22. జ్ఞానాజ్ఞానస్వరూప వివేచనము

చతుర్దశ వర్ణకము
22. జ్ఞానాజ్ఞానస్వరూప వివేచనము

            శ్లో||  జ్ఞానాజ్ఞానే విచార్యేతే కారణే బంధమోక్షయోః
                       అనుగ్రహార్థం లోకానాం మయా శాస్త్రం ప్రవక్ష్యతే

            జ్ఞాన స్వరూపంబును నజ్ఞాన స్వరూపంబును విచారించు చున్నారము. జ్ఞానంబన నెయ్యది? అజ్ఞానంబన నెద్ది? యనిన, నేను బ్రహ్మమని యెఱుంగుట జ్ఞానము. నేను మనుష్యుఁడనని యెఱుఁగుట అజ్ఞానము. మఱియు జ్ఞానంబన నెయ్యది? యజ్ఞానంబన నెయ్యది? యని సవిశేషముగా విచారింతము. అజ్ఞానమనఁగా అద్వితీయుఁడగు ఆత్మను సద్వితీయుఁడనియు, అపరిచ్ఛిన్నమయిన యాత్మను పరిచ్ఛిన్నుఁడనియు, అసంగుఁడైన యాత్మను సంగియనియు, అకర్తయైన యాత్మను కర్త యనియు, అభోక్త యగు నాత్మను భోక్త యనియుఁ దలపించునట్టి దెయ్యదియో అయ్యదియే అజ్ఞానము. జ్ఞానమనఁగా అద్వితీయుడయిన ఆత్మను అద్వితీయుఁడనియు, అపరిచ్ఛిన్నుఁడయిన ఆత్మను అపరిచ్ఛిన్నుఁడనియు, అసంగుడయిన ఆత్మనసంగుఁడనియు, అకర్తయగు ఆత్మను అకర్తయనియు, అభోక్తయగు ఆత్మను అభోక్తయనియు నేది తలపించు చున్నదో అదియే జ్ఞానము. ఓయీ ! అద్వితీయుండగు ఆత్మ సద్వితీయుఁడుగా దోఁచుట యజ్ఞానమని చెప్పితిరి. ప్రత్యక్షమందు సద్వితీయుఁడుగాఁ దోఁచుచున్నాఁడే యనిన, నీవు నేను వీడు వాఁడు దేవదత్తుఁడు యజ్ఞ దత్తుఁడు అని యనేక విధములుగా దోఁచుటయే అజ్ఞానము. అపరిచ్ఛిన్నుఁడగు ఆత్మ పరిచ్ఛిన్నుఁడుగాఁ దోఁచుట యజ్ఞానమని చెప్పితిరి. ప్రత్యక్ష మందు పరిచ్ఛిన్నుఁడుగానే తోఁచుచున్నాఁడే యనిన, ఈ యింటి యందుంటిని, ఈ యింటియం దుండలేదు. ఈ దేశమందుంటిని, ఈ దేశ మందుండలేదని పరిచ్ఛిన్నుఁడుగాఁ దోఁచుటయే అజ్ఞానము. అసంగుఁడయిన ఆత్మను సంగుఁడు గాఁదోఁచుట యజ్ఞానమని చెప్పితిరి. ప్రత్యక్షమందు సంగిఁగాఁదోఁచుచున్నాఁడే యనిన, వారితోడఁ గూడుకొని యుంటిని. వీరితోడఁ గూడుకొని యుంటిని. అన్నదమ్ములతోఁ గూడుకొని యుంటిని అని సంగిగాఁ దోఁచుటయే అజ్ఞానము. అకర్తయైన ఆత్మ కర్తగాఁదోఁచుట యజ్ఞానమని చెప్పితిరి. ప్రత్యక్షమందు కర్తగాఁదోఁచుచున్నాఁడే యనిన, నేను స్నానము చేసితిని, సంధ్యావందనము జేసితిని, ఔపాసనము జేసితిని, అని కర్తగాఁదోఁచుటయే అజ్ఞానము. అభోక్తయైన యాత్మ భోక్తగాఁ దోఁచుట యజ్ఞానమని చెప్పితిరి. ప్రత్యక్షమందు భోక్తగాఁ దోఁచుచున్నాఁడే యనిన, నేను భోజనము చేసితిని, ఫలాహారము చేసితిని, ఆవుపాలు త్రాగితిని, అని భోక్తగాఁ దోఁచుటయే అజ్ఞానము. అయితే అద్వితీయుఁడగు నాత్మ అద్వితీయుఁడుగానే తోపించెడిది జ్ఞానమని చెప్పితిరి. అట్లు అద్వితీయుఁడై తోఁచుచున్నాఁడా? యనిన, తోచుచున్నాఁడు. అది యెటులనఁగా, ఆత్మకు అద్వితీయత్వము నెఱిఁగించి యద్వితీయుఁడై తోఁచుచున్నాఁడని చెప్పవలెను. కాఁబట్టి ఆత్మకు అద్వితీయత్వ మననెయ్యది యనిన, సజాతీయ విజాతీయ స్వగత భేద రహితత్వము.

            అదెట్లనిన, దృష్టాంత పూర్వకంబుగ నిరూపించుచున్నారము. ఆ దృష్టాంత మెయ్యది యనిన, వృక్షంబునకు వృక్షాంతరము. ఆ దృష్టాంతమైన వృక్షమందు సజాతీయ విజాతీయ స్వగతంబులును వానియొక్క భేదంబును  కలదనుట చెప్పిచూపి దార్షా  ్టంతికమైన ఆత్మయందు సజాతీయ విజాతీయ స్వగత భేదములేదని శ్రుతులు చెప్పుచున్నవి. ఆత్మయందు సజాతీయ విజాతీయ స్వగతంబులును వానియొక్క భేదంబును ప్రసక్తమయినఁ గదా! ఆత్మకు సజాతీయ విజాతీయ స్వగతంబులును వాని యొక్క భేదంబును లేదనెడి శ్రుతి తోఁచవలెను. ప్రసక్తమయినదా యనిన, ప్రసక్తమయినది. ఎట్లు ప్రసక్తమయిన దనిన, వస్తుత్వసమానముచేత. వస్తుత్వసమాన మనఁగా నెయ్యది. ఆత్మ యొక వస్తువు. అనాత్మ యొక వస్తువునని తోఁచుట వస్తుత్వసమానము. అనాత్మయైన వస్తువునందు సజాతీయ విజాతీయ స్వగతములును వానియొక్క భేదంబునున్నది. గావున ఆత్మయు నొక వస్తు వగుటచేత ఆ యాత్మయందు సజాతీయ స్వగతత్వంబును వానియొక్క భేదంబును ప్రసక్త మాయెను. కాఁబట్టి ఆత్మయందు సజాతీయ విజాతీయ స్వగతత్వంబులును వాని యొక్క భేదమును లేదని శ్రుతి చెప్పిన మాత్రము చేత, నీయర్థము మనకు బుద్ధియం దెటువలె నెక్కుననిన, విచారించినచో నెక్కును.

            అది యెటులనఁగా, ఆత్మయనఁగా సద్రూపుఁడు కదా! సద్రూపుఁడైన యాత్మకు స్వతంత్రము లేదు కాఁబట్టి, సజాతీయంబును సజాతీయ భేదంబును లేదు. అట్లయితే నీవున్నాఁడవు. నేనున్నాఁడను. వీడున్నాఁడు. వాఁడున్నాఁడు. దేవద్తుఁడున్నాఁడు. యజ్ఞ దత్తుఁడున్నాఁడు. కృష్ణుఁడున్నాడు. రాముఁడున్నాఁడు అనియును పృథివీసతీ, ఆపస్సత్యః, తేజస్సత్‌, వాయుస్సన్‌’, అనియును సత్తున కనేక భేదములు కానఁబడుచున్నవి గనుకను, ఆత్మకు సజాతీయభేదము లేదని యెట్లు చెప్పవచ్చుననిన, అంతటను సన్‌ సన్‌ సన్‌అనేసత్తు యేకరూపమయియున్నది. గనుక ఆత్మకు సజాతీయంబును భేదంబును లేదని చెప్పవచ్చును. సత్తు ఏకరూపమయి యున్నది. దానికి భేదము లేదని చెప్పితిరి. ఘటః ఘటః ఘటఃఅనునదియును నేక రూపంబుగా నున్నది. కాఁబట్టి అక్కడను భేదము లేకపోవలెను. ఉన్నది గనుక, సత్తుకు నేకరూపత్వము చేతను సజాతీయంబును సజాతీయ భేదంబును లేదని చెప్పఁగూడదని యంటివేని, ఆ ఘటాదులయందు ఆకారవైలక్షణ్యం బుండుటవలనను సత్తునందయ్యా కారవైలక్షణ్యంబు లేకుండుట వలనను సద్రూపుఁడైన ఆత్మకు సజాతీయంబును సజాతీభేదంబును లేదు. అయితే ఆత్మకు విజాతీయంబును విజాతీయభేదంబును గలదా ? లేదా? యనిన, ఆత్మయనఁగా సద్రూపుఁ డగుట వలన నయ్యాత్మకు విజాతీయ మసత్తు. అసత్తనఁగా ప్రపంచము. ఆ ప్రపంము లేక యుండెడిది గావున అసత్తనఁబడియెను. ఆ యసత్తైన ప్రపంచము సతైన ఆత్మకు సద్వితీయత్వమును సంపాదింపనేరదు. అది యెటులనఁగా అసత్తైన వంధ్యాపుత్రుఁడు తల్లిని పుత్రవతియని యెటుల ననిపింపలేడో, అటుల అసత్తైన ప్రపంచ మాత్మకు సద్వితీయత్వమును సంపాదింపనేరదు. కాఁబట్టి సత్తైన ఆత్మకు విజాతీయంబును విజాతీయ భేదంబును లేదు. అయితే దృష్టాంతమయిన వృక్షమందు పత్రపుష్పఫలాదుల చేతను స్వగతంబును స్వగతభేదంబును బ్రత్యక్షంబుగఁ దోఁచినటువలె ఆత్మకు సచ్చిదానందములచేతను స్వగతంబును స్వగతభేదంబు నున్నదంటి వేని దార్షా ్టంతికమయిన ఆత్మకైతే సచ్చిదానందములు స్వరూపమాయెను. కనుక శబ్ద మాత్రముచేత భేదము తోఁచినను ఆ సచ్చిదానందముల చేతను ప్రత్యక్షముగా భేదము తోఁచలేదు. కనుక ఆత్మ కాసచ్చిదానందములచేత స్వగతంబును స్వగతభేంబును లేదు. సచ్చిదానందములు శబ్దమాత్ర భేదము చేతను హస్తకరపాణి శబ్దమువలవలె పర్యాయపదములు కాకుండుట వలనను శబ్ద భేదములవలె పర్యాయ పదములు కాకుండుట వలనను శబ్ద భేదము వలన నర్థభేదంబును గలిగి యుండుటవలనను సచ్చిదా నందములకు భేదము కలదు. కాఁబట్టి సచ్చిదానందముల వలన నాత్మకు స్వగతభేదంబునుం గలదని చెప్పితివేని సచ్చిదానందములకు శబ్దభేదంబు నర్థభేదంబు నున్నను ఆ సచ్చిదానందముల చేత నాత్మకు భేదము లేదనుట దృష్టాంతపూర్వకముగ వివరించెదము.

            అగ్నియందు లోహితమనియు, నుష్ణమనియు, బ్రకాశమనియు మూఁడు విధంబులున్నవి. ఈ మూఁడు విధంబులైన లోహితోష్ణ ప్రకాశం బులు ఆ శబ్దభిన్నంబు లైనప్పటికిని యీ శబ్దంబులయం దర్థభేదము తోఁచినప్పటికిని హస్తకరపాణిశబ్దములవలె పర్యాయ శబ్దములు గాక పోయినప్పటికిని యీ సచ్చిదానందము లాత్మకు స్వరూపమే. సందేహము లేదు. ఇంతేకాదు. దృష్టాంతమయిన అగ్నికి స్వరూపమైన లోహితోష్ణ ప్రకాశ ముల కొక సమయమందు ప్రత్యక్షంబుగఁ బ్రతిబంధము కానఁబడును.  గనుక వానికి ధర్మత్వ గుణత్వంబులు చెప్పినఁ జెప్పవచ్చును. దార్షా ్టంతి కమయిన ఆత్మయం దన్ననో, సచ్చిదానందంబులకు సర్వాత్మనా భేదము చెప్పఁగూడదు. ఎందుచేత చెప్పగూడదనిన, శ్రుతికి విరోధమగుట వలనను, ఆత్మ నిరవయవుఁడగుట వలనను చెప్పగూడదు. కాఁబట్టి సచ్చిదానందంబు లఖండములు. అందువలన నద్వితీయత్వము. అదెట్లనిన, సత్తే స్వయముగాఁ దోఁచుచున్నది గనుక, చిత్తాయెను. ఆ చిత్తైన సత్తు రెండు వస్తువులు గలిగినది గాకపోయెను గనుక, అదియే ఆనందమాయెను. కావున సచ్చిదానందబులకు భేదంబు లేదు. అయితే ఆత్మకు నద్వితీయత్వము యుక్తియుక్తమయిన యనుభవము లేక, యీ చెప్పిన మాటమాత్రము చేతనే ఆత్మ యద్వితీయుండని బుద్ధి యందెటుల యెక్కుననిన, విచారింపఁగా బుద్ధియం దెక్కును. ఎటుల యనిన, లేని వస్తువున్నదని చెప్పఁగూడదు. గనుక సత్తున్నదనుటకు సందేహము లేదు. అసత్తు తోఁచుచున్నదా ? యనిన, తోఁచని వస్తువు కలదనుటకు వ్యవహారంబునకు విషయంబు కాదు గావున, సత్తు తోఁచుచున్నదని చెప్పవలయును. ఆ తోఁచునట్టి సత్తు స్వయముగాఁ దానే తోఁచుచున్నదో మఱియొక దానివలన తోపింపఁబడుచున్నదో యనిన, తానేయని చెప్పవలెను. కాఁబట్టి ఆ సత్తే చిత్తై సిద్ధించు చున్నది. అటుగాక యన్యముచేతఁ దోఁచుచున్నదని చెప్పినట్లయితే ఆ సత్తును తోపించునదియే అన్యము. అది సదంతరమో సద్విలక్షణమో యనిన సదంతరమని చెప్పవలయును. తాను నికృష్టమైయుండి సత్తును తోఁపించు చున్నదో లేక సామ్యమయి యుండి తోఁపించుచున్నదో యనిన, ఆ యాత్మ స్వరూపమయిన సత్తును తోఁపించుచునుండు సదంతర మంతకన్న నికృష్టమయియుండి ఆ సత్తును తోఁపించుచున్నదని చెప్పిన పక్షమందు సూర్యుని కన్న నికృష్టమయిన దీపము సూర్యుని తోఁపింపవలయును. అటువలె తోఁపింపలేదు. కాఁబట్టి సదంతరము సత్తుకంటె నికృష్టమయి యుండి అ సత్తును దోఁపించుచున్నదని చెప్పగూడదు.

            అయితే, ఆ సదంతరము సత్తుకు సమానమయి యుండి ఆ సత్తును తోఁపింపఁ జేయుచున్నదని చెప్పుటకు దీపమునకు సమానమయిన దీపాంతర మాదీపంబును తోఁపింపవలెను. కావున ఆ సదంతరంబునకు ప్రకాశాతిశయంబును సంపాదించెడి వస్తవు సత్తనియు నిరూపింపరాదు. కనుక అది సత్తని చెప్పుదమనిన, అది స్వప్రకాశమో అప్రకాశమోయని నిరూపింపఁగూడదు. కనుక స్వప్రకాశమైన సత్తే చిత్తాయెను. సత్తుకు సప్రకాశత్వమును, అద్వితీయత్వంబును వేదాంతులకన్న నన్యులచేత నంగీకరింపఁబడలేదు. కనుక ఆ యాత్మస్వరూపమయిన సత్తును తోఁపించెడి సదతరంబునకు ప్రకాశాతిశయంబును సంపాదించెడి సప్రకాశమని చెప్పఁగూడదు. చెప్పుదమనిన, అప్రకాశమయిన వస్తువు ప్రమాణ వస్తువునకు ప్రకాశతియమును సంపాదించుట కానము గనుక, అప్రకాశమని చెప్పఁగూడదు. అయితే, అన్యవస్తువుచేత నతిశయమును బొంది సదంతర మాత్మయని యతనితోఁ జెప్పుచున్నదని చెప్పినచో అన్యవస్తు వనఁగా నసత్తు గావున, నటులనుం జెప్పఁగూడదు. అట్లయితే ఆత్మస్వరూపమయిన ఆత్మకు ప్రకాశాతిశయమును సంపాదించెడి సదంతరమునకు ప్రకాశాతిశయమును సంపాదించునట్టి సత్తు మఱియొకటియని చెప్పవలెను. అటుల చెప్పినట్టయితే ఆ సత్తుకు ప్రకాశాతిశయమును సంపాదించెడి సత్తు ఒకటి, అసత్తుకు ప్రకాశత్వమును సంపాదించెడి సత్తు మఱియొకటియని ఈ ప్రకారముగా ననవస్థాదోషం బును ఆ ప్రకాశత్వంబును వచ్చి అద్వితీయత్వమును చెప్పెడివారికి పరిహారం బుగా పిడుగు పడినట్లగును. లోకంబునందొక వస్తువున కతిశయమును సంపాదించుచున్న దనుట అజ్ఞులయందు కన్నారము గనుక, పక్షత్రయం బును గూడదు. సత్తు తోఁపించెడి సదంతరము తానే ప్రకాశమయి యుండి ఆ సద్వవస్తువును తోఁపించుచున్నదియని చెప్పవలయును. ఇటువలె చెప్పినట్లయితే సత్ప్రకాశ మయిన సదంతరము చిత్తై సిద్ధించును. అట్లయితే లోకంబునం దాకాశమువలె నుపాధి వినాగా సత్తాద్వయంబు నిరూపింపఁగూడదు గనుకను నిరుపాధికమయిన సత్తే అద్వితీయమని శ్రుత్యాదులచేత నిరూపింపఁబడినది గనుక, అప్రకాశమయిన సదంతరము చేత ఆత్మయైన సత్తు తోఁపింపబడుచున్నదని చెప్పఁగూడదు.            

            మఱి యెటులనఁగా, ఆత్మ స్వరూపమయిన సత్తు తానే ప్రకాశమయి యున్నది గనుక, అదే చిత్తనిపించుకొనును. ఇటుల చెప్పక ఘటాదులకు విలక్షణమయిన దీపాదులచేతను ఘటాదులకువలె సత్తుకు విలక్షణమయిన వస్తువుచేతను సత్తు తోఁపించుచున్నదని చెప్పుదమనిన, దృష్టాంతమందు ఘటాదులును దీపాదులును సమానసత్తాకంబులయి యున్నవి గాన, ఆ ఘటాదులకంటె దీపాదుల కపేక్షించిన ప్రకాశత్వము ప్రత్యక్షముగఁ గానఁబడుచున్నది గనుకదీపాదులచేతను ఘటాదులు తోఁపింపవచ్చును. దార్ష్టాంతికమందయితే సద్విలక్షణమయిన వస్తువు అసత్తు గనుక, దానికి వస్తుత్వము చెప్పఁగూడదు. సద్విలక్షణమగు నసత్తుచేత సత్తు తోపింపఁబడుచున్నదని చెప్పఁగూడదు. లోకమందు వనము కాడు వీనియందు లేనిదీపాదులచేత నైనఁగాని, భ్రాంతిచేత తోఁచునట్టి యుపాధ్యనేకములచేత నైనఁగాని, ఘటాదులు తోఁచుచున్నవని చెప్పఁగూడదు. కాఁబట్టి లోక మందు సత్తును తోఁపించెడి పదార్థ మొకటియైన లేకుండుట వలనను సమస్త పదార్థంబులును సత్తునం దారోపింపఁబడుట వలనను, ఆ పదార్థం బులు సత్తును ఉపజీవించుకొని తోఁచుట వలనను సత్తు స్వప్రకాశ్య మయినది. ఆ స్వప్రకాశ్యమయిన సత్తే చిత్తు. ఆ చిత్తైన సత్తుకు విలక్షణమయి యుండు వస్తువు అసత్తైయన్నది గనుక, ఆ సత్తే రెండు వస్తువులు గలిగినది గాకపోయెను గనుక, ఆ సత్తే చిత్తై యానందస్వరూపమాయెను. లోకంబు నందు రెండు వస్తువులు గలిగినది గాకపోయిన వస్తువే యానందమయి యుండుట కలదా ! యనిన, కలదు.

            అది యెటులనఁగా, సుషుప్తియందు రెండవ వస్తువు లేనందున నదియే యానందమాయెను. జాగ్రత్స్వప్నంబులయందు రెండవ వస్తువు కలిగి యుండుటవలన దుఃఖమే తోఁచుచున్నది. జాగ్రతయందు నేకాంత మయి (కార్యాలోచన, మోహము మున్నగు విషయములందు మనస్సు ఏకాగ్రత నొంది పారవశ్యమున) యున్న సమయంబున రెండవ వస్తువు ననుసంధానము చేయకుండుటవలన సమస్తమయిన వారికి నానందమే తోఁచుచున్నది. ఏకాంతమందుండెడి పురుషుఁడు రెండవ వస్తువును స్మరింపక సుఖముగా నున్నప్పటికిని అవశ్యముగ రెండవ వస్తువును స్మరింప జేయునట్టి యొక శబ్ద శ్రవణంబేనియు నొక రూపదర్శనం బేనియుఁ దోఁచుచుండఁగా నుభయరూపకమయిన దుఃఖమే తోఁచుచున్నది. వస్త్వంతర మగపడెనేని భయము కలుగునని శ్రుతి చెప్పుచున్నది గనుక, సుషుప్తి యందు వస్త్వంతరము తోఁచలేదు గావున, ఆనందమాయెను. ఆ సుషుప్తి యానందమందుఁ గల్పింపఁబడిన దగుటవలన రజ్జ్వాదులయందు కల్పింపఁబడిన సర్పాదులవలె నానందవ్యతిరిక్తము గాకపోయెను. అందువలన నానందమని చెప్పఁబడుచున్నది. కాఁబట్టి సద్రూపుఁ డయినయాత్మకు సదంతరము లేదు. కనుక సజాతీయంబును సజాతీయ భేదంబును విజాతీ యమును నసత్తై యున్నవి గనుక, విజాతీయంబును విజాతీయ భేదంబును లేదు. సత్తే చిత్తు, చిత్తే ఆనందంబు నయ్యెఁగాన, స్వగతంబును స్వగత భేదంబును లేదు. కాఁబట్టి ఆత్మకు సజాతీయస్వగత భేదంబులు లేవు. అందువలననే ఆత్మ అద్వితీయుండని శ్రుతి చెప్పెను. యుక్త్యనుభవముల చేతను సిద్ధమే. అద్వితీయుఁడయినయాత్మ నే నని ముముక్షువులయినవార లెఱుఁగఁ దగినది. ఆత్మ యద్వితీయుడని శ్రుతి యెట్లు చెప్పుచున్నదో అటులే ఆత్మ పరిపూర్ణుఁడని శ్రుతి చెప్పుచున్నది. కనుక యాత్మకు పరి పూర్ణత్వ మెటువలె నని విచారించుదము. పరిపూర్ణత్వ మనఁగా వ్యాపక త్వమా? లేక విభుత్వమా? లేక అపరిచ్చిన్నత్వమా? యనిన, అపరిచ్ఛిన్న త్వమే పరిపూర్ణత్వమని చెప్పవలెను. వ్యాపకత్వమే పరిపూర్ణత్వమని చెప్పఁగూడదా? యనిన, వ్యాపకత్వము స్వకార్యమయినందున నాకార్యము పృథి వ్యాదులకు నున్నది గనుక, వ్యాపకత్వము పరిపూర్ణత్వమని చెప్పఁగూడదు. అయితే విభుత్వమే పరిపూర్ణత్వమని చెప్పుదమనిన, విభుత్వము సర్వమూర్త ద్రవ్యసంయోగమగుటవలన నది యాకాశాదులకు నున్నది. కనుక విభుత్వము పరిపూర్ణత్వమని చెప్పఁగూడదు. కనుక అపరిచ్ఛిన్నత్వమే పరిపూర్ణత్వమని చెప్పవలెను. ఈ యపరిచ్ఛిన్నత్వము పరిచ్ఛిన్నమయిన పృధివ్యాకాశాదులకు లేదు. ఆత్మకైతే వ్యాపకత్వవిభుత్వాపరిచ్ఛిన్నత్వములు కలవు. ఎటులనఁగా, పృథివ్యాదులకు స్వకార్యములయిన చతుర్విధ భూత గ్రామాదుల యందు ననుస్యూతత్వ మెటువలె నున్నదో అటువలెనే ఆత్మకును స్వకార్యమయిన ప్రపంచమందనుస్యూతత్వం బుండుటవలన వ్యాపకత్వంబున్నయది. ఆకాశాదులకు సర్వమూర్తద్రవ్య సంయోగత్వ మెట్టులున్నదో అటులే ఆత్మకును సర్వమూర్తద్రవ్య సంయోగత్వమున్నది. కనుక విభుత్వంబు నున్నది. అట్లగుటవలన వ్యాపకుండు విభుండు నగువాఁడే యాత్మయని చెప్పవలయును. అటుల చెప్పినట్టయితే ఆత్మకు అద్వితీయత్వము తోఁచుచున్నది గనుక, అపరిచ్ఛిన్నత్వమే పరిపూర్ణత్వమని చెప్పవలెను. అటుల చెప్పుటవలన పూర్వము చెప్పఁబడిన అద్వితీయత్వమే యపరిచ్ఛిన్నత్వముగ సిద్ధించెను. ఆ యద్వితీయత్వమే యపరిచ్ఛిన్నమయి నప్పటికిని, మఱియును విశేషముగ విచారించుచున్నారము. అది యెటులనిన, త్రివిధ పరిచ్ఛేద శూన్యత్వమే యపరిచ్చిన్నత్వము. పరిచ్ఛిన్నత్వ మందుఁ బ్రసక్తమాయెనా? యనిన, అనాదిగా భ్రాంతి చేతను బ్రసక్తమయి యున్నది. ఎటుల ప్రసక్తమాయెననిన, ఈ దేశమందుంటి, ఈ దేశమందుండలేదని దేశము చేతను, ఈ సంవత్సరంబునందుఁ పుట్టితిని, ఇఁకమీఁద లేకపోవుచున్నానని కాలము చేతను, ఈ వస్తువు నేను గానని వస్తువుచేతను, పరిచ్ఛిన్నుఁడై తోఁచుచున్నాఁడు. భ్రాంతిచేతఁ దోఁచునట్టి ఈ పరిచ్ఛిన్నత్వము విచారింపఁగా లేకపోవుచున్నది.

            అది యెట్టులనిన, ఆత్మ యంతటను వ్యాపకుఁడై యుండుట వలన దేశము చేతను, నిత్యుఁడై యుండుటవలన కాలము చేతను, సర్వాత్ముఁడై యుండుటవలన వస్తువు చేతను పరిచ్ఛిన్నత్వము లేదు. ఆత్మకు త్రివిధ పరిచ్ఛేద శూన్యత్వమే యపరిచ్చిన్నత్వమని యెందుకు చెప్పవలెను? దేశము చేత పరిచ్ఛేదము లేకుండుటయే యపరిచ్చిన్నత్వమని చెప్పుద మనఁగా ఆకాశమునకును దేశముచేత పరిచ్ఛేదము లేదు. కనుక దానికి అపరిచ్ఛిన్న త్వము వచ్చును. ఆ యాకాశమునకు అపరిచ్ఛిన్నత్వమును త్రోయుట కొఱకు కాలము చేతను, ఆత్మ పరిచ్ఛేద రహితుఁడని యంగీకరింపవలెను. అయితే ఆకాశమునకు కాలముచేత పరిచ్ఛిన్నత్వము కలదా యనిన, శ్రుతియందా కాశమునకు నుత్పత్తి నాశములు చెప్పఁబడెను. కనుక కాలముచేతను ఆకాశమునకు పరిచ్ఛిన్నత్వము కలదు. అయితే ఆత్మకు దేశకాలములచేత పరిచ్ఛేద రాహిత్యమే యపరిచ్ఛిన్నత్వమని చెప్పుదమనిన, కాలమునకు దేశముచేతను తనచేతను పరిచ్ఛేద రాహిత్యమున్నది. కనుక దానికి పరిచ్ఛి న్నత్వము వచ్చును. దానికి అపరిచ్ఛిన్నత్వమును త్రోయుట కొఱకు వస్తువు చేత పరిచ్ఛేదరాహిత్యమే యపరిచ్ఛిన్నత్వమని యంగీకరింపవలయును. అయితే కాలమునకు వస్తువుచేత పరిచ్ఛిన్నత్వము కలదా? యనిన, కాల మాకాశాది వస్తువుకాదు. కనుక వస్తువుచేత కాలమునకు పరిచ్ఛిన్నత్వము కలదు. ఇటుల చెప్పుటచేత ఆత్మకు వస్తువుచేత పరిచ్ఛిన్నత్వము తోఁచుచున్నది.

            అది యెటులనిన, ఆత్మ వ్యాపకుఁడై యున్నాఁడు. కనుక ఆత్మకు దేశ కాలములచేత పరిచ్ఛేదరాహిత్యము కలిగియున్నప్పటికి ఆత్మ యాకాశాది వస్తువు కాదు. కనుక వస్తువుచేత పరిచ్ఛేదము తోఁచుచున్నదంటివేని ఆత్మకు వస్తువు చేతను పరిచ్ఛిన్నత్వము లేదు. ఆకాశము, వాయువు, తేజస్సు, అప్పు, పృథివి వీనికి కాలమనెడి వ్యవహారము లేదు గావునను, కాలము నుపజీవించుకొని యాకాశాదులు ఉండలేదు గనుకను, వానివలెనే కాలమ విద్యాపరిణామము గనుకను, వ్యవహారంబునందు ఆకాశాదులును కాలం బును భిన్న సత్తాకంబులై తోఁచుచున్నవి గనుకను, ఘటాదులచేత ఘటా దులకు పరిచ్ఛిన్నత్వ మెటుల ప్రత్యక్షమో అటులే ఆకాశాదులచేత కాలము నకు పరిచ్ఛిన్నత్వము ప్రత్యక్షముగా తోఁచుచున్నది. కనుక వస్తువుల చేత కాలమునకు పరిచ్ఛిన్నత్వము యుక్తము. ఆత్మయైతే ఆకాశాదులు గాని వానివలెఁ దోఁచినప్పటికిని సత్తై యున్నాఁడు గనుకను, ఆ యాత్మ స్వరూపమైన సత్తును ఉపజీవించుకొని ఆకాశాదులున్నవి గనుకను, రజ్జ్వాదుల యందారోపింపఁబడిన సర్పాదు లా రజ్జ్వాదులకంటెఁ బరిచ్ఛిన్నము లెటుల కావో మృత్తునందుఁ దోఁచెడి ఘటాదులు మృత్ప రిచ్ఛిన్నము లెటువలెఁగావో అటువలెనే ఆత్మ స్వరూపమైన సత్తుకంటె వేఱుగా లేదు గాన, ఆత్మకు పరిచ్ఛేదకములు కావు. కనుక ఆత్మకు వస్తువు వలనను బరిచ్ఛిన్నత్వము లేదనెడిది యుక్తమే. అట్లయితే దేశంబును కాలంబును వస్తువులై యున్నవి. కావున వస్తువు చేతను పరిచ్ఛేద రాహిత్యమే ఆత్మకు అపరిచ్ఛిన్నత్వమని చెప్పినఁ జాలదా యనినఁ, జాలును. అయినను దేశకాలంబులకు ఆకాశాదులకువలె వస్తుత్వ ప్రసిద్ధి లేదు గనుక, ఆత్మకు స్వతస్సిద్ధమైన వ్యాపకత్వంబును నిత్యత్వంబును సర్వాత్మకత్వంబును, అనాదియగు నజ్ఞానమువలన వచ్చిన దేహేంద్రియాద్యధ్యాస వలన తోఁచదయ్యెఁగాన, నా భ్రాంతిని దొలగఁజేయుట కొఱకు త్రివిధ పరిచ్ఛేద శూన్యత్వ మపరిచ్ఛిన్నత్వమని చెప్పవలసి వచ్చెను. అదే యఖండత్వము, అదే యద్వితీయత్వము అని శ్రుత్యాదులచేతఁ జెప్పఁబడినది. ఈ చొప్పున విచారించి పరిపూర్ణుఁడైనయాత్మ నే నని యెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.

            అసంగత్వమును విచారింపుదము. ఆత్మకు సంగిత్వము ప్రసక్తమైనఁగదా అసంగత్వ మెటులని విచారింపవలెను. ఆత్మకు సంగిత్వము గలదా? యనిన, గలదు. ఎటువలెఁ గలదనిన, భ్రాంతి జన్యమైన దేహేంద్రి యాధ్యాస వలన సంగిత్వము తోఁచుచున్నది. ఇంతే కాదు. వారితోఁగూడియుంటిని వీరితోఁ గూడి యుంటిని, అని సంగిత్వము తోఁచుచున్నది. విచారించి ఆత్మ యద్వితీయుఁడని యెప్పుడెఱుఁగుచున్నాఁడో అప్పుడు రెండవ వస్తువు లేదు గనుక, ఆత్మకు సంగిత్వము దొలఁగును. పరమార్థతః ఆత్మ యద్వితీయుఁడు గనుక, అసంగుఁడై యున్నప్పటికిని వ్యవహారకాలమందు సంగివలెనే తోఁచునట్టి యాత్మకు నసంగత్వ మెటువలె కూడుననిన, రజ్జ్వాదులయం దారోపింపఁబడిన సర్పాదులతోడ నారజ్జ్వాదులకు కాలత్రయ మందును నెటువలె సంగము లేదో అటువలెనే ఆత్మయం దారోపింపఁబడి తోఁచునట్టి దేహేంద్రియాది ప్రపంచముతోడను ఆత్మకు కాలత్రయ మందును సంగము లేదు. ఇంతమాత్రమే కాదు. లోకమందు సావయవములై యుండెడి పదార్థములను అన్యోన్య సంగము గన్నారము. నిరవయవములై యుండెడి పదార్థములకు సావయవములగు పదార్ధములతో కాలత్రయమందును సంగము గానమే యనిన, చెప్పి చూపుచున్నారము. పరమార్థమందు నిరవయములని సమ్మతమై యుండెడి ఆకాశాదులకు పృథివ్యాదులతోడి సంగము చెప్పఁగానము. సంగము చెప్పినట్టయితే జలాదుల సంగము వలన వస్త్రాదులకు ఆర్థ్రత్వాదికము లెటువలె వచ్చు చున్నవో అటువలెనే ఆకాశాదులకు పృథివ్యాధులతోడి సంగమువలన నాయాపృథివ్యాది వికారములు రావలెను. అటువలె వచ్చినది కానము గనుక, ఆ యాకాశాదులకు పృథివ్యాదులతోడ నెటువలె సంగము లేదో అటువలెనే ఆత్మయును భ్రాంతి వలన దేహేంద్రియాది ప్రపంచముతోఁ గూడుకొని యుండునట్టి వానివలెఁ దోఁచినప్పటికిని ఆత్మ యసంగుఁడే. వ్యవహార కాలమందు పరమార్థము ననుసరించి ఆకాశాదులకు నిరవయ వత్వము నంగీకరించి ఈ మేరకు చెప్పితిమి. పమార్ధతః విచారించునపుడు ఆకాశాది సర్వపదార్ధంబులు భ్రాంతి వలన నాత్మయం దారోపితములై యున్నవి గాన నాయారోపితములగు పదార్థములకు రజ్జ్వాదులయందుఁ దోఁచెడి సర్పాదుల వలెనే అధిష్టానాత్మ సత్తే స్వరూపమై యున్నది గనుక, కాలత్రయంబునందు నద్వితీయుండు గాన నసంగుఁడు. ఈ మేరకు విచారించి యసంగుఁడగు నాత్మ నేనని ముముక్షువు లెఱుఁగవచ్చును. ఇటువలె నెవఁడెఱుఁగు చున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.                   ఇటుల చెప్పుట వలన ఆత్మకు కర్తృత్వము ప్రసక్తమాయెగదా యనిన, ప్రసక్త మాయెను. అదెట్లనిన, దేహేంద్రియాద్యధ్యాసమువలన నేను స్నానము చేయఁబోవుచున్నాఁడను, జపము చేసితిని. జపము చేయఁబోవు చున్నాఁడను. అగ్ని హోత్రముఁ జేసితిని అగ్ని హోత్రముఁ జేయఁబోవు చున్నాఁడ. యజ్ఞముఁ జేసితిని. యజ్ఞము చేయఁబోవుచున్నాఁడను అనే కర్తృత్వము అధ్యాసచేత ఆత్మనిష్ఠముగాఁ దోఁచుచున్నది గనుక, ఆ కర్తృత్వము లేదని తెలియుట కొఱకు విచారించవలసి వచ్చెను. కర్తృత్వ మనఁగా, క్రియా శ్రయత్వము గనుక, అకర్తృత్వము పరిచ్ఛిన్నమై సంగియై సావయవమయి వికారియయిన వస్తువు నాశ్రయించుకొని యుండుట గన్నారము. ఆత్మయైతే అపరిచ్ఛిన్నుఁడు, నసంగుఁడు నిర్వికారుఁడు, నిరవయవుఁడు గనుక, ఆత్మకర్తృత్వము చెప్పఁగూడదు. గనుక ఆత్మ యకర్తయని చెప్పవచ్చును. ఆత్మకు అద్వితీయత్వ జ్ఞానము చేతనే అకర్తృత్వము సిద్ధము. అయినప్పటికిని స్పష్టముగా నెఱుంగవలసి విశేషముగాఁ జెప్పితిమి. వ్యవహారమందు స్నానాదిక్రియాశ్రయత్వము దేహాదులకే కాని వ్యాపకమయిన ఆకాశాదులకుఁ గానము. అపరిచ్ఛిన్న మయిన యాత్మకు లే దనెడివి చెప్పవలసినది లేదు. భ్రాంతి వలన వచ్చినది లేదు. దేహేంద్రియాద్యధ్యాస వలన నాత్మ కర్తవలెనే తోఁచినప్పటికి నవి విచారించునప్పుడాత్మ యపరిచ్ఛిన్నుఁడై యున్నాఁడు గనుక, ఆత్మ యకర్త యనుటకు సందేహము లేదు. ఆ యకర్తయే నే నని ముముక్షువు లెఱుఁగఁదగినది.

            ఆత్మకు భోక్తృత్వ మెటువలెనని విచారింపుదము. ఆత్మకు భోక్తృత్వము ప్రసక్తమయినఁగదా ఆత్మకు అభోక్తృత్వ మెటువలెనని విచారింపవలెను. ఆ దేవదత్తాదులు తమకు తామే భోజ్యమయి యుండుట యెక్కడను కానము. ఆ భోజ్యవస్తువు లేకనే భోక్తృత్వ మెందును గానము గనుక అద్వితీయుడయిన ఆత్మకు అభోక్తృత్వము సిద్ధమే. ఈ మేరకు విచారించి యద్వితీయుఁడై యసంగుఁడయి యపరిచ్చిన్నుఁడయి యకర్తయయి యభోక్త యయిన ఆత్మ నేనని యెవఁ డెఱుఁగుచున్నాఁడో వాఁడే కృతార్థుఁడు, విద్వాంసుడు, సమస్త మయిన వారలకును పూజ్యుఁడు, జీవన్ముక్తుఁడునని వేదాంత సిద్ధాంతము. ఈ యర్థమందు సంశయము లేదు.

ఇది చతుర్ధశ వర్ణకము.