంతుష్టుఁడనని సమస్త ప్రాణులచేత అజ్ఞానం బనుభవింపఁబడుచున్నది. ఈ యజ్ఞానంబునకు దృశ్యత్వమెట్లనిన నేను అజ్ఞానిని, నాయజ్ఞానంబు నన్ను బాధించుచున్నది, నాయజ్ఞానంబు వెనుక ముందర తోఁచనీయలేదని సాక్షియైన నాచేత నెఱుఁగఁబడుచున్నది గనుక, నజ్ఞానంబునకు జడత్వంబును మోహత్వంబును నిశ్చయింపఁదగినది. ఈ ప్రకారంబుగాఁ జెప్పఁబడిన యుక్తులచేత పంచకోశ స్వరూపంబునకు శరీర త్రయంబునకు అనాత్మత్వంబు స్పష్టంబుగా నిశ్చయింపఁబడుచుండఁగా నేసాక్షి స్వరూపమయిన బోధ శేషించుచున్నదో ఆ యాత్మ శరీరత్రయముకన్న విలక్షణుఁడయిన ప్రత్యగాత్మయని చెప్పఁబడును. ఆ ప్రత్యగాత్మ నేనని ముముక్షువుచేత నిశ్చయించుకొనఁదగినది. చెప్పఁబడిన యుక్తులచేత పంచ కోశాత్మకమయిన శరీరత్రయమునకు ఆత్మత్వంబు కూడదు. కనుక నెవఁడు దేహేంద్రియాది విలక్షణుఁడయిన ఆత్మ నేనని యెఱుఁగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము  అవస్థాత్రయ మనఁగా జాగ్రదవస్థ యనియు, స్వప్నావస్థయనియు, సుషుప్త్యవస్థయనియు మూఁడు విధంబులు. ఇందులో జాగ్రదవస్థ శ్రోత్రమాదిగాఁ గలిగిన యింద్రియంబుల చేత శబ్దాది విషయజ్ఞాన మెంత పర్యంతము వచ్చుచున్నదో అంతపర్యంతమును జాగ్రద వస్థయని చెప్పఁబడును. ఈ జాగ్రదవస్థయందును స్థూలశరీరమందును అభిమానముగల ఆత్మకు విశ్వుఁడనియు, వ్యావహారికుఁడనియు, చిదా భాసుఁడనియు మూఁడు పేళ్ళు. అవి ఎట్లనిన సమస్తమందును అభిమానంబు సేయుచున్నాఁడు గనుక విశ్వుఁడని పేరు. సమస్త వ్యవహా రంబులును సేయుచున్నాఁడు గనుక వ్యావహారికుఁడని పేరు. చిత్తు వలెనే తోఁచుచున్నాడుఁ గనుక చిల్లక్షణంబు లేనివాఁడు గనుక ఇతనికి చిదా భాసుఁడని పేరు. ఇట్లు వ్యష్టిస్వరూపంబు నిరూపించితిమి. ఈ స్థూల శరీరంబును సమష్టి వ్యష్టిభేదంబులచేతను రెండు విధంబులై యుండును. సమస్త జాగ్రదవస్థలయందును సమష్టి స్థూలశరీరమందును అభిమానము గల ఆత్మకు విరాట్టనియు, వైశ్వానరుఁడనియు, వైరాజసుఁడనియు మూఁడుపేళ్ళు. అది యెట్లనిన నానా విధంబులుగా దోఁచుచున్నాఁడు గనుక విరాట్టనియు, సమస్త నరులయందును నేనని అభిమానంబు చేయుచున్నాఁడు గనుక వైశ్వానరుఁడనియు, విశేషంబుగా దోఁచుచున్నాఁడు గనుక వైరాజసుఁడనియు పేళ్ళు వచ్చెను. స్వప్నావస్థ యేది యనిన, జాగ్రద్వాసన వల్లఁ బుట్టిన విషయంబుతోఁ గూడుకొని యుండెడి జ్ఞానంబు స్వప్నావస్థ యని చెప్పఁబడును. ఈ స్వప్నావస్థయందును సూక్ష్మశరీరమందును, అభిమానముగల ఆత్మకు తైజసుఁడనియు, ప్రాతిభాసికుఁడనియు, స్వప్న కల్పితుఁడనియు మూఁడు పేళ్ళు. అది యెట్లనిన తేజోరూపమైన అంతఃకరణ వృత్తితోఁ గూడుకొన్నాఁడు  గనుక తైజసుడనియు, తోఁచేకాలమందు మాత్రమున్నాఁడు గనుక ప్రాతిభాసికుఁడనియు, అజ్ఞాన కార్యమయిన నిద్రా శక్తితో కల్పింపబడును గనుక స్వప్న కల్పితుఁడనియు మూఁడు పేళ్ళు వచ్చెను. స్థూలశరీర వ్యష్టి నిరూపించితిమి. ఇఁక సూక్ష్మశరీర వ్యష్టిని నిరూపించుచున్నారము.

            ఈ సూక్ష్మశరీరంబు సమష్టి వ్యష్టి బేధంబులచేత రెండు విధంబులై యుండును. సమస్త స్వప్నావస్థయందును సూక్ష్మశరీర సమష్టియందును అభిమానముగల ఆత్మకు హిరణ్యగర్బుఁడనియు సూత్రాత్ముఁడనియు ప్రాణుఁడనియు, మూఁడు పేళ్ళు. అది యెట్లనిన, జ్ఞానశక్తి గలవాఁడు గనుక హిరణ్యగర్భుండనియు నానా విధంబులయిన మణులయందు కూర్పఁబడిన సూత్రంబువలెనే నానా విధ ప్రపంచమందును అనుస్యూతుఁడై యున్నాఁడు గనుక సూత్రాత్మయనియు, క్రియాశక్తితోఁ గూడుకొని యున్నాఁడు గనుక ప్రాణుఁడనియు మూఁడు పేళ్ళు వచ్చెను. సుషుప్త్యవస్థ యనఁగా నేది యనిన, సమస్త విషయజ్ఞానంబు లేకుండుట యేది కలదో అది సుషుప్తియని చెప్పఁబడును. ఈ సుషుప్త్యవస్థయందును కారణ శరీర మందును అభిమానించిన ఆత్మకు ప్రాజ్ఞుఁడనియు, పారమార్ధికుఁడనియు, అపరిచ్ఛిన్నుఁడనియు మూఁడు నామధేయంబులు చెప్పఁబడును. అవి యెట్లనిన, స్వప్రకాశ స్వరూపుఁడు గనుక ప్రాజ్ఞుఁడనియు, అవస్థా త్రయంబుల యందనుస్యూతుండయి యున్నాడు గనుక పారమార్థికుఁడనియు, దేహేంద్రియాద్యుపాధులచేత నపరిచిన్నుఁడు గనుక అపరిచ్ఛిన్నుఁడనియు మూఁడు పేళ్ళు. సూక్ష్మశరీర వ్యష్టి నిరూపించితిమి. కారణశరీర సమష్టిని నిరూపిఁచుచున్నారము.

            ఈ కారణశరీరంబును వ్యష్టి సమష్టి రూపంబుల చేత రెండు విధంబులై యుండును. సమస్త సుషుప్తవ్యవస్థయందును కారణ శరీర సమష్టి యందును అభిమానముగల ఆత్మకు ఈశ్వరుఁడనియు అంతర్యామి యనియు అవ్యాకృతుఁడనియు మూఁడు పేళ్ళు. అది యెట్లనిన సమస్త ప్రాణులను శిక్షింపుచున్నాఁడు గనుక నీశ్వరుఁడనియు, సమస్త ప్రాణుల యొక్క హృదయమందును ఉండి సమస్త ప్రాణులను ప్రేరేపించుచున్నాడు గనుక అంతర్యామియనియు, నామరూపరహితుఁడయి యున్నాఁడు గనుక అవ్యాకృత్యుఁడనియు మూఁడు పేళ్ళు వచ్చెను. ఈ ప్రకారంబుగా వ్యష్టి సమష్టి శరీరత్రయంబు జాగ్రత్స్వప్న సుషుప్తులను వ్యష్టి సమష్ట్యభిమానులను స్పష్టంబుగ నిరూపించితిమి. ఈ చెప్పఁబడిన శరీరత్రయంబునకన్న అన్యమై ముప్పదియాఱు తత్త్వంబులుండగా వానిని చెప్పకయే శరీరత్రయంబు మాత్రము చెప్పితిరి. ఆ ముప్పది యాఱుతత్త్వంబులను చెప్పలేదనిన, ఆ ముప్పది యాఱు తత్త్వంబులును శరీరత్రయమందే అంతర్భూతములును ఆ శరీరత్రయంబు చెప్పినందున ఆ ముప్పదియాఱు తత్త్వంబులు చెప్పఁ బడెను. అయిన ఆ ముప్పదియాఱు తత్త్వములు నేవి యనిన, ఆకాశాది పంచమహాభూతములును, ఆకాశాదులకు గుణములయిన శబ్ద స్పర్శ రూప రస గంధములును, త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వా ఘ్రాణములును, వాక్పాణి పాద పాయూపస్థలును, ప్రాణాపానవ్యానోదానసమాన వాయువులును, నాగకూర్మ కృకర దేవదత్తధనంజయములను, ఉపవాయువులును మనోబుద్ధి చిత్తాహం కారములు ననెడి అంతఃకరణ చతుష్టయమును ఒకటియైన అవిద్యయును, ముప్పదియాఱవ వాఁడై  పశుతుల్యుఁడైన జీవుఁడును కూడి ముప్పదియాఱు తత్త్వములని చెప్పఁబడును. ఐన నీముప్పదియాఱు తత్త్వములకన్న భిన్నుఁడైనవాఁడు పరమశివుఁడని చెప్పఁబడును.
ఇందుకు సమ్మతి:

            ఆకాశాదీని భూతాని పంచ తేషాం ప్రకీర్తితా
            గుణాశ్శబ్దాదికం పంచ పంచ కర్మేంద్రియాణి చ
            జ్ఞానేంద్రియాణి పంచైతే ప్రాణాదిదశ వాయవః
            మనోబుద్ధిరహంకారశ్చిత్తం చేతి చతుష్టయమ్‌
            తేషాం  కారణభూతైకావిద్యా షట్త్రింశతః పశుః
            విశ్వస్య జగతః కర్తా పశోరస్య పరశ్శివః.

            ఇట్లే ముప్పదియాఱు తత్త్వములును నిరువది నాల్గు తత్త్వముల లో నంతర్భూతములని నిశ్చయించి యీ యిరువదినాల్గు తత్త్వములే చాలునని చెప్పినారు. ఆ యిరువదినాలుగు తత్వములేవి యనిన, జ్ఞానేంద్రి యపంచకము, కర్మేంద్రియపంచకము, ప్రాణాదిపంచకము,శబ్దాది పంచక మును గూడి అంతఃకరణ చతుష్టయముతో యిరువది నాలుగు తత్త్వములని చెప్పఁబడెను.

శ్లో||  జ్ఞానేంద్రియాణి పంచైవ పంచ కర్మేంద్రియాణి చ
            తథా ప్రాణాదయః పంచ పంచశబ్దాదయ స్తథా
            మనోబుద్ధి రహంకారశ్చిత్తం చేతి చతుష్టయమ్‌
            ఇత్యాదికాని తత్త్వాని చతుర్వింశతికాని వై
            ప్రాహుర్వివేకిన ఇతి సమ్యక్శాస్త్త్రేషు నిశ్చితమ్‌.

ఇఁకను ఇంద్రియాద్యదిష్ఠాన దేవతలను నిరూపించుచున్నారము.

శ్లో||  దిగ్వాతార్కప్రచేతోర్వివహ్నీంద్రోపేంద్రమృత్యుకాః
            తథా చంద్రశ్చతుర్వక్త్రో రుద్రక్షేత్రజ్ఞ ఈశ్వరః.

            ఇటువలెనే తదధిష్ఠాన దేవతలను నిరూపించినారము. శ్రోత్రాది జ్ఞానేంద్రియము లకు, శబ్ద స్పర్శ రూపరసగంధములును, వాగాది కర్మేంద్రి యములకు, వచనాదానగమన విసర్గానందములును విషయములు. అంతఃకరణ చతుష్టయమునకు సంకల్ప నిశ్చయాభిమానవధారణములు విషయములు. ఈ ప్రకారంబుగా విచారించి శరీరత్రయ విలక్షణుఁడై అవస్థా త్రయరహితుఁడై అఖండ సచ్చిదానంద స్వరూపుడైఁన ప్రత్యగాత్మయే నేనని లక్ష్యార్థముచే నెవ్వఁడెఱుంగుచున్నాఁడో వాఁడే బ్రహ్మము. ఈ యర్థమందు సంశయము లేదు, సిద్ధము. ఈ యర్థమందు శ్రుతిస్మృతులు ప్రమాణంబులు.
‘‘బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి సర్వం అభయం వై బ్రహ్మాప్యేతి, తరతి శోకమాత్మవిత్‌, తత్రకో మోహః కశ్శోక ఏకత్వ మనుపశ్యతః, అభయం వై ప్రాప్నోతి’’.

           
‘‘అవ్యక్తో ఽయమచింత్యోఽయమవికార్యోఽయముచ్యతే
            తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హ’’ సీతి భగవద్వచనాత్‌

            ఆత్మానాత్మ వివేకేన పునస్సంసారనిర్వృతిః
            తద్వినా జన్మకోట్యాపి బంధచ్ఛేదో న సిధ్యతి
            ఆత్మానాత్మ వివేకం తు కృత్వా తిష్ఠతి యః పుమాన్‌
            జటీముండీ శిఖీ వాపి ముచ్యతే నాత్ర సంశయః

            ఇవి మొదలైన శ్రుతి స్మృతులు ప్రమాణము లున్నవి గనుక ముముక్షువులైన వారలు ముక్తి విషయమయి సంశయింపవలదు.

ఇది షట్చత్వారింశద్వర్ణకము.

శ్రీ వాసుదేవమననము సంపూర్ణము

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు