14. పంచవాయువుల లక్షణము

14.   పంచవాయువుల లక్షణము

            1. ప్రాణవాయు వనఁగా, ఉచ్ఛ్వాసము దేనిచేతఁ జేయఁబడుచున్నదో అది ప్రాణవాయువు. దానికి స్థానము హృదయము. విశిష్టకుండధిష్ఠాన దేవత. ఆ యధిష్ఠాన దేవతచేతఁ బ్రేరేపింపఁబడిన ప్రాణవాయువు ఉచ్ఛ్వాస మును జేయుచుఁడును.

            2. అపానవాయు వనఁగా, నిశ్శ్వాసము దేనిచేతఁ జేయఁబడుచున్నదో అది అపానవాయువు. దానికి స్థానము గుదము. విశ్వకర్త యధిష్ఠానదేవత. ఆ యధిష్ఠానదేవత చేతఁ బ్రేరేపింపఁబడిన యపానవాయువు నిశ్శ్వాసమును చేయుచుండును.

            3. వ్యానవాయు వనఁగా, శరీరము నుద్ధరించుకొని యింద్రియాదులకు బల మిచ్చుచు నేది యున్నదో అది వ్యానవాయువు. స్థానము శరీర మాద్యంతము. విశ్వయోని యధిష్ఠానదేవత. ఆ యధిష్ఠానదేవత చేత బ్రేరేపింపఁబడిన వ్యానవాయువు ఇంద్రియాదులకు బలము నిచ్చుచు శరీరము నుద్ధరించుచుండును.

            4. ఉదానవాయు వనఁగా, సుషుప్త్యవస్థయందు సకలేంద్రియముల నుపసంహరించుకొని తనకు కారణమైన అజ్ఞానమునందు లయించుచు జాగ్రదవస్థయందు ఆయాయింద్రియముల నాయాగోళకములయందు జరుపుచు ఉత్క్రమణ కాలమునందు సకలేంద్రియములను గ్రహించుకొని లోకాంతరమునకుఁ బోవునది ఉదానవాయువు. స్థానము కంఠము. అజుం డధిష్ఠానదేవత. ఆ యధిష్ఠానదేవతచేతఁ బ్రేరేపింపఁబడిన యుదానవాయువు పైఁ జెప్పిన వ్యాపారములనెల్లఁ జేయుచుండును.

            5. సమానవాయు వనఁగా, భక్ష్య భోజ్య లేహ్య చోష్యములనియెడి నాలుగు విధములైన యాహారములను జఠరాగ్నితోఁ గూడుకొని పచనము చేసి శరీరంబునకు పుష్టిని నేది సేయుచున్నదో అది సమానవాయువు. స్థానము నాభిప్రదేశము. జయుఁడధిష్ఠానదేవత. ఆ యధిష్ఠానదేవతచేతఁ బ్రేరేపింపఁబడిన సమానమయిన అగ్నితోఁ గూడుకొని భక్ష్య భోజ్యాదులను పచనము చేసి శరీరమునకు పుష్టి సేయుచుండును. ఈ వాయువులను వీనికి చెప్పఁబడిన స్థానములును ఉనికియును కలదనుటకు సమ్మతి వచనము : శ్లో|| ప్రాణో-పాన సమానశ్చోదాన వ్యానౌచ వాయవః హృదిప్రాణోగుదే- పానస్సమానో నాభిసంస్థితః ఉదానః కంఠదేశస్థో వ్యానస్సర్వ శరీరగః అని యమర నిఘంటువునందు చెప్పియున్నది.

            అయితే, శ్రుతులయందుఁ దశవాయువులు చెప్పఁబడియుండఁగా పంచవాయువులని యెటుల చెప్పవచ్చు ననిన, ఆవాయువులు ఈ పంచ వాయువులలో నంతర్భూతములు గనుక, పంచవాయువులని చెప్పవచ్చును. అయినప్పటికిని ఆ వాయువులను వివరించుచున్నారము. అవి యెవ్వి యనిన, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అని యైదు ఉపవాయువులు. వీనియొక్క వ్యాపారము లెవ్వియనిన, నాగవాయువు వాంతి చేయించును. కూర్మవాయువు పెదవులను కంటి ఱెప్పలను మూయుటకును, తెఱచుటకును కారణమై యుండును. కృకరవాయువు తుమ్మునటుల చేయును. దేవదత్తవాయువు ఆవులించునటుల చేయును. ధనంజయ వాయువు శరీరమును పోషింపఁ జేయును. ఆ యుప వాయువు లైదును పంచవాయువులలో నంతర్భూతములు గాన, నా పంచవాయువుల యొక్క స్థానములు, నధిష్ఠాన దేవతలును వీనికి స్థాన, దేవతలు.