11. శరీరత్రయ విలక్షణ ప్రకరణము

అష్టమ వర్ణకము
11.   శరీరత్రయ విలక్షణ ప్రకరణము

            శ్లో||  స్థూలం సూక్ష్మం కారణం వా శరీరం కిం తవాత్మనః
                       విలక్షణత్వ మేతేభ్యః కిం వేత్యేతద్విచింత్యతే

            ఆత్మ శరీరత్రయ విలక్షణుం డని చెప్పఁబడెను. శరీరత్రయము నెఱుఁగక శరీరత్రయవిలక్షణత్వము నెఱుఁగఁగూడదు. కనుక శరీర త్రయస్వరూప మేదని విచారింపుదము. శరీరత్రయ మనఁగా, శరీరము స్థూలము, సూక్ష్మము, కారణము అని మూఁడు విధంబులు. స్థూలశరీర మనఁగా, కరచరణాద్యవయవాకారమయిన స్థంభమువలెఁ దోఁచు నట్టిది. సూక్ష్మశరీరమనఁగా, పదునేడవయవములతోఁ గూడుకొని యుండునట్టిది. కారణశరీరమనఁగా అజ్ఞానము. వీటికి శరీరములని పేరు.

            ఈ పేరు ఎందుకు వచ్చిన దనిన, జీర్ణించిపోవుటచేత శరీరమని పేరు వచ్చినది. అయితే యీ శరీరములు జీర్ణించి పోవుచున్నవా యనిన జీర్ణించి పోవుచున్నవి. అది యెటులనిన ఈ స్థూలశరీరము మూఁడు విధములుగా జీర్ణించిపోవుచున్నది. ఆ మూఁడు విధము లెయ్యవియనిన అన్నము లేకను, అన్నము కలిగిన యెడల వ్యాధులచేతను, అన్నము గలిగి వ్యాధి రహితముగా నుండెనేని ముదిమిచేతను జీర్ణించి పోవుచున్నది. సూక్ష్మశరీరమునకు జీర్ణత్వ మెటులనిన వృద్ధిపూర్వకంబుగాఁ జెప్పఁబడును. వృద్ధి యనఁగా రాగద్వేషాద్యాకారంబుగాఁ బరిణమించుట. వాని యొక్క సంకోచము జీర్ణత్వము. సూక్ష్మకారణ శరీరములకు వృద్ధి సంకోచంబు లెవరియందు కానఁబడుచున్న వనిన, అజ్ఞానంబునందు వృద్ధియు, ముముక్షుత్వంబునందు సంకోచంబును గానఁబడుచున్నవి. కాబట్టి వీనికి శరీరమని పేరు వచ్చినది.

            దేహములని పేరు ఎందుకు వచ్చిన దనిన, దహింపఁబడుచున్నవి కావున, దేహములు. ఈ దేహములు దహింపఁ బడుచున్నవా అనిన దహింపఁబడుచున్నవి. అగ్నిచేత భస్మాకారములుగా దహింపఁబడునవి కొన్ని శరీరములే కదా ! అన్ని శరీరంబులును దహింపఁబడుచున్న వని యెటుల చెప్పవచ్చు. స్థూలశరీరము సర్వదా తాపత్రయములచేత దహింపఁబడుచున్నది. సూక్ష్మ కారణ శరీరంబులకు దహ్యమానత్వ మెటువలె ననిన జ్ఞానాగ్నిచేత దహింపఁబడుచున్నవి గనుక, ఈ శరీరత్రయంబునకును దేహములని పేరు వచ్చినది.

            పూర్వ శరీరంబునకు స్థూలమని పేరు ఎందుకు వచ్చిన దనిన స్తంభమువలెనే ప్రత్యక్షముగఁ దోఁచుచున్నది గనుక, దానికి స్థూల శరీరమని పేరు వచ్చినది. మధ్య శరీరమునకు సూక్ష్మశరీరమని పేరు ఎందుకు వచ్చెను ? పూర్వ శరీరమువలె స్థూలముగా కనుపడలేదు. గనుక దీనికి సూక్ష్మశరీరమని పేరు వచ్చెను. దీనికే లింగశరీరమని పేరు ఎందుకు వచ్చినదనిన, లీనమయి శబ్దాది విషయముల నంగీకరింపుచున్నది. గనుక ఆత్మను నిర్లక్షణముచేత తెలియపఱచుచున్నది గాన, లింగ శరీరమని పేరు వచ్చినది. పశ్చిమశరీరమునకు కారణశరీరమని పేరు ఎందుకు వచ్చిన దనిన, ఈ రెండు శరీరములను బుట్టింపుచున్నది గనుక కారణశరీరమని పేరు వచ్చినది.

            స్థూలశరీరము ప్రత్యక్షంబుగాఁ గనుపడుచున్నది గావున స్థూలశరీరము కలదని చెప్పవచ్చును. స్థూల శరీరమువలె సూక్ష్మశరీరము ప్రత్యక్షంబుగాఁ గనుపడలేదే. స్థూల శరీరవ్యతిరిక్తమయిన సూక్ష్మశరీరము గలదని యెటుల నెఱుంగవచ్చును? పదునేడు విధంబులగు కార్యంబుల వలన సూక్ష్మశరీరంబు గలదని యెఱుంగవచ్చును. ఈ పదునేడు విధంబులగు కార్యంబులును స్థూలశరీరంబుచేతఁ జేయఁబడుచున్నవి. సుషుప్తి మూర్ఛావస్థలయం దుండెడి శరీరంబుచేత పదునేడు విధంబులగు కార్యంబు లునుం జేయఁబడవలయును. అటులను జేయఁబడలేదు. కాన స్థూల శరీరము యొక్క కార్యములని చెప్పగూడదు. మరి దేనియొక్క కార్యములని చెప్పవలయు? స్థూలశరీరవ్యతిరిక్తమయిన సూక్ష్మశరీరము యొక్క కార్యములేయని చెప్పవలయును. సూక్ష్మశరీరము స్థూలశరీరమును విడిచి స్వతంత్రంబుగా నొక కార్యంబును జేయలేదు గాన సూక్ష్మశరీరము యొక్క కార్యాదు లని యెటుల నెఱింగెడి దనిన ఎఱుంగవచ్చును. అగ్ని హోత్రము కాష్ఠాదులనాశ్రయించి దహనపాకాది క్రియలను చేసినప్పటికిని ఆ దహనపాకాది క్రియలు కాష్ఠాదుల యొక్క క్రియలు గాక, కాష్ఠవ్యతిరిక్త మయిన అగ్ని యొక్క క్రియలెటువలె నగుచున్నవో అటులనే సూక్ష్మశరీరము, స్థూలశరీరము నాశ్రయించి పదునేడు విధములయిన కార్యములను జేసినప్పటికిని కేవల స్థూలశరీరముయొక్క కార్యములు కావు. స్థూలశరీర వ్యతిరిక్తమయిన సూక్ష్మశరీరము యొక్క కార్యములని యెఱుంగ వచ్చును. ఈ పదునేడు విధములయిన కార్యంబు లేవి యన, కారణ నిరూపణ పూర్వకంబుగా నిరూపింపుచున్నారము.

            వీనికి కారణంబేమన సప్తదశావయవాత్మకమయిన సూక్ష్మశరీరము. ఆ సప్తదశావయవంబులు నెయ్యవి యనిన, జ్ఞానేంద్రియ పంచకంబును, కర్మేంద్రియ పంచకంబును, ప్రాణాదిపంచకంబును, చిత్తంబు తోడంగూడిన మనంబును, అహంకారంబుతోఁ గూడిన బుద్ధియును, ఈ పదునేడునుం గూడి సూక్ష్మశరీరంబని చెప్పఁబడును. జ్ఞానేంద్రియ పంచకమనగా శ్రోత్ర త్వక్చక్షుర్జిహ్వా ఘ్రాణంబులు. వీనికి జ్ఞానేంద్రియంబులని పేరు ఎటుల వచ్చె? శబ్దాది విషయజ్ఞానాదులను బుట్టింపుచున్నవి కనుక వీనికి జ్ఞానేంద్రియంబులని పేరు. ఇవి జ్ఞానజనకంబు లెందువలననయ్యె? సత్త్వగుణము వలనఁ బుట్టినవగుటచేత జ్ఞానజనకంబులాయెను. కర్మేంద్రియంబులనఁగా వాక్పాణిపాద పాయూపస్థలు. వీనికి కర్మేంద్రియంబులను నామధేయం బెందువలన వచ్చె? వచనాది క్రియలను బుట్టింపుచున్నవి కనుక కర్మేంద్రియంబులని పేరు. ఇవి క్రియాజనకంబు లెటులయ్యె? రజోగుణంబువలనఁ బుట్టిన వగుటంజేసి క్రియాజనకంబు లాయెను. ప్రాణాదిపంచకం బనఁగా ప్రాణాపానవ్యానోదానసమానములు. వీనికి ప్రాణంబులని పేరు ఎందుకు వచ్చెనన స్థూలశరీరంబును జీవించుకొనియున్నవి గావున, వీనికి ప్రాణములని పేరు. మనో బుద్ధు లనఁగా అంతఃకరణ వృత్తి విశేషములు.