19. సచ్చిదానందస్వరూప వివేచన ప్రకరణము

ఏకాదశ వర్ణకము
19. సచ్చిదానందస్వరూప వివేచన ప్రకరణము

            శ్లో||  కిమస్యసత్స్వరూపత్వం చిద్రూపత్వం కిమాత్మనః
                       కిం వానందస్వరూపత్వ మిత్యేత చ్చింత్యతే స్ఫుటమ్‌

        ఆత్మ సచ్చిదానందస్వరూపుఁడని శ్రుతులు చెప్పుచున్నవి గనుక ఆ సచ్చిదానందస్వరూపములను వివరింపుచున్నారము. సద్రూపమనఁగా, ఏ వస్తువు దేనిచేతను బాధింపఁబడక కాలత్రయంబునందు నేక రూపమయి యున్నదో ఆ వస్తువు సద్రూపము. ఈ సద్రూప మాత్మయం దున్నదా ? యనిన, ఆత్మ కాలత్రయంబునందు దేనిచేతను బాధింపఁబడక యున్నాఁడు గనుక, ఆత్మయందు సద్రూపత్వమున్నది. ఆత్మ కాలత్రయంబు నందు నున్నాఁడనుటకు ప్రమాణంబేమి యనిన, సర్వజనుల యొక్క యనుభవమే ప్రమాణము.

            సర్వజనులనఁగా నెవ్వరనిన, దరిద్రుఁడు, ధనాఢ్యుఁడు, కర్మి, భక్తుఁడు, ముముక్షువు అనువారలు. వీరలయొక్క అనుభవము చెప్పెదము. దరిద్రుఁడు, నేను జన్మాంతరంబునం దెవ్వరికి నేమియు నిచ్చిన వాఁడను కాను గనుక, నీజన్మంబునందును దారిద్య్రమే యనుభవింపుచున్నాను. ఈ జన్మంబునందును నొకనికైన నేమియు నిచ్చుటకు శక్తి లేనివాఁడ నయి యున్నాను. ఇందువలన నింకొకజన్మమునకును దరిద్రుఁడనై పుట్టుదు ననెడి దరిద్రుని యొక్క వాక్యము చేతను, ధనాఢ్యుఁడు, నేను జన్మాంతరంబు నందు పెద్దలయిన వారలకు దానముచేసి యున్నందున ఈ జన్మంబున ధనాఢ్యుఁడనై యున్నాను. ఈ జన్మంబునం దెవ్వరికేనియు నేమేనియు నిచ్చినంగదా యింకొక జన్మంబునను కలిమి గలవాఁడనై పుట్టుదు ననెడి ధనాఢ్యుని యొక్క మాటలచేతను, కర్మియైనవాఁడు, నే ననేక జన్మముల యందు సత్కర్మమునే చేసియున్నాఁడను, ఈ సత్కర్మము చేత తనకు పరలోక సౌఖ్యము కలదనెడు కర్మియొక్క పలుకులచేతను, భక్తుఁడు నే ననేక జన్మములయందు భగవంతు నుపాసించినవాఁడన్నగుటచేత నాయుపాసనా విశేషము వలన నీ జన్మంబునందును తనకు నిరతిశయమయిన భక్తి గలిగెను. ఈ భక్తి చేతను తనకు భగవత్సాన్నిధ్యము కలుగు ననెడి భక్తుని యొక్క వార్త చేతను, ముముక్షువు, నే ననేక జన్మ సంసిద్ధుఁడను. ఈశ్వరార్పణగానే సమస్త కర్మములను చేసినవాఁడను. కాఁబట్టి తనకీ జన్మంబునందు చిత్తశుద్ధియు, సద్గురులాభంబును, శ్రవణాదులును కలిగెను. నేను కృతార్థుండనైతిని. ఇఁకమీఁద తనకు జన్మములు లేవని పలికెడి ముముక్షువు యొక్క వాక్యముచేతను, తటస్థుఁడైన వివేకికి ఆత్మ కాలత్రయమునందు నున్నాఁడనెడి యనుభవము సిద్ధించెను. సమస్త జనులు నీ యయిదుగురిలో నంతర్భూతులు గనుక, నీ యయిదుగురి యొక్క అనుభవము చేతను ఆత్మకు సద్రూపత్వము సిద్ధించెను. మనము గూడ నీ యయిదుగురిలో నంతర్భూతులమే కనుక మనకును సద్రూపత్వము సిద్ధించెను. అనుభవమునకు మాత్రము సద్రూపత్వము సిద్ధించె నింతియే కాని యుక్తిచేతను సద్రూపత్వము సిద్ధింపలేదు గదా యనిన, మనము కాలత్రయంబునందున్నాము గనుక, యుక్తిచేతను మనకు సద్రూపత్వము సిద్ధించెను.

            ఇందుకు దృష్టాంతము : మన మిప్పుడున్నామో లేదో యనిన, ఉన్నాము. అయిన శరీరములమయి యున్నామో లేక అశరీరులమయి యున్నామో యనిన, అశరీరులమయి యున్న వ్యవహారము కూడదు గనుక, మనమిప్పుడు ప్రత్యక్షముగా వ్యవహారము చేయుచున్నాము గనుక, శరీరులమై యున్నాము. మన కీశరీర మెందుచేత వచ్చిన దనిన కర్మచేత వచ్చినది. ఎవరు చేసిన కర్మవలన వచ్చిన దనిన, తాను చేసిన కర్మము వలన వచ్చినది. అన్యులు చేసిన కర్మముచేత వచ్చినదని చెప్పుదమనిన, అన్యులు చేసిన అగ్నిష్టోమాదుల ఫలములు తనకు రావలెను. అట్లు రాలేదు. కాఁబట్టి అన్యులు చేసిన కర్మము వలన తనకు శరీరము వచ్చినదని చెప్పఁగూడదు. తాను చేసిన కర్మము వలననే తనకు శరీరము వచ్చినదని చెప్పవలెను. అయితే యీ జన్మమునందు చేసిన కర్మము వలననా ? లేక జన్మాంతరంబునఁ జేసిన కర్మము వలననా ? తనకు శరీరము వచ్చిన దనిన, ఈ జన్మమందుఁ జేసిన కర్మము వలన శరీరము వచ్చినదని చెప్పఁగూడదు. ఎందువలన ననిన, వృక్షనిష్ఠమయిన బీజము తనకు కారణ మయిన వృక్షంబు నెటుల పుట్టింప నేరదో అటులనే యీ శరీరమువలననే చేయఁబడిన కర్మ పశ్చాద్భావ మయియున్నది. గనుక తనకు ఆశ్రయమయి పూర్వభావి యయిన శరీరమును బుట్టింపనేరదు గనుక, ఈ జన్మమందుఁ జేసిన కర్మచేత శరీరము వచ్చినదని చెప్పఁగూడదు. జన్మాంతరమందు తాను జేసిన కర్మచేతనే శరీరము వచ్చినదని చెప్పవలెను. అయితే  జన్మాంతరమందు శరీరులమై యుండి కర్మము నొనర్చితిమో లేక అశరీరులమై యుండి కర్మము నొనర్చితిమో యనిన అశరీరులమైయుండి కర్మచేయఁజాలము గనుక, సశరీరులమై యుండే కర్మ చేసితిమి. ఆ శరీర మెందుచేత వచ్చినదనిన, దానికి పూర్వజన్మమందు చేసిన కర్మచేత వచ్చినది. ఈ యుక్తివలన మన మనేక కోటికల్పంబులయందు, శరీరులమయియుండి అనేక కోటికర్మంబులను చేయుచు నాయాకర్మముల వలన ననేక శరీరములను పరిగ్రహింపుచు నాయా శరీరనిష్ఠమయిన సుఖదుఃఖముల ననుభవించుచు అనేక కోటికల్పములయందు శరీరులమయి యుండినటుల నూహింపఁబడుచున్నారము గనుక, యుక్తి చేతను మనము భూతకాల మందును వర్తమాన కాలమందును ఉన్నామనుట సిద్ధించెను. అయితే మనకు యుక్తిచేత భవిష్యత్కాలమందు విద్యమానత్వ మెటులనిన ఇప్పుడు మనము శ్రవణ మనన నిధిధ్యాసనములచేతను, జ్ఞానము సంపాదింపక పోయినట్టయిన పూర్వజన్మమందుఁ జేసియున్న కర్మములకు ఫలభూతమయి యీ జన్మము వచ్చినటుల నీజన్మంబునం దీశరీరము చేతఁ జేయఁబడిన కర్మములకు ఫలభూతంబులగుననేకశరీరంబు లిఁకమీఁదను వచ్చును. వర్తమాన కాలంబునందీశరీర పరిగ్రహముచే బహు విధంబులగు కర్మంబుల నెటుల చేయుచున్నారమో అటులే భవిష్యత్కాలమందును శరీర  పరిగ్రహము వలన బహు విధములయిన కర్మలను జేయఁబోవుచున్నారము. ఆ కర్మంబులకు ఫలభూతంబులగు ననేక శరీరంబులును మనకు రాఁబోవు చున్నవి. ఆ శరీరపరిగ్రహము వలన ననేక విధంబులగు కర్మలను జేయుచు నాకర్మ ఫలభూతంబులయిన సుఖదుఃఖముల ననుభవించుచు ననేక కోటికల్పంబు లుండబోఁవుచున్నారమని యుక్తిచేత నూహిఁపఁబడు చున్నారము. కనుక కాలత్రయంబునందు మనము ఉన్నామనుట యుక్తి చేతను సిద్ధించెను. ప్రళయంబునందు జగత్తు బాధింపఁబడినప్పటికిని మనము బాధింపఁ బడలేదు గనుక, మన మొకదానిచేతను బాధింపఁబడ కున్నారమనుట సిద్ధించెను. మనకు నుత్పత్తి మొదలయిన వికారంబులు లేవు గాన, నేక రూపత్వంబును సిద్ధించెను. ఈ చెప్పఁబడిన సల్లక్షణంబులు మనయందు నున్నవి. కాఁబట్టి మనకు సద్రూపత్వము సిద్ధించెను.

            ఆత్మకు చిద్రూపత్వ మెటువలె ననిన, ఏ వస్తువైతే సాధనాంతరంబు నపేక్షింపక తాను తోఁచుచుఁ, దనయం దారోపింపఁబడిన సమస్త పదార్ధంబు లనుం దోపింపజేయుచున్నదో అది చిత్తని చెప్పఁబడును. ఏ సాధనాంతరంబు నపేక్షింపక తాను తోఁచుచుఁ దనయందారోపింపఁబడిన సమస్త పదార్థంబులను తోపింపఁజేయుట యనెడి చిద్రూపత్వ మాత్మయం దున్నదా యనిన, ఉన్నది. అది యెటువలె ననిన, మనచేత బాల్యము మొదలుకొని యేతావత్పర్యంతంబు నేయే వ్యాపారంబులు సేయఁబడెనో ఆయా వ్యాపారముల లోపల కొన్ని తోపక పోయినప్పటికిని, తక్కిన వ్యాపారములు ప్రకాశ సాధనములయిన ఆదిత్య, చంద్ర, నక్షత్ర, విద్యుచ్చక్షుస్సుల లోపల నొకసాధనంబు నపేక్షింపకయే గాఢాంధకారంబు నందు ముసుఁగుఁ బెట్టుకొని పండుకొని యుండినప్పటికిని మన కందఱికిని తోఁచుచున్నది గనుక, ఆత్మ స్వరూపులయిన మనయందు చిద్రూపత్వం బున్నది. అయితే బాల్యము మొదలుకొని యేతావత్పర్యంతంబును మనయం దారోపింపఁబడిన సమస్త పదార్థములలో కొన్ని పదార్థములు మాత్రమే కదా తోఁచుచున్నవి? మనయం దారోపింపఁబడిన చిద్రూపత్వము మనకు నెటుల కూడుననిన, కూడును. అది యెటువలె ననఁగా, అంతర ప్రపంచంబును, బాహ్య ప్రపంచంబును, సర్వ పదార్థములని చెప్పఁబడును. ఈ ప్రపంచద్వయంబును మనచేత తోపింపఁబడుచున్నది. బాహ్య ప్రపంచము మనచేత నెటుల తోపింపఁబడుచున్నదనిన, పృథివ్యప్తేజో వాయ్వాకాశంబులనియు, శబ్ద స్పర్శ రూప రస గంధంబులనియు, పంచీకృత భూతంబులనియు, అపంచీకృత భూతంబులనియు, బ్రహ్మాండ మనియు, చతుర్దశ భువనంబులనియు, చతుర్విధ భూత గ్రామంబులనియు, వీనికి కారణంబగు మాయ యనియు, వివిధ నామ రూప గుణ దోష వికారధర్మ శక్త్యాశ్రయమున బాహ్య ప్రపంచ మంతయును మనచేత నెఱుఁగఁబడుచున్నదో, లేక బాహ్య ప్రపంచము చేత మన మెఱుఁగఁబడుచున్నామో యనిన, బాహ్య ప్రపంచంబువలన మన మెఱుఁగఁబడలేదు గనుకను, మనచేతనే బాహ్యమయిన సమస్త ప్రపంచంబును నెఱుఁగఁబడుచున్నాది గనుకను, బాహ్య ప్రపంచంబు నెఱుఁగుచు నుండెడి మనకు బాహ్యమయిన సర్వపదార్థావభాసకత్వము సిద్ధించెను. ఆంతర ప్రపంచము మనచేత నెటుల తోపింపఁజేయఁబడు చున్నదనిన, అజ్ఞానమనియు, నన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశంబులనియును, స్థూల సూక్ష్మ కారణ శరీరంబు లనియును, షడ్భావ వికారంబులనియును, షట్కోశంబు లనియును, షడూర్ములనియును, జ్ఞానేంద్రియంబులనియును, కర్మేంద్రియంబులనియును, ప్రాణాదిపంచక మనియును, అంతఃకరణ చతుష్టయమనియును, సంకల్పాధ్యవసాయాభి మానావధారణలనియును, జాగ్రత్స్వప్నసుషుప్తులనియును, అవస్థా వ్యాపారంబులనియును, అవస్థా వాసులనియును, సమాధి మూర్ఛలనియును, మనోవాక్కాయంబు లనియును, కామక్రోధలోభ మోహమదమాత్సర్యంబులనియును, నిత్యా నిత్య వస్తు వివేకమనియును, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగమనియును, శమాదిషట్క సంపత్తియనియును, ముముక్షుత్వ మనియును, సాత్త్విక తామస రాజస గుణంబులనియును, సుఖ దుఃఖంబులనియును, జ్ఞానాజ్ఞానంబు లనియును, పంచ క్లేశంబులనియును, మైత్రీకరుణముదితోపేక్షలనియును, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగంబులనియును, ప్రత్యక్షాను మానోపమాన శబ్దాద్యుపలబ్ధంబు లనియును, రోగంబులనియును, ఆరోగ్యంబు లనియును వివిధ నామ రూప గుణ ధర్మ వికార శక్త్యాశ్రయమయిన ఆంతర ప్రపంచమంతయు మనచేత నెఱుఁగఁబడుచున్నాదో, లేక ఆ యాంతర ప్రపంచముచేత మన మెఱుఁగఁబడుచున్నామో అనిన్ష్మ ఆ యాంతర ప్రపంచంబుచేత మన మెఱుఁగఁబడలేదు గనుకను, మనచేతనే యాంతరమయిన సమస్త ప్రపంచంబు నెఱుఁగఁబడుచున్నది గనుకను, ఆ యాంతర ప్రపంచంబు నెఱుఁగుచు నుండెడి మనకు ఆంతరమయిన సర్వపదార్థావభాసకత్వము సిద్ధించెను. అందువలన మనయం దారోపింపఁబడిన సర్వపదార్థావభాసకత్వము సాధనాంతరము నపేక్షింపకయే మనకు సిద్ధించి యున్నది. అయితే, మనస్సుచేతఁ గదా సర్వంబు నెఱుఁగఁబడుచున్నదిట మనమును మనస్సు చేతనే కదా యెఱుఁగఁబడుచున్నాము? కనుక సాధనాంతర నిరపేక్షమై స్వప్రకాశత్వంబును సర్వపదార్థావ భాసకత్వంబును మన కెటుల కూడుననిన, మనస్సు వృత్తినాశమత్తై సావయవమయి పరిచ్ఛిన్నమయి దృశ్యమయి ఘటంబు చందంబున భూతకార్యంబై యున్నది గనుకఆ మనస్సునకు జడత్వమే కాని చేతనత్వము లేదు. కాఁబట్టి ఆ జడమయిన మనస్సు ఒక పదార్థంబునుం దోపింప నేరదు. ఆత్మచేత తోపింపఁబడెడి మనస్సు ఆత్మను తోపింప నేరదనుట చెప్పవలసినది లేదు. అది యెటులనిన, ఆత్మ తానయ్యే మనస్సును సమస్త పదార్థములను తోపింపుచున్నాఁడు. ఇటుల తోపించుట యందు మనస్సు ఉపాధి మాత్రము. ఇందుకు దృష్టాంతము: స్థాలియందు తైలంబువలనఁ దడుపఁబడిన వత్తి తానునుం దోపక తైలాదులను నెటుల తోపింపలేదో, అగ్ని తేజస్సైతే వత్తియను నుపాధితోఁ గూడుకొని తానును సాధనాంతరంబు నపేక్షింపక విశేషంబుగాఁ దోఁచుచు ఆ వత్తిని తైలమును స్థాలిని సమీప పదార్థంబులను నెటుల తోపింపుచున్నదో, అటుల స్థాలి స్థానమయిన స్థూల శరీరమందు తైలస్థానమయిన కర్మంబుచేత నుత్థాపితమయి వత్తిస్థానమయిన మనస్సు తోపనేరక యుండుకొని అన్య పదార్థంబులను తోపింపనేరదు. ఆత్మయైతే, యా మనస్సుతోఁ గూడుకొని తాను సాధనాంతరంబు నపేక్షింపక విశేషంబుగాఁ దోఁచుచు మనస్సును దేహేంద్రియాదులను బాహ్యాంతరంబు లగు సర్వపదార్ధంబులను తోపింపఁ జేయుచున్నది. అంతరమయిన అంతఃకరణంబును, అంతఃకరణ వృత్తులను ఎఱుఁగుటయందు ఆత్మ నిరుపాధికుఁడై యెఱుఁగుచున్నాఁడు. ఆ యాత్మ స్వరూపమే మనము గనుక, సాధనాంతర నిరపేక్షమయి స్వయంప్రకాశ మానమయిన సర్వపదార్థావ భాసకత్వము మనకు సిద్ధించెను.

            ఆత్మకు ఆనందస్వరూప మెటులనిన, నిత్యమయి నిరుపాధిక మయి నిరతిశయమయిన సుఖస్వరూపత్వం బానంద స్వరూపత్వము స్రక్చంద నాదుల వలన బుద్ధికి సర్వోత్కృష్టమయి సర్వదుఃఖ నివర్తకమయి నిత్య మయిన సుఖ మానందము. ఏయానందంబు సమస్తమయిన వారి చేతను సుషుప్తి కాలమం దనుభవింపఁబడుచున్నదో, ఆయానందమందీ లక్షణం బున్నది. అయితే సుషుప్తికాలమం దానందంబు గలిగినట్టాయెనా? ఆయా నందమం దీలక్షణము కలదని చెప్పవచ్చును. దుఃఖాభావము మాత్రము వినాగా ఆనందంబు లేదనెడి యానందంబునకు నిరుపాధికత్వంబును నిరతిశయ సుఖస్వరూపత్వంబు నిత్యత్వంబు ఎటుల రావచ్చుననిన, సుషుప్తి పురుషుఁ డాసుషుప్త్యవస్థయందు సుఖంబు ననుభవింపక పోయినట్టయితే ఆ యవస్థనుండి పునరుత్థితుఁడయిన తర్వాత నేను సుఖంబుగ నిద్ర పోయితినని చెప్పక యుండవలయును. దుఃఖసహితుఁడయ్యే యుంటి నని చెప్పవలెను. అటుల చెప్పలేదు. కాఁబట్టి సుషుప్త్యవస్థ యందు సమస్త మయినవారలచేతను ఒక ఆనందంబనుభవింపఁబడుచున్నది. ఆ యానందమందు నిత్యమై నిరుపాధికమై నిరతిశయమయిన సుఖస్వరూపత్వ లక్షణత్వం బున్నది. ఆ సుఖంబునకు నిరుపాధికత్వం బున్నది. ఆ సుఖంబు నకు నిరతిశయస్వరూపత్వ మెటులనిన, సమస్త విషయజన్యంబులయిన సుఖంబులలోపల నుత్కృష్టమయిన స్త్రీ సంభోగ సుఖమందు విరసము పుట్టి సమస్త ప్రాణులును ఆ సుఖమును త్యజించి ప్రతి దినంబును సుషుప్తి సుఖమును బొందుచున్నారు గనుకను, ఆ సుఖమునకు విఘ్నము చేసిన వారలను శిక్షింపుచున్నారు గనుకను, ఇంతమాత్రమే కాదు, జాగ్రత్స్వప్నముల యందు తోఁచునట్టి ఆధ్యాత్మికాదిభౌతికాధిదైవికములయిన సమస్త దుఃఖములను బోఁగొట్టుచున్నవి గనుకను, ఆ సుషుప్తి సుఖమునకు నిరతి శయత్వమున్నది. ఆ సుషుప్తి సుఖమునకు నిత్యత్వ మెటువలెననిన, జాగ్రత్స్వప్నములయం దనుభవింపఁబడిన సమస్త విషయ సుఖములును ఎటులనేక రూపములై యనుభవింపఁబడుచున్నవో అటులనే ఈ సుషుప్తి సుఖంబును అనేక రూపంబులుగా ననుభవింపఁబడక ప్రతి సుషుప్తి యందును నేకరూపంబుగా ననుభవింపఁబడుచున్నది. కనుక ఆ సుషుప్తి సుఖమునకు నిత్యత్వంబున్నది. అయినను ఈ సుషుప్తి సుఖము నిత్యత్వ మయినచో జాగ్రత్స్వప్నంబులయందునుం దోఁచవలయు. అటుల తోఁచనిచో, నాసుషుప్తి సుఖంబునకు నిత్యత్వ మెటుల చెప్పెడిదనిన, చెప్ప వచ్చును. అది యెట్లనిన, సుషుప్తి సుఖము నిత్యమయి యున్నప్పటికిని దుఃఖరూపమయిన దేహేంద్రియాది సంపర్కము వలన నాసుషుప్తి సుఖము తిరోహితమై యున్నది. కనుక తోఁచలేదు. ఆత్మ కార్యంబులగు దేహేంద్రి యాదులచేత కారణ భూతమయిన ఆత్మ సుఖమునకు తిరోధాన మెటుల కూడును? ఎట్లనిన అగ్నికి ప్రకాశము స్వతస్సిద్ధమయి యున్నప్పటికి స్వకార్య మయిన ధూమసంపర్కము చేత నా ప్రకాశంబున కెటుల తిరోధానత్వము వచ్చుచున్నదో మఱియు నాదిత్యునకు ప్రకాశత్వము స్వతస్సిద్ధమయి యున్న ప్పటికిని స్వకార్యమయిన మేఘసముదాయముచేత నాయాదిత్య ప్రకాశత్వ మునకు నెటుల తిరోధానత్వము వచ్చుచున్నదో అటులే ఆత్మకును సర్వదా సుఖస్వరూపత్వము స్వతస్సిద్ధమయి యున్నప్పటికిని ఆత్మ కార్యంబులైన దేహేంద్రియాదుల సంపర్కంబు వలన జాగ్రత్స్వప్నంబులయందు ఆ సుఖంబునకు  తిరోధానత్వము కూడును. బహిర్ముఖుఁడైన వానికీసుఖం బాత్మసుఖంబని జాగ్రత్స్వప్నంబులయందు తోఁచకున్నప్పటికిని అంతర్ము ఖుఁడైన వానికి సర్వదా తోఁచును. కాఁబట్టి ఈ సుషుప్తి సుఖము కాలత్ర యంబునందున్నది. అందువలననే యీ సుఖంబునకు నిత్యత్వ నిరుపా ధికత్వ నిరతిశయ సుఖస్వరూపత్వంబులు సర్వదా సిద్ధించి యున్నవి. ఈ విచారంబునకు ఫలమేమనిన, ఈ చెప్పఁబడిన సద్రూపత్వ చిద్రూపత్వ ఆనందస్వరూపత్వములు మనయందే సిద్ధించియున్నవి గాన, సచ్చిదానంద స్వరూపుఁడైన ఆత్మ మనమేయని దృఢనిశ్చయము కలుగుటయే యీ విచారములకు ఫలము.

            శ్లో||  కేనాప్య బాధిత త్వేన త్రికాలే ఽప్యేకరూపతా
                       విద్యమానత్వ మస్త్యేత త్తద్రూపత్వం సదాత్మనః
                       స్వారోపితాశేష పదార్థభాసక
                       త్వమాత్మనస్సాధనమంత రేణ యత్‌
                       వదంతి వేదాంతవిదో హితాం స్వయం
                       ప్రకాశమానస్య తు చిత్స్వరూపతామ్‌,
                       నిరుపాధికనిత్యత్వం సుప్తౌ సర్వసుఖాత్పరమ్‌
                       సుఖరూపత్వమస్త్యే తదానందత్వం తదాత్మనః
                       ఏవం వివిచ్య యో విద్యాత్‌ సచ్చిదానందరూపతామ్‌
                       స ఏవ వేత్తి యో విద్వాన్‌ స ముక్తస్స చ పండితః

ఇది ఏకాదశ వర్ణకము.