10. ఆత్మానాత్మ వివేక ప్రకరణము

సప్తమ వర్ణకము
10.   ఆత్మానాత్మ వివేక ప్రకరణము
           
శ్లో||  ఆత్మానాత్మ వివేకేన మునిర్ముచ్యేత బంధనాత్‌
         స ఆత్మా కీదృశః కోవా ఆత్మా వేత్త్యత్ర చింత్యతే

            ఆత్మానాత్మ వివేకము చేతనే జ్ఞానముదయించునని చెప్పఁబడెను గాన, నాయాత్మానాత్మలను విచారింపుదము. ఆత్మ యనఁగా, శరీరత్రయ విలక్షణుఁడై, అవస్థాత్రయసాక్షియై, పంచకోశవ్యతిరిక్తుఁడై, సచ్చిదానంద స్వరూపుఁడై యుండునట్టివాఁడు.  అనాత్మ యనఁగా సమష్టి వ్యష్ట్యాత్మకమైన శరీరత్రయము. ఇందులకు లక్షణంబు లనృత జడ దుఃఖంబులు. మహాజన మన సమష్టి, పురుషుండన వ్యష్టి, వనమన సమష్టి, వృక్షంబన వ్యష్టి, ఇటులనే పదార్థంబులు కూడిన సమష్టియు, ఒక పదార్థము వ్యష్టి యనియును ఎటుల చెప్పఁబడుచున్నదో అటుల దార్టా్షంతికమందును సమస్త ప్రాణులయొక్క శరీరంబులు సమష్టి. ఒక్క ప్రాణి శరీరము వ్యష్టి. ఈ శరీరము స్థూలము, సూక్ష్మము, కారణము అని మూడు విధంబులు. ఈ శరీరత్రయములోపల సమస్త ప్రాణుల యొక్క స్థూలశరీరంబులును సమష్టి  స్థూలశరీరంబనియు, సమస్త ప్రాణుల యొక్క సూక్ష్మశరీరంబులును సమష్టి సూక్ష్మశరీరంబనియు, సమస్త ప్రాణులయొక్క కారణశరీరంబులును సమష్టి కారణశరీరంబనియు, ఒక ప్రాణి యొక్క స్థూలశరీరము వ్యష్టి స్థూలశరీరంబనియు, ఒక ప్రాణి యొక్క కారణశరీరము వ్యష్టి కారణ శరీరంబనియు, ఈ ప్రకారముగా సమష్టి వ్యష్టి వివరణం బెఱుంగందగినది. ఇటుల యెందుకుఁ జెప్పవలయుననిన, ఆత్మకు జీవత్వంబును నీశ్వరత్వంబును వచ్చుట కొఱకై చెప్పవలెను. ఈశ్వరత్వ జీవత్వములాత్మకిక మీఁదనా రాఁబోవుచున్నవి యన, ఈశ్వరత్వంబును జీవత్వంబును ఉపాధి చేత ననాదిగా వచ్చి యుండునవి. అయినప్పటికిని ఆత్మకు ఈశ్వరత్వంబును జీవత్వంబును ఉపాధిచేత వచ్చినవి యని యెవ్వరు నెఱుంగక వాస్తవంబు లని తలంతురు? అందువలన దోషంబేమి యనిన, నెంత పర్యంతము వాస్తవ మని తెలిసికొనుచున్నారో అంతపర్యంతంబును వారలకు సంసార బంధంబువలన నివృత్తి కలుగనేరదు. కాఁబట్టి సర్వప్రజా మాతృభూతమైన శ్రుతి ఈశ్వరత్వ జీవత్వంబులు ఉపాధిచేత వచ్చుననుటకై సమష్టియని యును, వ్యష్టియనియును విభాగించి చెప్పుచున్నది. అయిన ఏయుపాధిచేత నీశ్వరత్వము, ఏయుపాధిచేత జీవత్వము వచ్చుననిన, సమష్టి శరీరత్రయో పాధిచేత నీశ్వరత్వంబును, వ్యష్టి శరీరత్రయోపాధిచేత జీవత్వంబును వచ్చుచున్నది. ఈశ్వరత్వంబునందు సమష్టి కారణ శరీరము మాత్రము చాలును. అయిన సమష్టి స్థూల సూక్ష్మ శరీరంబుల నెందుకు చెప్పవలెననిన ఉపాసనార్థమై చెప్పఁబడుచున్నది. అది యెట్లనిన ముఖ్యాధికారియైన వానికి సమష్టి కారణశరీరోపాధికుఁడైన ఆత్మ యుపాస్యుఁడై చెప్పఁబడుచున్నాఁడు. ఇతనికి నీశ్వరుఁడనియు, నంతర్యామి యనియు, నవ్యాకృతుం డనియు పేళ్ళు. మఱియు నతనికి సమష్టి కారణశరీరంబునందభిమానంబు గలదనిన, అభిమానం బహంకారధర్మం బగుటవలనను, ఆ యవస్థయం దహంకారంబు లేదు. గావున అభిమానము కలదని చెప్పఁగూడదు. ఆత్మకు సమష్టి కారణశరీరవిశిష్ట మాత్రత్వమే యీశ్వరత్వమని చెప్పవలెను. ఈ యీశ్వరుని నుపాసింప నోపనివారలకీ యీశ్వరున కవస్థాంతరంబగు సమష్టి సూక్ష్మశరీరోపాధికు నుపాసింపవచ్చునని శ్రుతి చెప్పుచున్నది. ఈ సూక్ష్మ శరీరోపాధికుఁడైన యీశ్వరునికి హిరణ్యగర్భుఁడనియు, సూత్రాత్మ యనియు, ప్రాణుఁడనియు పేళ్ళు. ఇతనికి నీసమష్టి సూక్ష్మశరీరంబునందు అభిమానము లేదనిన, అభిమానమునకు ఆశ్రయమైన స్థూలశరీరము లేదు గనుక, అభిమానము కలదని చెప్పఁగూడదు. సమష్టి సూక్ష్మశరీరవిశిష్ట మాత్రత్వమే హిరణ్యగర్భత్వమని చెప్పవలెను. ఇతని నుపాసన చేయుటయందు సమర్థతలేనివారు ఈ యీశ్వరునకు అవస్థాంతరంబైన సమష్టి స్థూలశరీరోపాధికు నుపాసింపవచ్చునని శ్రుతి చెప్పుచున్నది. ఇతనికి విరాట్టనియు, వైశ్వానరుండనియు, వైరాజసుండనియు మూఁడు నామ ధేయములు. ఇతనికి సమష్టి స్థూలశరీరంబునందు అభిమానము లేదా? యనిన, నియతమైన శరీర మొకటి లేదు. గనుక అభిమానము కలదనిచెప్పఁ గూడదు. మరియెటుల ననిన, ఆ యీశ్వరునికి సమష్టి స్థూలశరీరమాత్రత్వ మీశ్వరత్వమని చెప్పవలెను. అంతర్యామియైన యీశ్వరుఁడే సాత్త్విక రాజస తామస గుణంబుల నవలంబించి సృష్టి స్థితి సంహారంబుల కొఱకు బ్రహ్మ దేవుఁడనియును, విష్ణువనియును, రుద్రుఁడనియును ఎప్పుడు చెప్పబడుచున్నాఁడో, దుష్ట నిగ్రహ శిష్టపరిపాలన కొరకై రామకృష్ణాద్యవ తారముల నెప్పుడెత్తుచున్నాఁడో అప్పుడు ఆ యంతర్యామియయిన యీశ్వరునికి ఆయా శరీరములందు సృష్టిస్థిత్యాద్యభిమానంబు కలదు. అభిమానము లేదని చెప్పెదమనిన, సృష్టి స్థితి సంహారాదులు కూడవు గనుక, అభిమానము కలదని చెప్పవలెను. అయిన జీవునికి నీశ్వరునికి వైలక్షణ్యం బేమి యనిన, జీవునకు అహంతా మమతాపూర్వకంబుగా స్వశరీరాదుల యందు అభిమానంబున్నది. ఇటువలె నీశ్వరునకు లేదు గనుక, జీవునకును నీశ్వరునకును ఇటువలె వైలక్ష్యంబు గలదు. ఈశ్వరునకు లోకసంరక్షణార్థ మగు అభిమానము స్వాభావికంబుగ లేదు. ఈ యీశ్వరుఁడే ప్రతిమాదుల యందుపాస్యుఁడై చెప్పఁబడుచున్నాఁడు. ఇటుల నెందుకు చెప్పవలయు ననిన, విరాడుపాసనయందు నధికారులయిన వారలకు త్రిమూర్తుల నుపాసింపవలయుననియు, ఆ త్రిమూర్త్యుపాసన యందు అనధికారులైన వారలకు రామకృష్ణాద్యవ తారాదుల నుపాసింప వలయుననియు, ఆ యవతారముల యొక్క ఉపాసనయందు అనధికారులైన వారలకు ఆయవతార సూచకములైన తామ్రాది ప్రతిమాదుల నుపాసింప వలయుననియు శాస్త్రములు చెప్పుచున్నవి. సర్వజనులు నేయేమూర్తుల నుపాసింపుచున్నారో ఆయామూర్తుల ద్వారా ఈశ్వరుండంతర్యామియై యుపాసిఁపబడుచున్నాడు. ఈ మూర్త్యాదుల నుపాసింపుమని చెప్పు శాస్త్రములకు తాత్పర్య మేమన క్రమక్రమముగా నంతర్యామి స్వరూపంబు నెఱుంగవలయు. ఇటుల సమష్టి త్రయోపాధి వలని యీశ్వరత్వంబు వచ్చినది. జీవత్వంబెవ్విధంబున వచ్చెననిన, వ్యష్టి శరీరత్రయోపాధి వలన వచ్చినది. జీవత్వంబునకు శరీరత్రయము కావలెను. అది యెట్టులనఁగా జీవుడంతఃకరణ ప్రతిబింబుండు గావున జీవత్వంబునందు సూక్ష్మశరీరంబును గావలయును. స్థూలశరీరము లేక కర్తృత్వము కూడదు గనుక, ఈ రెంటికిని కారణంబగు కారణ శరీరంబును గావలెను. ఈ ప్రకారముగా జీవిత్వమునందును, శరీర త్రయంబును గావలెను. జీవుని కీశరీరత్రయంబునందును అభిమానము కలదా యనిన, అభిమానంబు కర్తృత్వము లేక కూడదు గనుక, శరీర త్రయంబునందును అభిమానము కలదు. అయిన నీజీవులు ఎందఱన, ముగ్గురు. వారల నామధేయంబులెవ్వి యనిన, జాగ్రదవస్థ యందును, వ్యష్టి స్థూలశరీరంబు నందును అభిమానంబుగల జీవునికి విశ్వుండనియును, వ్యావహారికుఁడనియును, చిదాభాసుఁడనియును, మూఁడు నామంబులు. స్వప్నావస్థ యందును, వ్యష్టి సూక్ష్మశరీరంబునందును అభిమానముగల జీవునికి తైజసుఁడనియును, ప్రాతిభాసికుఁడనియును, స్వప్నకల్పితుఁడనియును మూఁడుపేళ్ళు. సుషుప్త్యవస్థ యందును వ్యష్టి కారణ శరీరమునందు అభిమానముగల జీవునికి ప్రాజ్ఞుఁడనియును, పారమార్థికుఁడనియు, అవచ్ఛిన్నుండనియును మూఁడు నామధేయములు. ఈ ప్రకారముగా ఆత్మ సమష్టి శరీరత్రయముచేత నీశ్వరత్వమును వ్యష్టి శరీర త్రయముచేత జీవత్వమును వచ్చెను. ఒక ఆత్మకే రెండైన ఈశ్వరత్వ జీవత్వము లెటుల కూడునన, దృష్టాంతము :

            ఒక దేవదత్తునికి పుత్రు నపేక్షించి పితృత్వంబును, పౌత్రు నపేక్షించి పితామహత్వంబును వచ్చినట్టు ఒకటైన ఆత్మకు వ్యష్ట్యుపాధి నపేక్షించి జీవత్వమును సమష్ట్యుపాధి నపేక్షించి ఈశ్వరత్వంబును వచ్చెను. అయితే పితృపితామహత్వధర్మంబులతోఁ గూడుకొనియుండెడి దేవదత్తునియందు కించిద్‌జ్ఞత్వ సర్వజ్ఞత్వాదులు కానము. జీవేశ్వరత్వాది ధర్మములతోఁ గూడుకొనియుండెడి ఆత్మయందు కించిద్‌జ్ఞత్వసర్వజ్ఞత్వములు కానఁబడుచున్నవే. ఈ దేవదత్తదృష్టాంతం బెటువలె కూడుననిన, ఒకఁడైన ఆత్మకు ఉపాధిద్వయము వలన నీశ్వరత్వ జీవత్వంబులు రావచ్చుననుటకు ఈ దేవదత్తదృష్టాంతంబు జెప్పితిమి. ఇకను ఆత్మకు మహదుపాధి చేతను సర్వజ్ఞత్వంబును కించిదుపాధిచేతను కించిద్‌జ్ఞత్వంబును రావచ్చుననుటకు దృష్టాంతము చెప్పెదము. ఏకంబగు జలంబునకు చెరువనియెడి మహదుపాధిచేతను, అనేక కేదారంబులను పండించెడి శక్తిత్వంబును, సమస్త ప్రాణులకును, స్నానపాకాదిక్రియలను చేయించెడి శక్తిత్వంబును, ఘటంబను నల్పోపాధిచేతను, పానపాకాది క్రియల నొనర్చు నంతటి శక్తిత్వంబును నెటుల వచ్చుచున్నవో అగ్నికి గొప్పవత్తి యనెడి యుపాధి చేత, దూరంబున నుండెడి పదార్థములను తోపింపఁజేసెడి శక్తిత్వంబును, చిన్నవత్తి యనెడి యుపాధిచేత, సమీపంబు నందుండెడి పదార్థములను మాత్రమే తోపింపఁజేసెడి శక్తిత్వంబును నెటువలె నున్నదో అటువలెనే ఒకఁడయిన ఆత్మకు మహత్తైన సమష్టి శరీరోపాధిచేత, సర్వ జ్ఞత్వాదులును వ్యష్టి శరీరోపాధిచేత కించిద్‌ జ్ఞత్వాదులును రావచ్చును. ఈ ప్రకారముగ నీశ్వరత్వ జీవత్వంబులు ఆత్మకు ఉపాధిచేత వచ్చినవో లేక పరమార్థము నందు వచ్చినవో అనిన, పరమార్థమందు జీవేశ్వరులకు భేదంబు లేదని శ్రుతులు చెప్పుచున్నవి. విరుద్ధ ధర్మములతోఁ గూడుకొనియుండెడి జీవేశ్వరుల కభేదము కూడును. అది యెటులన, పూర్వోక్తదృష్టాంతమందు విరుద్ధ ధర్మములతోఁ గూడుకొని యుండెడి చెరువనే యపాధియుక్త జలంబు నకును ఘటమనే యుపాధియుక్తజలంబునకును విరుద్ధాంశంబు లయిన చెరువు ఘటమనెడి యుపాధులను విడిచి అవిరుద్ధాంశంబగు జలత్వము చేతను ఏక్వత్వజ్ఞానం బెటుల వచ్చునో విరుద్ధ ధర్మసహితంబగు పెద్దవత్తి యనెడి ఉపాధికాగ్నికిని చిన్నవత్తియనెడి ఉపాధికాగ్నికిని విరుద్ధాంశము లయిన పెద్ద పిన్న వత్తియనెడి యుపాధులను విడిచి అవిరుద్ధమయిన అగ్ని మాత్రము చేతను నేకత్వజ్ఞాన మెటుల వచ్చునో అటులనే విరుద్ధ ధర్మంబులగు సర్వజ్ఞత్వాదులతోఁ గూడుకొనిన యీశ్వరునికిని, యీ విరుద్ధ ధర్మములైన కించిద్‌జ్ఞత్వాది ధర్మంబులతోఁ గూడుకొనిన జీవునికిని విరుద్ధాంశములైన సర్వజ్ఞత్వ కించిద్‌జ్ఞత్వాదులను విడిచి అవిరుద్ధమయిన చైతన్య మాత్రంబునకు నేకత్వ జ్ఞానము కూడును. ఈ యర్థమే సకల శాస్త్రంబులయందును సో ఽయం దేవదత్తఃఅనియెడి దృష్టాంత పూర్వకంబుగా మహావాక్యంబునకు అర్థమని జహదజహల్లక్షణము చేతను చెప్పఁబడుచున్నది. కాఁబట్టి ఈ ప్రకారముగా విచారించి యెవఁడు తాను బ్రహ్మస్వరూప మని యెఱుంగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని సిద్ధాంతము.

            శ్లో||  సమష్టివ్యష్టి రూపాయ సృతిజాడ్యాదిలక్షణమ్‌
                       జీవేశయోరుపాధిశ్చ నాత్మా సమ్యగ్వివేచితః
                       సమష్టివ్యష్ట్యుపాధిభ్యాం జీవ ఈశ్వర ఇత్యపి
                       భిన్న వద్భాతి యస్సో ఽయ మాత్మా భిన్నశ్చ వస్తుతః
                       మయి జీవత్వమీశత్వం కల్పితం వస్తుతో నహి
                       ఇతి యస్తు విజానాతి స ముక్తో నాత్ర సంశయః

ఇది సప్తమ వర్ణకము