15. అంతఃకరణ చతుష్టయ వివరణము

15.   అంతఃకరణ చతుష్టయ వివరణము

1.         మనస్సనఁగా, సంకల్ప వికల్పములు దేనిచేతఁ జేయఁబడుచున్నవో, అది మనస్సని చెప్పఁబడును. దానికి స్థానము గళాంతము. చంద్రుఁడధి దేవత. ఆ యధిష్ఠానదేవతచేతఁ బ్రేరేపింపఁబడిన మనస్సు సంకల్ప వికల్ప ములను చేయుచుండును.

2.        బుద్ధియనఁగా, నిశ్చయము దేనిచేతనఁ జేయఁబడుచున్నదో, అది బుద్ధి. దానికి స్థానంబు ముఖంబు. చతుర్ముఖుండధిష్ఠానదేవత. బృహస్పతి యని శ్రీ శంకరాచార్యులు. ఆ యధిష్ఠాన దేవతచేతఁ బ్రేరేపింపఁబడిన బుద్ధి నిశ్చయమును చేయుచుండును.

3.        అహంకారమనఁగా, అభిమానంబు దేనివలన కలుగుచున్నదో అది అహంకారము. స్థానంబు హృదయంబు. రుద్రుం డధిష్ఠాన దేవత. ఆ యధిష్ఠానదేవతచేతఁ బ్రేరేపింపఁబడిన యహంకారంబభిమానమును జేయుచుండును.

4.        చిత్తమనఁగా, ధారణ దేనిచేతఁ జేయఁబడుచున్నదో అది చిత్తము. దానికి స్థానంబు నాభి. క్షేత్రజ్ఞుం డయినజీవుం డధిష్ఠానదేవత. ఆ యధిష్ఠాన దేవతచేతఁ బ్రేరేపింపఁబడిన చిత్తము ధారణమును చేయుచుండును.
            ఈ లింగశరీరము షోడశాత్మకమని యొక శ్రుతి చెప్పుచున్నది. ఆ పక్షంబునం దంతఃకరణము మాత్రమే చెప్పఁబడుచున్నది. సప్తదశలింగ మని యొక శ్రుతి చెప్పుచున్నది. ఆ పక్షంబునందు మనస్సు చిత్తము ఒకటియనియు, బుద్ధియు నహంకారంబు నొకటియనియు చెప్పబడు చున్నది. నవదశలింగమని యొక శ్రుతి చెప్పుచున్నది. ఆ పక్షంబున మనోబుద్ధి చిత్తాహంకారంబులు నాలుగని చెప్పవలెను. ఎటులఁ జెప్పినను విరోధము లేదు. ఈ చెప్పఁబడిన పదునేడు విధములయిన కార్యముల చేతను సప్తదశావయవమయిన లింగశరీరము కలదని నిశ్చయింపఁబడెను.
            కారణశరీరము కలదని యెటువలె నెఱుంగుట యనిన, స్థూల శరీరంబులు సూక్ష్మ కార్యములయి కానఁబడుచున్నవి గనుక, వీని కొక కారణము కలదని యూహింపబడుచున్నది. కార్యములచేత కారణం బూహింపఁబడును. అది యెట్లనిన, కార్యమయిన ధూమము చేత కారణం బగు నగ్ని యెటుల నూహింపఁబడుచున్నదో అటులే కార్యమయిన స్థూల సూక్ష్మశరీరములచేత కారణశరీర మొకటి యున్నదని యూహింపఁబడు చున్నది. ఇంతియే గాక అహమజ్ఞుండనని అజ్ఞానము ప్రత్యక్షముగా ననుభవింపఁబడుచున్నది. గనుక కారణశరీర మొకటి కలదని చెప్పవచ్చును. ఈ రీతిని శరీరత్రయము గలదని నిశ్చయించి ఆత్మకు శరీరత్రయ విలక్షణత్వం బెటువలెనని విచారింపవలయును. ఆత్మ విలక్షణత్వము శరీర త్రయంబునందును, శరీరత్రయ లక్షణం బాత్మయందును లేకుండుటయే శరీరత్రయవిలక్షణత్వము. ఆత్మ లక్షణం బెయ్యదియనిన, సచ్చిదానంద రూపము. అనాత్మ లక్షణము అనృతజడదుఃఖాత్మకము. ఈ లక్షణముల కన్యోన్య విలక్షణత్వము కలదు.

            ఇందుకు దృష్టాంతం బెట్లనిన, పురుషుని లక్షణములు స్త్రీ యందును, స్త్రీ లక్షణంబు పురుషునియందును నెటుల లేదో అట్లే సల్లక్షణ మసత్తు నందును అసల్లక్షణము సత్తునందును లేదు. అది యెటులనిన, ప్రకాశ లక్షణం బంధకారంబునందును, అంధకార లక్షణంబు ప్రకాశంబు నందును నేలాగునలేదో అట్లే చిల్లక్షణము జడంబునను, జడ లక్షణంబు చిత్తునను లేదు. మఱియు నెట్టులనిన, చంద్రికా లక్షణం బాతపంబు నందును, ఆతప లక్షణంబు చంద్రికయందును, నెటుల లేదో అటులే ఆనంద లక్షణంబు దుఃఖంబునందును, దుఃఖలక్షణం బానందంబునందును లేదు. ఇవ్విధంబున సత్తు చిత్తు ఆనందంబులకును, అనృత జడ దుఃఖంబులకును అన్యోన్య విలక్షణత్వము. సల్లక్షణము, అసల్లక్షణము, చిల్లక్షణము, జడ లక్షణము, ఆనందలక్షణము, దుఃఖలక్షణము నెఱుఁగకయే వీనికి అన్యోన్య విలక్షణత్వం బెఱుంగం గూడదు గాన, వీనికి లక్షణంబును జెప్పుచున్నారము. ఒకదానిచేతను బాధింపఁబడక భూత భవిష్యద్వర్త మానకాలంబు లయం దేక రూపంబుగా నుండునది సల్లక్షణము. కాల త్రయంబులయందును లేనిదై తోఁచుచు నొకదానిచేత బాధింపఁబడి నశించెడిది అసల్లక్షణము. ఇందుకు రజ్జువును, రజ్జువునందారోపింపఁబడిన సర్పమాల్యాదులును దృష్టాంతము. రజ్జువునందు సల్లక్షణము గలదు. ఎటులనిన, రజ్జువునం దారోపింపఁబడిన సర్పమాల్యాదుల లోపల నొకదాని చేతను ఆ రజ్జువు బాధింపఁబడక భ్రాంతికాలంబునందునుం, దత్పూర్వ కాలంబునందును, భ్రాంతి పరిసమాప్తి కాలంబునందును ఏక రూపంబయి యున్నది గాన, రజ్జువునందు సల్లక్షణం బున్నది. రజ్జువునం దారోపింపఁబడిన సర్పమాల్యాదులయం దసల్లక్షణము కలదు. ఎటులనిన, ఆ సర్పాది భ్రాంతి కాలంబునందును, భ్రాంతికి పూర్వకాలంబునందును, భ్రాంతి పోయిన తరువాతను, తాను లేకున్నను తోఁచి బాధింపఁబడుచున్నది గనుక, అసల్లక్షణ మాసర్పమాల్యాదులయందున్నది. రజ్జు లక్షణము సర్పంబు నందును, సర్ప లక్షణంబు రజ్జువందును లేదు. కావునను ఆ రజ్జువును సర్పాదులకు శబ్దము చేతను, అర్థము చేతను, లక్షణము చేతను ప్రతీతి చేతను, వ్యవహారము చేతను వైలక్షణ్య మెటుల నున్నదో అటులే సల్లక్షణము అసత్తైనటువంటి దేహేంద్రియాది ప్రపంచంబునందు లేదు గనుక, ఆ యసల్లక్షణము సత్తైనటువంటి ఆత్మయందు లేదు. కనుక అసత్తుసత్తులకు శబ్దము చేతను, అర్థము చేతను, లక్షణము చేతను, ప్రతీతి చేతను, వ్యవహారము చేతను వైలక్షణ్యమున్నది. ఇందువలన సిద్ధించునది యేమి యనిన, అసల్లక్షణము సల్లక్షణము కాదు. సచ్చబ్దార్థ మసచ్చబ్దార్థము కాదు. అసచ్ఛబ్దార్థము సచ్ఛబ్దార్థము కాదు. సల్లక్షణ మసల్లక్షణమును, అసల్లక్షణము సల్లక్షణంబును కాదు. సత్ప్రతీతి యసత్ప్రతీతియు, అసత్ప్రతీతి సత్ప్రతీతియును గాదు. కనుక సద్రూపమైన ఆత్మకును, అసద్రూపమయిన దేహేంద్రియాది ప్రపంచంబునకును రజ్జు సర్పంబులకువలె పైన చెప్పిన యయిదు విధంబులచేతను కాలత్రయంబునందును అన్యోన్య వైలక్షణ్యము సిద్ధించును.