2. అథ్యారోపము

2.   అధ్యారోపము
            అధ్యారోపమనఁగా, ఒక వస్తువును మఱియొక వస్తువుగ భ్రమించుట. అది యెటువలెననిన, శుక్తియందు రజతాధ్యారోపము, రజ్జువు నందు సర్పాధ్యారోపము, స్థాణువునందు పురుషాధ్యారోపము మరు మరీచికలయందు (ఎండమావులు) జలాధ్యారోపము, ఆకాశంబునందు నీలత్వాధ్యారోపము.
            ఇవి యెటులనో అటులనే నిష్ప్రపంచ స్వరూపుఁడైన ఆత్మయందు ప్రపంచముయొక్క ఆరోపము అధ్యారోపము. ఈ యధ్యారోపము అధిష్ఠానా జ్ఞానముచేత వచ్చినది. ఆ యజ్ఞానము యొక్క స్వరూపమును వెనుక స్పష్టంబుగ నిరూపించుచు నిచ్చట సామాన్యంబుగ నిరూపించుచున్నారము. ఒక అజ్ఞానమే ప్రకృతి యనియు, తమస్సనియు, మాయ యనియు ననేక విధంబులుగాఁ జెప్పఁబడును. ఆ ప్రకృతి స్వరూపమును నిరూపించు చున్నారము. అది యెట్టు లనిన, గుణంబుల యొక్క సామ్యావస్థకు ప్రకృతి యని పేరు. ఇదియే ప్రళయావస్థ యనియు, మహా సుషుప్తి యనియునుం జెప్పఁబడును.
ఈ గుణసామ్యావస్థకు దృష్టాంతము
            తెల్ల నూలు, ఎఱ్ఱనూలు, నల్లనూలు ఈ మూఁడును సమంబుగాఁ జేర్చి పేనిన త్రాఁడువలె మూలప్రకృతి సత్వరజస్తమోగుణసముదాయ రూపమయి యుండును.
            ఈ ప్రకృతిలో ననేక కోటి జీవరాసులు తమయొక్క కర్మములు వాసనలు అదృష్టములతో కూడ లయించి యుండును. అది యేలాగనఁగా; మైనపుటుండలో స్వర్ణ రేణువులు ఎటుల లీనమైయున్నవో అటుల లీనయయి యుండును. ఇందుకు ఏకదేశము సర్వానుభవమయిన సుషుప్తియే దృష్టాంతము. బహుకాలము లీనమయి యుండఁగా నొకసమయ మందు లీనమయిన జీవుల యదృష్టములు పరిపక్వమౌను. ఆ సమయ మందు త్రిగుణాత్మకమైన ప్రకృతియందు సత్త్వగుణము విజృంభించుటచేత మాయయని చెప్పఁబడును. ఈ మాయయందు ప్రతిఫలించిన చైతన్యమును, ఆ మాయయును, మాయాధిష్ఠానమయిన చైతన్యమును ఈ మూడునుం గూడి యీశ్వరుఁడని చెప్పఁబడును. ఆ యీశ్వరునికే అంతర్యామి యనియు, అవ్యాకృతుఁ డనియును రెండు పేళ్ళు గలవు. ఇతఁడే జగత్స్రష్ట యనియుం జెప్పఁబడును. ఇంతియకాక సృష్టింజేయుటకు నుపాదాన కారణమనియు, నిమిత్తకారణ మనియును, రెండు కారణములు గావలయునని లోకమందు కన్నారము. అది యెటు లనిన ఘటశరావాదుల పుట్టుకకు మృత్తు ఉపాదాన కారణము. కులాలుండును, దద్వ్యాపారాదులు నిమిత్త కారణంబులు. పటనిర్మాణమందలి తంతువు లుపాదాన కారణంబు. తంతువాయుఁడు, తురిమెవాదులు నిమిత్త కారణము. ఈ ప్రకారము లోకమునందు రెండు కారణముల చేతను, ఘటపటాద్యుత్పత్తి యెటులనో దార్టా ్షంతికమందును రెండు కారణములచేత జగత్తునకుత్పత్తి యని తోఁచుచున్నది. అది యెటులనఁగా మాయ యుపాదానకారణంబును, ఈశ్వరుఁడు నిమిత్త కారణంబు నని చెప్పుదమన, శ్రుతికి విరుద్ధముగా నున్నది. ఇంతియకాక, ఉపాదాన కారణము సత్పదార్థమయి యుండవలెను. అటుల నుండెనేని మాయయును, ఆత్మయును రెండు పదార్థము లాయెను. కనుక నద్వైతహాని వచ్చును. కాఁబట్టి యీ పక్షము కూడదు. మాయ నిమిత్త కారణ మనియును, ఈశ్వరుఁడు ఉపాదాన కారణమనియు చెప్పుదమన్న పూర్వమువలె నద్వైత శ్రుతికి విరోధముగా నున్నది.
            లోకమునందు చేతనునే నిమిత్త కారణముగా కన్నారము. అచేతన మయిన మాయ నిమిత్త కారణము గానేరదు. కనుక అద్వైత హాని వచ్చును. ఈ దోషములుండుట వలన కేవలమయిన మాయ యుపాదాన కారణమును గానేరదు. నిమిత్త కారణమును కానేరదు. కనుక నిమిత్త కారణత్వంబును, ఉపాదాన కారణత్వంబును ఈశ్వరునికే చెప్పవలెను.
            రెండు కారణంబు లొకని కెట్లు చెప్పవచ్చుననిన, లోకమునం దూర్ణనాభి (సాలెపురుగు) శరీర ప్రధానమయి యుపాదాన కారణంబాయెను. బుద్ధి ప్రధానమయి నిమిత్త కారణ మాయెను. అటులనే యీశ్వరుండును సత్త్వగుణ ప్రధానమయిన మాయతోఁగూడి నిమిత్త కారణమాయెను. తమోగుణ ప్రధానమయిన మాయతోగూడి ఉపాదాన కారణంబు నయ్యెను. ఈ యుభయ కారణమైన యీశ్వరుఁడొకని వలననే జగదుత్పత్తియైన విధంబుఁ జెప్పెదము.
            ఈశ్వరుండు సత్త్వగుణ ప్రధానమైన మాయతోడం గూడి తమోగుణ ప్రధానమయిన మాయను వీక్షించె. తమోగుణ ప్రధానమైన మాయతోడం గూడిన చైతన్యమువలన త్రిగుణాత్మకమైన యాకాశంబు పుట్టెను. ఆకాశ విశిష్ట చైతన్యంబు వలన త్రిగుణాత్మకంబైన వాయువు పుట్టెను. వాయువు యొక్క విశిష్ట చైతన్యంబు వలన త్రిగుణాత్మకంబైన తేజస్సు పుట్టెను. తేజో విశిష్ట చైతన్యంబు వలన త్రిగుణాత్మకంబైన జలంబు పుట్టెను. జలవిశిష్ట చైతన్యంబు వలన త్రిగుణాత్మకంబైన పృథ్వి పుట్టెను. ఇవి అపంచీకృత భూతములనియు, సూక్ష్మభూతములనియు, తన్మాత్రలనియు చెప్పఁబడును. ఈ భూతముల వలన వ్యష్టిసమష్ట్యాత్మకమయిన లింగశరీరంబు పుట్టెను. వ్యష్టి సమిష్టి లక్షణమును ముందఱ నిరూపించుచున్నారము. 
            లింగశరీరము యొక్క పదియేడవయవముల యుత్పత్తిఁ జెప్పు చున్నారము. ఆకాశము యొక్క సాత్త్వికాంశంబువలన శ్రోత్రేంద్రియంబును, వాయువు యొక్క సాత్త్వికాంశంబు వలన త్వగింద్రియంబును, తేజస్సు యొక్క సాత్త్వికాంశంబు వలన చక్షురింద్రియంబును, జలము యొక్క సాత్వికాంశంబు వలన జిహ్వేంద్రియంబును, పృథ్వి యొక్క సాత్త్వి కాంశంబు వలన ఘ్రాణేంద్రియంబునుం బుట్టెను. ఈ భూతముల యొక్క సాత్త్వికాంశ సమష్టి వలన అంతఃకరణంబు పుట్టి, అది వృత్తి భేదములచే మనోబుద్ధి చిత్తాహంకారాంబులాయెను. వీనిలో బుద్ధియందు అహంకారమునకును, మనస్సునందు చిత్తమునకును అంతర్భావములు.
            ఆకాశము యొక్క రజోంశంబువలన వాగింద్రియంబును, వాయువు యొక్క రజోంశంబు వలన పాణీంద్రియంబును, తేజస్సు యొక్క రజోంశంబు వలన పాదేంద్రియంబును, అప్పుయొక్క రజోంశంబు వలన పాయ్వింద్రియంబును, పృథ్వియొక్క రజోంశంబు వలన నుపస్థేంద్రి యంబునుం గా నేతత్ప్రకారంబున కర్మేంద్రియంబు లుత్పత్తి యాయెను.
            ఈ భూతముల యొక్క రజోంశ సమష్టి వలన ప్రాణము పుట్టి అది వృత్తిభేదముల చేతను, ప్రాణాపానవ్యానోదానసమానంబు లన నైదు విధంబులైనవి వీనిలో నుపవాయువులు అంతర్భూతములై యున్నవి. కర్మేంద్రియములైదు, జ్ఞానేంద్రియములైదు, పంచప్రాణములు, అహంకారము, మనస్సను జేరి యా పదియేడుతత్త్వములును సమష్టి వ్యష్ట్యాత్మకం బైన లింగశరీరం బని చెప్పఁబడును. ఆ యీశ్వరుఁడే లింగ శరీరంబునం దభిమానము చేసి హిరణ్యగర్భుం డాయెను. ఇతనికే సూత్రాత్మ యనియు, ప్రాణుండనియు రెండునామంబులు గలిగె. ఇదియే సూక్ష్మసృష్టి.