23. ప్రతిబంధత్రయ వివేచనము

పంచదశ వర్ణకము
23. ప్రతిబంధత్రయ వివేచనము

            శ్లో||  మాతామహ మహాశైలం మహస్తద పితామహమ్‌
                       కారణం జగతాం వందే కంఠా దుపరివారణమ్‌

           శరీరత్రయ నిరూపణము: ప్రాణుల కెన్ని శరీరంబులని విచారించు చున్నాము. ఈ విచారంబునకు ప్రసక్తి యెయ్యది ? ప్రయోజనంబెద్ది యనిన, చెప్పెదము. స్థూలశరీరము మాత్ర మందఱికిని ప్రత్యక్షంబుగఁ దోఁచుచున్నది. మఱియెద్దియునుం దోచలేదు. కనుక ఈ విచారంబునకు ప్రసక్తి కలదు. ఇంతియ కాదు. వేదాంతులకంటె నన్యులైన వారలందరును దేహేంద్రియంబులు తోఁచినప్పటికిని ప్రత్యక్షంబుగ దోఁచునట్టి శరీర మొకటితప్ప వేఱు శరీరంబు లేదని వచించుచున్నారు. కాఁబట్టి విచారంబు నకుఁ బ్రసక్తి కలదు. ఈ విచారంబువలననే సమస్త దేహంబులును దేహాదినిష్ఠమయి వికారంబులును ఆత్మను కాలత్రయంబునను స్పృశించ లేవని తోఁచుచున్నది. ఇటులఁ దోఁచుటయే యీ విచారంబునకు ఫలము. గనుక యీ విచారంబునకు ప్రసక్తియుఁ బ్రయోజనంబు కలిగెను. ఇందువలన ప్రాణులకెన్ని శరీరంబులని విచారింపవలయును.  అయితే ప్రాణులకెన్ని దేహంబులనిన, స్థూలంబనియు, సూక్ష్మంబనియు, కారణంబనియు మూఁడు దేహంబులు. అందు స్థూలంబునకు శరీర లక్షణంబుండుట వలన స్థూలశరీరమునకు శరీరత్వము వచ్చుట సరియే. సూక్ష్మ కారణంబులకు శరీరత్వ మెటులనిన, వానికి శీర్యత ఇతి శరీరంఅనెడి లక్షణంబున్నది గాన శరీరత్వంబున్నది. జీర్ణత్వము వాని కెచట కనఁబడియెననిన, సుషుప్తియందును ముముక్షువుల యందును గనంబడియెం గావున వానికి శరీరత్వము గలదు. ఈ సూక్ష్మకారణ శరీరం బులు స్థూలంబు చందంబున ప్రత్యక్షంబుగఁ గానఁబడకుండుట వలన సూక్ష్మకారణ శరీరంబులు లేవని చెప్పుదమనిన, ఈ రెండు శరీరంబులును కలవని శాస్త్రంబులయందుఁ బ్రసిద్ధంబుగఁ జెప్పఁబడియున్నది. మఱియు పెద్దల వలన నంగీకరింపఁబడి యున్నది. కాఁబట్టి సూక్ష్మకారణ శరీర ములు లేవని చెప్పఁగూడదు.

            అట్లయినచో ఒక ప్రాణికి స్థూలశరీరంబు లెన్ని? సూక్ష్మ శరీరంబు లెన్ని ? ఒకటొకటి మూఁడు శరీరంబులు. శరీరత్వతుల్యంబులయి యుండఁగా ప్రాణికి స్థూలశరీరంబులనంతంబులయి సూక్ష్మ కారణ శరీరంబు లొక్కటొక్కటిగా నేల యనిన, స్థూల శరీరము కర్మజన్యమగుటచేత దానికి సాక్ష్యము కలిగెను. సూక్ష్మ కారణ శరీరంబులు కర్మజన్యంబులు గాకుండుట వలన నొకటొకటి యయ్యెను. సూక్ష్మ కారణ శరీరంబులు కర్మజన్యంబులు గావని చెప్పినందున సూక్ష్మశరీరంబునకు ప్రకారాంతము చేత జన్యత్వంబును, కారణశరీరంబునకు నెటువలెఁ గూడునని తోఁచుచున్నది. తోఁచినం దోఁచ నిమ్మనిన, కారణ శరీరంబునకు జన్యత్వంబు నంగీకరించి నందున శరీరత్వమే లేకపోవుచున్నది. పోయినం బోనిమ్మనిన, ప్రాణులకు మూఁడు శరీరంబులని చెప్పినది అసమంజసమగును.ఇఁకను సూక్ష్మ శరీరంబునకు ప్రకారాంతరంబు వలన నుత్పత్తి నంగీకరించినచో జీవున కనాదిత్వము పోవుచున్నది. జీవున కనాదిత్వ మెందుకొఱకు పోవుచున్న దనఁగా ఆత్మకు జీవత్వము సూక్ష్మశరీరమను నుపాధిచేత వచ్చినదని చెప్పుచున్నారు గనుక, జీవుని యుపాధియైన సూక్ష్మశరీమునకు నుత్పత్తిని జెప్పుచున్నందున జీవున కనాదిత్వము పోవుచున్నది. జీవునకు ననాదిత్వంబు సిద్ధించుటకొఱకు సూక్ష్మశరీరంబున కుత్పత్తి నంగీకరింపక యుండుద మనిన, సూక్ష్మశరీరంబునకు నుత్పత్తిని చెప్పుటచేత శ్రుత్యాదులకు విరోధంబు వచ్చుచున్నది. ఇంత మాత్రమేకాదు. సూక్ష్మశరీరంబునకు జన్య త్వంబు నంగీకరింపకపోయినచో సూక్ష్మశరీరంబునకు నిత్యత్వంబు వచ్చి అద్వితీయత్వంబె పోవుచున్నది. కావున శ్రుత్యాదులయందలి యర్థము సిద్ధించుటకొఱకును ఆత్మ కద్వితీయత్వము సిద్ధించుట కొఱకును సూక్ష్మ శరీరంబున కుత్పత్తి నంగీకరించినచో ఆ జీవున కనాదిత్వము పోయినది.

            ఇదిగాక లోకంబునం దెయ్యవి జన్యంబులయి యున్నవో అవి యన్నియు కర్మజన్యంబులుగానే యున్నవి. కాఁబట్టి సూక్ష్మశరీరంబునకు జన్యత్వంబు నంగీకరించునప్పుడు కర్మజన్యంబనియే యంగీకరింపవలెను. అట్లు గానియెడల ద్రష్టృనిరోధము వచ్చుచున్నది. వచ్చెనేని రానిమ్మనిన, అది యుక్తముగాదు. ఈ విరోధమును పరిహరించుటకయి సూక్ష్మ శరీరమునకు కర్మజన్యత్వము నంగీకరించినచో కర్మజన్యమగు స్థూల శరీరమునకువలె ననేకత్వము రావలెను. అటులనేకత్వంబు నంగీకరించిన పక్షమందొక ప్రాణి కొక సూక్ష్మశరీరమని చెప్పినది వ్యర్థమగుచున్నది. వ్యర్థమైనం గానిమ్మనిన, పూర్వమొకటియనియుఁ గర్మజన్యము కాదనియును చెప్పి, యిప్పుడు అనేక మనియుఁ గర్మజన్యమనియును జెప్పుటవలన పరస్పర విరోధము సంభవించుచున్నది. ఈ ప్రకారముగా నొక దోషమును పరిహరించినపుడు మఱియొక దోషము సంప్రాప్తమగుచున్నది గాన, నీ విచారమును వదలి మఱియొక విచారము నారంభించుదమనిన మఱియొకటిని చెప్పుటకు వీలు లేదు గనుక, ఇప్పుడీ సూక్ష్మశరీరము కర్మజన్యమని చెప్పినందుచే జీవుని అనాదిత్వంబునకును సూక్ష్మశరీరం బొకటి యనుటకును పూర్వము సూక్ష్మశరీరము కర్మజన్యము కాదని చెప్పినందుకు విరోధము రాకుండునటుల ముందఱఁ జెప్పుచున్నారము. ఇప్పుడు కారణశరీరమునకు జన్యత్వమును చెప్పకయే శరీరత్వ లక్షణమును జెప్పుచున్నారము.

            అది యెటులనఁగా, సూక్ష్మశరీరంబునకు జన్యత్వంబు నంగీకరించి కదా వానికి శరీరత్వమంగీకరింపవలెను. కారణశరీరంబునకు జన్యత్వంబు నంగీకరింపకయే శరీరత్వ మెటుల చెప్పఁబడునంటివేని దానికిని శీర్యతేఅనెడి శరీర లక్షణం బున్నయది గావున చెప్పవచ్చును. అయితే అనాదియగు వస్తువునకు నాశము గలదాయనిన కలదు. అదియెటులనఁగా, ఘటాది ప్రాగ్భావ మనాదియై యున్నప్పటికిని దానికి ఘటాద్యుత్పత్తి చేతను నాశం బును, ప్రకృతి పురుష సంయోగ మనాదియయి యున్నప్పటికిని ఆ ప్రకృతి పురుషులయొక్క వివేకముచేత నా సంయోగమునకు నాశం బెటులనో అటులనే అనాదియైన అజ్ఞానమనెడి కారణ శరీరంబునకును బ్రహ్మాత్మైక్య జ్ఞానము వలన నాశము వచ్చుచున్నది. కనుక దానికి శరీరత్వంబు నంగీకరించుట విరుద్ధంబు గాదు. ఈ చొప్పున సూక్ష్మశరీరంబునకు నుత్పత్తి నంగీకరించిన యెడల నొక విరుద్ధంబును లేదు. ఆ సూక్ష్మశరీరం బాత్మ కార్యంబై యున్నది గావున కారణంబగు నాత్మకంటె వ్యతిరిక్తంబుగ లేకుండుట వలనఁ గారణంబైన యాత్మకంటె వ్యతిరిక్తము కాదు. ఆత్మ కద్వితీయత్వ హానియును లేదు. ప్రళయంబునందును సూక్ష్మశరీరంబు కారణాత్మకంబుగ నున్నది. గనుకను ఆ సూక్ష్మశరీరమున కుపాధిగాఁగలిగిన జీవసంస్కారమున్నది గనుకనుజీవున కనాదిత్వ భంగమును లేదు. అయితే సూక్ష్మశరీరంబు ప్రళయంబునందుండె నేని దానికి నుత్పత్తి చెప్పఁగూడదు. అది యెటులనఁగా మృదాదులయందు లేని ఘటాదులకు మాత్రముత్పత్తిని గంటిమి. మృదాదులకు ఉత్పత్తిని కానమే యనియెదవేని, వస్తువనఁగా నసత్తు, ఆ యసత్తునకు ఉత్పత్తిని చెప్పునప్పుడు శశవిషాణాదు లకును ఉత్పత్తిని చెప్పవలసి వచ్చును. అవి పుట్టలేదు గనుక, అసత్తుకు ఉత్పత్తిని చెప్పఁగూడదు. మఱి యెటులనఁగా, ఉండునట్టి వస్తువు సత్తు. ఆ సత్తునకు ఉత్పత్తిని చెప్పవలెననుట లోకమందుఁ గన్నారము. అది యెట్లనిన, ఘటము చేయవలెనని ప్రవర్తించునట్టి పురుషుఁడు మృత్తికను గొనివచ్చును. కోకనేయ వలెయునని ప్రవర్తించునట్టి పురుషుడు తంతువులను గొనివచ్చును. పెరుగు వెన్న సంపాదింపగోరునట్టి పురుషుడు పాలు సంపాదించును. నూనియ గావలసినట్టి నరుడు నువ్వులను సంపాదించును గనుక, ఈ మృదాదులయందు ఘటాదులు లేకున్న నాకులాలాదులు మృదాదులను నియతంబుగ నెందుకొరకు సంపాదింతురు? సంపాదించుచున్నారు గాన ఉండునట్టి వస్తువునకే ఉత్పత్తిని చెప్పవలెను. అట్టు గాక లేని వస్తువునకు ఉత్పత్తిని చెప్పినచో ఈ కార్యమునకిది కారణమను నియమము లేకపోవుచున్నది. ఆ నియమము లేకపోవునపుడు తంతువుల వలన ఘటంబును, మృత్తువలనఁ బటంబును నీళ్ళవలనం బెరుంగును, ఇసుకవలన నూనెయును పుట్టవలెను. అటుల పుట్టుట గానము గనుక, ఆయా వస్తువులకు నియతమైన కారణము లుండుట కన్నారము. కాబట్టి ఉండెడి వస్తువే పుట్టుచున్నదని చెప్పవలెను. అయితే ఆయా కార్యంబులకు కారణంబులైన వస్తువులు నుండునవి యగుటవలన నవియు నిటువలెనే పుట్టుచున్నవని చెప్పఁగూడదు. ఆ మృదాదులకు ఉత్పత్తి ప్రత్యక్షముగాఁ గనఁబడలేదు గాన నీఘటాదులకు వలె వీటికి కారణములైన మృదాదులకు నుత్పత్తి చెప్పఁగూడదు. ఇదియునుగాక, యీ కారణములగు మృదాదుల కొక్కొక దిక్కున నుత్పత్తి గనఁబడి నప్పటికిని, శ్రుత్యాదులచేత పృథివ్యాదులకును జన్యత్వము వినఁబడినప్పటికిని, సర్వకారణమగు ఆత్మకు ఉత్పత్తి కలదని యొక ప్రమాణమేమియు లేదు గనుకను, అవస్థాది దోషములు వచ్చుచున్నవి గనుకను సర్వ కారణమయిన ఆత్మకు ఉత్పత్తిని చెప్పఁగూడదు. ఉండెడి వస్తువునకు ఉత్పత్తిని జెప్పుట యుక్తియుక్తము గా దని చెప్పఁగూడదు. అది యెటువలె ననిన, ఈ చెప్పిన యుక్తులచేత నసత్తునకు ఉత్పత్తి చెప్పఁగూడకపోయెను గనుక, సత్తునకు ఉత్పత్తిని చెప్పవలెను. సత్తనఁగా నుండెడి వస్తువు. దానికి ఉత్పత్తి నెటువలెఁ జెప్పఁగూడుననిన, పూర్వము తోఁచక నామరూపాంతరమై కారణాత్మకముగా బీజముల యందుండెడి వృక్షముల కెటులుత్పత్తియో, అటులే ప్రళయ మందును తోఁచక నామరూపాంతరమయి యుండెడి సూక్ష్మశరీరాదులు నామరూపాత్మకముగఁ దోఁచుటయే యుత్పత్తి. అట్లయితే అనభివ్యక్త రూపమై యుండెడి కారణము అభివ్యక్తనామరూపమై యుండెడి కార్యము వీటికి భేదము కలదా యనిన, కార్యము కాలత్రయమందును కారణాత్మక మయి యున్నప్పటికిని ఘటాదులు కులాలాది వ్యాపారమునపేక్షించుట యుక్తమే. పూర్వము చెప్పిన కాలత్రయమందును కార్యము కారణాత్మకముగా నున్నది గనుక, ప్రళయమందును ఆత్మకు జీవత్వమందు ఉపాధి భూతమయిన సూక్ష్మశరీరము కారణాత్మకముగా నున్నది గనుక, ప్రళయ మందును ఆత్మకు జీవత్వము సంస్కారాత్మకముగా నున్నది. కనుక జీవున కనాదిత్వభంగము లేదు. ఆ సూక్ష్మశరీరము నామరూపాత్మకముగా దోఁచుటయే యుత్పత్తియని అంగీకరింపఁబడియె. కాన శ్రుత్యాదులకును విరోధము లేదు. ఈ దోషమెటుల పరిహరించినప్పటికిని లోకమందు జన్యములగు వస్తువులకు కర్మజన్యత్వంబును అనేకత్వంబును కన్నారము. కనుక సూక్ష్మశరీరంబు జన్యమగునపుడు దానికి కర్మజన్యత్వంబును అనేకత్వంబును వచ్చునట్టి దోషంబు పరిహరింపఁబడ లేదంటివేని, వానికిని పరిహారము చెప్పెదము. అది యెటువలెననిన, ఆ సూక్ష్మశరీరమునకు కర్మజన్యత్వంబును అనేకతత్వంబును అంగీకరింపక దోషంబులు పరిహరింప వలెను. ఇటువలె నంగీకరించునపుడు పూర్వము సూక్ష్మ శరీరము కర్మజన్యంబు గాదనియును, అది యొకటి యనియును జెప్పినందున విరోధంబు దోఁచుచున్నదే యనిన, ఈ విరోధంబు లేకుండు నటుల దోష పరిహారంబుఁ జేసెదము. అది యెట్టులనిన, జన్యమంతయుం గర్మజన్యంబేయని గ్రహింపవలయును గాన, నాజన్యంబు సామాన్యకర్మ జన్యంబనియు, విశేషకర్మజన్యంబనియు రెండు విధములు. ఈ ద్వివిధంబు నందు సూక్ష్మశరీరంబునకు సామాన్యకర్మజన్యత్వ మంగీకరింపఁబడియెం గావున జన్య మాత్రంబునకు కర్మజన్య నియమభంగంబులేదు. ఈ సూక్ష్మ శరీరంబునకు సామాన్యకర్మజన్యత్వ మంగీకరించినప్పటికిని విశేష కర్మజన్యత్వ మంగీకరింపబడును గనుక, పూర్వము సూక్ష్మశరీరము కర్మ జన్యము కాదని చెప్పినందుకు విరోధము లేదు. సామాన్య కర్మజన్యమయిన వస్తువున కేకత్వంబును విశేషకర్మజన్యంబగు వస్తువున కనేత్వంబును వ్యవహారమునందుఁ గన్నారము. కాఁబట్టి సూక్ష్మశరీరంబు సామాన్య కర్మ జన్యంబైనను విశేషకర్మజన్యము గాకపోయెను గనుక, సూక్ష్మశరీర మొకటి యని చెప్పినందుకు విరోధంబు లేదు. ఇటుల సామాన్యకర్మ జన్యమయిన వస్తువున కేకత్వంబును విశేషకర్మజన్యమయిన వస్తువున కనేకత్వంబును నెక్కడయిననుం గలదా యనిన, లోకమందుఁ గన్నారము. ఎందనిన, పృథివ్యాదులయందుం గన్నారము. వానికి కర్మజన్యత్వము గానమే యనిన, జగత్తంతయుం జన్యంబ కావునను జీవులకు భోగ్యము కావునను, జగత్తు కర్మజన్యమనే చెప్పవలయును. జీవులకు భోగ్యమయితే జగత్తు కర్మజన్యము కావలెనా ? యనిన, కర్మములకు సుఖదుఃఖములు, ఆ సుఖదుఃఖము లానుకూల్య ప్రాతికూల్యవస్తువు లవలంబించుకొని వచ్చుచున్నవి గనుక, జగన్నిష్ఠపదార్థంబులలో గొన్ని పదార్థంబులు కొందఱి కనుకూలంబులును సుఖకరంబులునై యున్నవి. మరికొందరికి ప్రతికూలంబులును, దుఃఖ కరంబులై యున్నవి గనుక, ఆ జీవుల యొక్క కర్మములు తమకు ఫలంబు లయిన సుఖదుఃఖములకు సాధనంబులయిన ఆకాశాదులకు ఉత్పత్తిని సంపాదించుకొని అయ్యై జీవులకు సుఖదుఃఖముల నిచ్చుచున్నవి. కాబట్టి జగత్తంతయు గర్మజన్యంబే యని చెప్పవలయును. స్థితికాలంబు నందు గదా జీవులును, వారి కర్మంబులును కనబడుట. ప్రళయంబునందైతే జీవులును జీవులయొక్క కర్మంబులును గానము. ఇట్లుండగా జీవులయొక్క కర్మముల చేత నాకాశాదిజగత్తు పుట్టుననునది యెట్టులనిన, ప్రళయకాల మందును జీవులందరు తమ తమ యుపాధులతో గూడుకొని సుషుప్తి యందు సంస్కారాత్మకముగా నున్నారు. కాన వారల యొక్క కర్మంబులును సంస్కారాత్మకంబులై యున్నవి గనుక, అటువంటి కర్మముచేత నాకాశాది జగత్తు పుట్టెననుట కూడును. ఇటులంగీకరింపని యెడల, పూర్వకల్పంబు నందు జీవులచేఁ జేయబడిన కర్మంబులకు ఫలము లేకపోవలయును. పూర్వ కల్పంబునందు జేయని కర్మంబులకీ కల్పంబునందు ఫలములు రావలయును. ఇంతమాత్రమే కాదు, శ్రుత్యాదులకు వైయర్థ్యంబును వచ్చును. ఒక కారణంబును లేకయే జగత్తు పుట్టునని చెప్పునప్పుడు ముక్త పురుషులకును ఉత్పత్తి కలుగవలెను. జగత్తునందు మనుష్యులు దేవతలు తిర్యక్కులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనునట్టి వ్యవహార వ్యవస్థలు లేకపోవలయును. ఈ దోషంబులు వచ్చెనేనియు రానిమ్మనుట యుచితంబు కాదు. కావున ప్రళయంబునందును సంస్కారాత్మకమయిన జీవుల యొక్క కర్మంబులవలననే ఆకాశాది జగత్తులు పుట్టుననుట యందు సందేహంబు లేదు. ఇటులే యాకాశాదులు కర్మవలనఁ బుట్టినను స్వగత వికారము లున్నను ప్రళయంబులయందు లయించి యుండి ఆయా సృష్టియం దాకాశ మాకాశంబుగ, వాయువు వాయువుగ, తేజస్సు తేజస్సుగ, జలంబు జలంబుగ, పృథ్వి పృథివిగ, నెటుల పుట్టుచున్నవో, అటులే సూక్ష్మ శరీరమును ప్రళయంబులయందు లయించి యున్నప్పటికిని ఆ జీవుల యొక్క కర్మముచేత పూర్వకల్పంబునం దెటులుండునో అటుల ప్రతికల్పంబు నందునుఁ బుట్టుచున్నది. ఇటుల పుట్టి స్వగత వికారవత్తై యుండినను సూక్ష్మశరీరంబు ముక్తి పర్యంతంబు నొకటియే. ఈ చొప్పున జెప్పుటవలన ముక్త్యనంతరము సూక్ష్మశరీరంబు లనేకంబులై యుండునని తోఁచుచున్న దంటివేని, ముక్త్యనంతరంబున సూక్ష్మశరీరము లేనేలేదు. అటువలె ననేకంబులని తోఁచుట కవకాశంబు లేదు. ఈ మేఱకు సూక్ష్మశరీర మాకాశాదులవలె సామాన్య కర్మమువలనఁ బుట్టియున్నది గనుక, నొక ప్రాణికి నొక సూక్ష్మశరీరమని చెప్పినది యుక్తమే. అయితే యిటుల చెప్పుట విరోధముగా దోచుచున్నది. ఆ విరోధమేది యనిన, ఆకాశాదులు సమస్త ప్రాణి కర్మజన్యములు గాన నయ్యాకాశాదులకు సామాన్యకర్మజన్యత్వంబును, ప్రళయపర్యంతంబు నొకటియై యుండుట యును, ప్రతికల్పమందును అటువలెనే పుట్టుటయును యుక్తము. ఆయా ప్రాణులయొక్క సూక్ష్మశరీరము లయితే సమస్త ప్రాణి కర్మజన్యములు కావు  గనుక, వాటికి సామాన్య కర్మజన్యంబును ఒక ప్రాణి కొకటి యనుటయును ప్రతికల్పమందును పుట్టుచున్నవనుటయును ముక్తిపర్యంతము నిత్యమనుట యును నెటుల చెప్పవచ్చుననిన, చెప్పవచ్చును. అది యెటువలెననిన, ఆకాశాదులవలె నాయాప్రాణుల యొక్క సూక్ష్మశరీరములు సమస్త ప్రాణుల యొక్క కర్మముల చేత పుట్టకున్నప్పటికిని ఆయా ప్రాణులకు సృష్టి మొదలుకొని ప్రళయ పర్యంతంబును స్థూలశరీరము ద్వారా సుఖదుఃఖముల నిచ్చునట్టి కర్మములచేతను ఆయా ప్రాణులయొక్క సూక్ష్మశరీరములు పుట్టుచున్నవి గనుకను, ఆ సూక్ష్మశరీరములకు సామాన్యకర్మజన్యత్వంబును నొకప్రాణి కొక సూక్ష్మశరీరంబనుటయు ప్రతికల్పమందు నటులే పుట్టుచున్న దనుటయును ముక్తి పర్యంతము నిత్యమనుటయును చెప్పవచ్చును. లీనమైన వస్తువు కర్మము నపేక్షించి పుట్టుచున్నదనుటకును సామాన్యకర్మమువలన బుట్టిన వస్తువు ఒకటియైయుండు ననుటకును విశేషకర్మలవలన బుట్టిన వస్తువు నానారూపములు కలిగియుండు ననుటకును దృష్టాంతము కలదా యనిన, కాష్టపాషాణాదులయందు లీనమయి యుండెడి అగ్నికి మథనాది రూపమయిన కర్మములచే నెట్టులుత్పత్తియో యటులే కారణరూపమైన సూక్ష్మశరీరమునకును కార్య కారణములుగాఁ దోచెడి కర్మముచేతనే యుత్పత్తి కలుగుచున్నదనుట చెప్పవచ్చును. ఇటుల చెప్పినందున కార్యమ సత్తనుటయును దోఁచెను. సామాన్యకర్మము వలన బుట్టినవస్తువు వొకటి యనుటకును విశేషకర్మము వలన బుట్టిన వస్తువు అనేక మనుటకును దృష్టాంతము చెప్పెదము. కులాలుని చేతను నానా విధములయిన భాండములును చేయవలెనని సంపాఁదింపబడిన మృత్పిండమొకటియే. అది యనేక కర్మలచేతఁ జేయబడినను ఆ కులాలుని మృత్పిండమువలన బుట్టిన భాండము లన్నియును సమానములై యున్నవి. ఆ మృత్పిండము సామాన్యకర్మకార్యము గనుక నేకము. దానివలనఁ జేయఁ బడిన భాండములలో నొక భాండమును జేసిన కర్మవలన మరియొక భాండమును జేయలేదు గనుక నా భాండములు విశేషకర్మజన్యములు. అవి నానా రూపములు ననేకములునై యున్నవనుట సర్వానుభవ సిద్ధము. ఇటువలె సూక్ష్మశరీరము సామాన్య కర్మజన్యంబయ్యెఁ గాన నది యొక్కొక్క శరీరమనుటయు, స్థూలశరీరంబు విశేష కర్మజన్యంబయ్యెఁగాన నది యొక్కొక్క ప్రాణి కనంతంబులనుటయును గూడదు. మరియు నీయర్థమందు విశేష దృష్టాంతంబు గలదా యనిన, కలదు. అది యెటువలెననిన, లోకమందు దేవదత్తునకే కర్మవశంబున నానావిధంబులగు వస్త్రంబులు వచ్చుచున్నవి. ఆ వస్త్రంబులొకటిగా నుండలేదు, గనుక అది యెటువలె విశేష కర్మవలన వచ్చుచున్నదో అటువలెనే స్థూలశరీరంబులును చిత్రంబులై యొక్కొక్క ప్రాణికి అనంతంబులై వచ్చుచున్నవి గనుక, ఆ స్థూల శరీరంబులును విశేషకర్మ జన్యంబులేయని తెలుసుకోఁదగినది. ఆ దేవత్తునికే ఆయా విశేష కర్మలచేత వస్త్రములు వచ్చి, ఆ వస్త్రములచేత వచ్చెడి సుఖదుఃఖంబులకు సాధనభూతంబగు స్థూలశరీరమొకటియై యున్నది. కాఁబట్టి ఆ వస్త్రంబుల నపేక్షించి స్థూలశరీరమెటువలె సామాన్య కర్మజన్యమాయెనో, అటువలెనే సూక్ష్మశరీరమొక్కొక్క ప్రాణికి నొక్కొక్కటియై యున్నది, గనుక అదియును సామాన్యకర్మజన్యమని తెలుసుకోఁదగినది. ఇట్లు చెప్పుటవలన సిద్ధించుట యేమి యనిన, సూక్ష్మశరీరంబునకే స్థూల శరీరము యొక్క గ్రహణంబును వాటి యొక్క త్యాగంబునని తెలుసుకోఁదగినది. దృష్టాంతమందు స్థూలశరీరంబునకే వస్త్రాదులయొక్క గ్రహణంబు లును, వాటియొక్క త్యాగంబును ప్రత్యక్షంబుగ నెటుల కన్నారమో, యట్టులే సూక్ష్మశరీరమునకు స్థూలశరీరమును పరిగ్రహించుట జన్మము. దానితోడ నిఁక మీఁద సంబంధము లేనియటుల విడచుట మరణంబని సిద్ధించు చున్నది. ఈ విధంబున జన్మ మరణంబులుగల సూక్ష్మశరీరమునకే జన్మ మరణములు లేవని తోఁచుచుండఁగా, ఆత్మకు జన్మ మరణముల ప్రసక్తి లేదని చెప్పవలసినదేమి? ఇటువలెఁ జెప్పునప్పుడా సూక్ష్మశరీరంబు లనంతంబులని చెప్పఁబడినట్టు తోఁచుచున్నది. తోఁచినం దోఁచనిమ్మని యంటివేని పూర్వము ప్రాణులకు స్థూలశరీరములనంతంబులని చెప్పి, యిప్పుడు సూక్ష్మశరీరమునకు, స్థూల శరీరములనంతము లని చెప్పినందున పూర్వము చెప్పినందుకు నిపుడు చెప్పినందుకును విరోధము వచ్చుచున్నది గనుక, సూక్ష్మశరీరమే ప్రాణిశబ్దమున కర్థమని చెప్పుదమనిన అట్లు చెప్ప గూడదు. ఎందుచేతననిన, పూర్వము ప్రాణులకు సూక్ష్మశరీర లోకమొకటి యని చెప్పి ఇప్పుడా సూక్ష్మశరీరమే ప్రాణిశబ్దమున కర్థమని చెప్పినచో ఇప్పుడే రెండు విధములుగాఁ దోచుచున్నది గనుక, అటువలె చెప్పఁగూడదు. అయితే మఱి యెటుల చెప్పవలెననిన, ఇచట ప్రాణిశబ్దమునకు ఆత్మయని యర్థము. ఆ యాత్మకే కారణశరీరమనెడి పేరుకల అజ్ఞానము చేతవచ్చిన సూక్ష్మశరీరాధ్యాసద్వారా అనంతములైన స్థూలశరీరములు వచ్చుచును బోవుచునూ ఆ స్థూలశరీరనిష్టమయిన జన్మమరణములు ప్రసక్తమైనటుల తోఁచుచున్నది. ఎప్పుడు తోఁచుచున్నదనిన, దృష్టాంతమందు దేవదత్తునిచేత నానా విధములయిన వస్త్రములు గ్రహింపఁబడుటయును విడువఁబడుటయును ప్రత్యక్షము గనఁబడినప్పటికిని, స్థూలశరీర వ్యతిరిక్తుఁడై యాస్థూలశరీరమందధ్యాసచేత దేవదత్తుఁడనే పేరుగల జీవునికి స్థూలశరీరము ద్వారా వస్త్రగ్రహణ త్యాగాదు లెటువలెఁ దోఁచుచున్నవో అటువలెనే అజ్ఞానముచేత వచ్చిన సూక్ష్మశరీరముద్వారా ఆత్మకు ననంతములయిన స్థూలశరీరములు వచ్చుచుఁబోవుచున్నట్లు మోహము చేత తోఁచుచున్నది. విచారించినప్పుడు స్థూలశరీరమునకు జన్మ మరణములు ప్రత్యక్షంబుగాఁ గనఁబడలేదు. కనుక సూక్ష్మశరీరమునకు స్థూలశరీరంబుతోడ నధ్యాస వినాగా జన్మమరణంబులు లేవు. సూక్ష్మ శరీరంబునకే జన్మమరణంబులు లేకపోయె గాన, ఆత్మకు మోహమాత్రము వినాగా జన్మమరణంబులు  లేవని చెప్పవలసినదే లేదు. ఈ చెప్పిన చొప్పున ప్రాణులకు స్థూలశరీరంబు లనంతంబులు. సూక్ష్మ కారణ శరీరంబులొక టొకటి యనియుం జెప్పినది యుక్తమే. ఇందువలన సిద్ధించునవి ఏవి యనిన, శరీరత్రయంబును ప్రాణి శబ్దముచేతఁ జెప్పఁబడిన ఆత్మ కాదనుటయే. అది యెటులనిన, లోకంబునందు ఒకఁడు మఱియొకనిని నీకు రుద్రాక్ష పేరు లెన్నియని అడిగిన మూఁడనియును, జందెము లెన్నియని అడిగిన మూఁడనియును, మరియు నీకు దోవతు లెన్నియని అడిగిన మూఁడనియును యెటువలే చెప్పుచున్నాఁడో అటువలెనే ప్రాణులకెన్ని శరీరములని విచారించునపుడు మూఁడు శరీరములని తోఁచుచున్నది. ఇటుల దోఁచుటవలన దృష్టాంత మందు రుద్రాక్ష పేరులు మొదలయినవి వాటి ధరించినవారల నెటుల స్పృశింపలేదో అటువలెనే దార్షా  ్టంతిక మందును స్థూల సూక్ష్మ కారణ శరీరములు ప్రాణి శబ్దముచేతఁ జెప్పఁబడిన ఆత్మ కాదనియును, శరీరత్రయనిష్ఠమయిన వికారము లాప్రాణి శబ్దవాచ్యుఁడైన ఆత్మను స్పృశింప లేవనియును దోఁచుచున్నది. లోకమందు దేవదత్తాదులకు గృహియనియు క్షేత్రియనియు పుత్రియనియు ధని యనియు కుండలి యనియు వ్యవహారము కన్నారము. ఇటువలెనే ఆత్మకు శరీరి యనియు దేహియనియు ప్రాణియనియు ననెడి వ్యవహారము లోకమందును వేదములయందును తోఁచుచున్నదది. దృష్టాంతమందు గృహి క్షేత్రి పుత్రి ధని కుండలి అని తోఁచునట్టి దేవదత్తాదులు ఆ గృహాదు లెటువలె కారో ఆ గృహాది నిష్ఠమయిన వికారములు వారి నెటువలె స్పృశింపలేవో అటు వలెనే శరీరి యనియు దేహియనియు ప్రాణియనియు నుపాధివలనం దోచెడి ఆత్మయును శరీరాదులు కాదు. ఆ శరీరాదినిష్ఠ వికారము లాత్మను కాల త్రయమందును స్పృశింపలేవు. ఈ ప్రకారమున శరీరత్రయంబును ఆత్మ కాదనియు శరీరత్రయనిష్ఠ వికారములాత్మకు లేని వయినను సామాన్యముగఁ దోఁచుచున్నవి గనుకను, విశేషముగా స్థూలశరీరమువలె, సూక్ష్మ కారణ శరీరములు రెండును దోఁచలేదు గనుకను, పలుమారు విచారించినప్పటికిని ఈ శరీరములు మూఁడును ఆత్మ కాదు. ఈ శరీరత్రయనిష్ఠమయిన వికారంబులు ఆత్మను స్పృశింపలేవు. ఇందుకొక విశేష యుక్తి కలదు. ఆ యుక్తియేది యనిన, స్థూలశరీరము సమస్త ప్రాణులకు ప్రత్యక్షము గనుక, అది కలదో లేదోయని యెవరికిని సందేహము కలుగదు. చార్వాక పామరులకన్న నితరులయిన స్థూలశరీరమాత్మ కాదను కొనుటకు సందేహము లేదు. ఆ చార్వాక పామరులకును స్థూలశరీరమే ఆత్మయని తలంచుట యుచితము కాదు. ఎందుచేతననిన, సూక్ష్మశరీర మందలి, అధ్యాస చేత జీవస్వరూపుండగు ఆత్మ సూక్ష్మశరీరముద్వారా స్థూలశరీరాధ్యాస చేత వచ్చిన పుత్రాద్యపేక్ష వలన పిత్రాది శబ్దములచేఁ  జెప్పఁబడుచున్నాఁడు. ఇటువలె పిత్రాదిశబ్దములచేతఁ జెప్పఁబడినవాని వలెనే తోఁచునట్టి ఆత్మ స్థూలశరీరమునకంటె భిన్నుఁడయి పిత్రాది శబ్దములచేత నీ స్థూలశరీరమే చెప్పఁబడెనేని ఆ పిత్రాదులు చచ్చి పోయిరని చెప్పక యుండవలయును. అటులుండక చచ్చిపోయిరని చెప్పుచున్నారు గాన, స్థూలశరీర వ్యతిరిక్తుండే ఆత్మయని చార్వాక పామరులను అంగీకరింప వలెను. మఱియును యుక్త్యంతరము చేతను స్థూలశరీర వ్యతిరిక్తుఁడే ఆత్మ యని తోఁచుచున్నది.

            అది యెటువలె ననిన, ఆ పిత్రాదిశబ్దంబులకు అర్థమని తోఁచెడి ఆ పిత్రాది స్థూలశరీరములు చచ్చిపడియుండఁగా దానిం గౌగిలించుకుని యేడ్చెడి పుత్రాదులు మమ్ము నవాంతరమున విడిచి అప్పు ఇచ్చినచోటిది, పుచ్చుకొనినచోటిదియని చెప్పక మానోట మన్నుఁ గొట్టి మా తండ్రి మొదలయినవారు చచ్చి పోయిరని చెప్పుచున్నారు. ఇంతేకాదు. బంధువులు స్నేహితులు మొదలైనవారు ఆ పిత్రాదులును మీ తండ్రి మొదలైనవారు చచ్చిపోయిరి గదా యని విచారించునపుడు ఆ వచ్చినవారితో పుత్రులైనవారు ఆయ్యా ! మా తండ్రిపోయెను, మా తల్లి పోయెను, మమ్ముం జెఱచిపోయిరి. ఇంక మాకు దిక్కెవరును లేరు గదా అనియును, తోడఁబుట్టువులైన వారలు మా తోడు పోయెను, మాయన్న పోయెను, మా తమ్ముడు పోయెను, మమ్ము గతిమాలిన వారినిగాఁ జేసిపోయెను అనియును, భార్యలైనవారు నా దేవుఁడు నన్నుఁజెెఱచిపోయెను. సర్వవిధములచేతను చెడితిని, చీమలపుట్టలో చిచ్చు వెట్టినట్లు మమ్ము బట్టబయలున విడిచి కంచంత కాపుమును కాటిలో బెట్టిపోయెను. ఇంక నీ కసుగందలకు దిక్కెవ్వరు, ఈ దుఃఖమును జూడలేను నన్ను దేవుఁడు కొంచు పోకపోయెను అనియును, తల్లిదండ్రులైనవారు అన్నా మాచిన్నవాఁడు పోయెను, మా కలలన్నియు మన్ను కలసి పోయెను, అన్నా మాట్లాడరా, అప్పా మాట్లాడరా, నా తండ్రీ పలుకవేమిరా నన్ను గూడఁదోడుకొనిపోరా, ఒకపోడిమియు గానక పోయివి గదరా అనియును ఆ పిత్రాదులు బహువిధముగా దుఃఖపడుచుండఁగా నప్పుడు విచారించుటకు వచ్చిన వారు అమ్మా మీరెందుకు దుఃఖపడుచున్నారు. ఈ దుఃఖపడుట వలన పోయినవారు రాఁబోరు. దుఃఖమును మానుఁడని యాశ్వాసించునపుడు, అయ్యా యేడుగురు చిన్నవారిని యేటిలో కలిపితిని. ఒక ముహూర్త ముననే పోయిరి. ఈ దుఃఖమును సహింపలేను. మమ్ము దేవుఁడు శోధించెను. మా వారలందఱు నాకన్న దుఃఖమును పొంది యున్నారు గనుక మేమందఱము నొక తేపనే విషము బుచ్చుకొని చితిమీఁద బండుకొనెదము. ఈ దుఃఖమును తరించుటకు నింతకన్న వేరుగతి లేదని మొత్తుకొని మొత్తుకొని యేడ్చుచున్నారు. ఇంతమాత్రమే కాదు విద్వాంసుఁడైన వాఁడు తన భార్య, చచ్చిపోయినపుడు తనవారిని జూచి, అయ్యా నా ప్రాణప్రదమైన పెండ్లాము పోయెను. ఈ దుఃఖమును సహింప నాకు వశము గాదు. లోకములోని యిల్లాండ్రవలె గాదు. మహా పతివ్రత, మిగుల సుగుణములు గలది. అయ్యో ప్రాణనాయకీ మాటలాడవేమే. నాకు దిక్కెవ్వరే, ప్రాణప్రదమైన నిన్నెడఁబాసి యుండలేదు గదవే. వేళ తప్పక నన్నాదరించి అన్నము బెట్టువా రెవ్వరే. నీ సుగుణములు వర్ణింప వశముగాదు కదవే. నేనును నీవెంట వచ్చెదనే యని యేడ్చుచున్నాఁడు. కాఁబట్టి ఈ చెప్పినవి యెటుల నున్నవనిన, మీమామ మొదలయిన వారు వచ్చియుండిరి గదా వారు పోయిరాయని యొకఁడడిగితే అందుకు మరి యొకఁడు మాతో చెప్పకయే కట్టుకొనునట్టి బట్టలతో విడచిపెట్టి పోయినట్టున్నదని చెప్పినట్టున్నది. కాఁబట్టి దృష్టాంతమందా మామ మొదలయినవారల కెటువలె నర్థమో, అటువలెనే ఈ స్థూలశరీరమును విడిచిపెట్టి కర్మాను సారముగా లోకాంతరంబునకు పోయిన వారే పిత్రాదిశబ్దముల కర్థముగాని వెళ్ళిపోక మునుపిక్కడ నుండెడి స్థూలశరీర మా పిత్రాదిశబ్దముల కర్థము కాదు. కనుక అటుల చెప్పఁగూడదు. అటుల చెప్పినచో దోవతులు విడిచి పెట్టి పోయిన మామ మొదల యినవారు ఆ దోవతులు పెట్టిపోక మునుపు ఆ దోవతులే కావలెను. ఇంతమాత్రమే కాదు. ఒక గృహమందుండి వెడలిన పురుషుఁడు ఆ గృహము నందుండి వెడలకమునుపు గృహమే కావలయును. అట్లు కాలేదు గనుక, దోవతులు మొదలయినవానితోఁగూడుకొని యుండెడి మామ మొదలయిన వారు ఆ దోవతులు గృహము నెటువలె కారో, అటువలెనే పిత్రాదులు స్థూలశరీరముతోఁ గూడుకొనియున్నప్పటికిని కూడి యుండ కున్నప్పటికిని ఆ పిత్రాదిశబ్దములకు స్థూలశరీరమును విడిచిపెట్టి పోయినవారేనని అర్థము గాని, స్థూలశరీరము అర్థము కాదు. ఏ పిత్రాది శబ్దములు మరణమునకు మునుపు స్థూలశరీరమున కర్థమని యెంచుకొని ఆ శరీరముగూర్చి యొక యుదాసీనత చేసినప్పటికిని అట్టి వానికి అనేక నరకములు సంప్రాప్తము లగునని శాస్త్రము చెప్పుచున్నదో ఆ శరీరమునే పుత్రాదులు కాలవేయు చున్నారు. ఆ పిత్రాది శబ్దములకు స్థూలశరీరమే అర్థమైనట్లయితే ఆ శరీరములను కాలవేసిన పుత్రాదులకు పితృహత్యాది దోషములు రావలెను. ఆ దోషములు వచ్చునెడల నాపుత్రాదుల కనంతకోటినరకములును గలుగవలెను. ఇదియె గాక లోకులాపిత్రాది దేహంబులను దహించినవారిని పితృహత్యాపరులు మాతృహత్యాపరులు అని దూషించి వారితో మాటలాడక నుండవలయును. అటుల గానము గనుకను, వారలకు పిత్రాదిదేహములను కాలవేసినందున నరకాదులు సంప్రాప్తమగునని శాస్త్రంబులయందు లేదు గనుకను, ఈ స్థూలశరీరమా పిత్రాది శబ్దంబుల కర్థంబు గాదు గనుకను, ఏ శరీరంబు పిత్రాదిశబ్దంబుల కర్థంబని యెంచి సకలోపచారంబుల చేతను బూజించుచున్నారో ఆ శరీరంబులను మరణాంతరంబున దహింపక పోయిరేని ఆ పుత్రాదులకు ప్రత్యవాయ దోషంబును శాస్త్రంబులయందు విధించి యున్నది గనుక, ఆ పిత్రాదులకు దహనాది క్రియలుచేసి స్థూలశరీరంబు నందుండి లోకాంత రంబునకు వెళ్ళిన పిత్రాదులకు ప్రేతత్వ విమోచన రూపమయిన యతి శయత్వంబును ఆ శరీరంబులను దహింపఁ జేసిన పుత్రాదులకు ప్రత్యవాయ దోషము లేదనియు శాస్త్రంబులయందు విధించియున్నది గనుకను, పట్టణంబునందుండిన రాజు బైట వెళ్ళెనేని ఆ పట్టణంబున కేకీడును రాకుండునటుల వానిభృత్యులెటుల కాపాడుచుందురో ఆ భృత్యులటుల గాపాడకున్న రాజు వారి నెటుల శిక్షించుచున్నాఁడో, అటులనే చచ్చిపడి యుండెడి పిత్రాది శరీరంబులకు పుత్రాదులను సంస్కారాదులు చేసిరేని యాపిత్రాదుల కతిశయత్వంబును దహించిన వారలకు ప్రత్యవాయదోష రాహిత్యంబును కలుగునని తెలుసుకొనఁదగినది.

            మఱియును లోకములోని జనులు చచ్చియుండెడి పిత్రాది శరీరంబులను సంస్కరించిన పుత్రాదులకు వీరు పిత్రాదులకు మంచి గతిని సంపాదించిరని కొనియాడుచున్నారు. సంస్కారాదులు చేయని వారిని దూషించుచున్నారు. కాఁబట్టి ఆ పిత్రాది శబ్దంబులకు నీ స్థూల శరీరంబు నందుండి వెడలి లోకాంతరంబునకుం బోయినవారే అర్థమని తోఁచు చున్నది. అటు గాకపోయిన పక్షమందు ఈ స్థూల శరీరమునే పిత్రాదులని యెంచి యెల్లరును శుశ్రూష చేయుటకు కారణమేమి యనిన, ఈ స్థూల శరీరమందుండెడివానికి ప్రీతికొఱకు శుశ్రూష చేయుచున్నారు గాని, స్థూల శరీరమునకు ప్రీతికొఱకుఁ గాదు. అది యెటు లనఁగా, నగరులో రాజుండఁగా నతనికి ప్రీతికొఱకు మేలుకట్టు మొదలయిన యలంకారము లెటుల చేయుచున్నారో ఆ నగరునకు ప్రీతి కొఱ కెటువలెఁ జేయలేదో అటువలెనే స్థూలశరీరంబునకు శుశ్రూష చేసెడివారు మోహమువలన నా శరీరములే పిత్రాదిశబ్దముల కర్థమని యెంచుకొని యున్నప్పటికిని ఆ స్థూలశరీరమున నుండెడి వారి ప్రీతి కొఱకే శుశ్రూష చేయుచున్నారు. కనుక ఆ స్థూల శరీరంబులయం దుండెడివాఁడే పిత్రాదిశబ్దంబుల కర్థము.

            ఇంత మాత్రమే కాదు. లోకమందు గ్రామాంతరమునకుఁ బోయిన వాని దోవతులు దొంగలు దోఁచుకొనిపోయిరేని వాని పుత్రాదులామాట వినినవారై వేరు దోవతు లిచ్చి పంపునటుల లోకాంతరమునకు పోయిన పిత్రాదులు నగ్నులై పోవుచున్నారు. వారలకు నగ్న ప్రచ్ఛాదనార్థంబుగా నిక్కడ బ్రాహ్మణునికి వస్త్రమిచ్చినచో ఆ వస్త్రము వారికి చెందుచున్నదని శాస్త్రంబులు చెప్పఁగా విని వారి యొక్క పుత్రాదులు ఇక్కడ బ్రాహ్మణునికి వస్త్రమిచ్చుచున్నారు. ఇందుచేతను ఈ స్థూలశరీరము పిత్రాది శబ్దములకు అర్థము కాదని తోచుచున్నది. ఇంతేకాదు. మడిలో పనిచేసెడివాఁడెండచేతఁ గొట్టువడి దాహాతాపాదులచేత బాధపడుచున్నాఁడని విని గృహ మందుండెడివాడు వానికి అన్న పానీయాదులనుకొనిపోయినటుల చచ్చి లోకాంతరమును పొందిన పిత్రాదులకు ఆఁకలిదప్పు లిక్కడ నిచ్చెడి పిండ తిలోదకములచేత పోవునని శాస్త్రములచేత విని వారలయొక్క పుత్రాదులు వారలకు పిండతిలోదకంబుల నిచ్చుచున్నారు. మరియు దేశాంతరము పోవలెనని పరస్థానము చేసినవానికి నింటివారు కట్టువంటకము నిచ్చి పంపునటుల చచ్చి లోకాంతరమున కుపవాసులయిపోవునట్టి పిత్రాదుల కిక్కడ స్వర్గపాథేయంబు నిచ్చిరేని వారియాఁకలి పోవునని శాస్త్రముఖంబున విని వారల యొక్క పుత్రాదులు స్వర్గపాథేయంబు నిచ్చుచున్నారు. ఇంతియెగాక పొరుగూరికి పోవుటకై యనుపఁబడి పోయిన పురుషుడు ఏటి వెల్లువ వచ్చినం బోవఁజాలక యేటిగట్టున నున్నాఁడని విని యింట నుండెడివా రొక తెప్పఁబంపి నటువలె చచ్చి లోకాంతరంబు నొందిన పిత్రాదులకు స్వర్గప్రాప్తి కలుగుట కాటంకముగా వైతరణియను నది యొకటి ఉన్నదని శాస్త్రముచే విని వారు దాఁటిపోవుటకై వారియొక్క పుత్రాదులిక్కడ వైతరణీగోదానంబు నిచ్చుచున్నారు. ఉండియుఁజచ్చి లోకాంతరవాసులైన పిత్రాదులను గూర్చి, వారు చచ్చినది మొదలు సంవత్సర పర్యంతంబు ప్రతిమాసంబున మాసికంబును తరువాత వారి వారి పుత్రాదులెంత కాలము జీవించి యుందురో అంత పర్యంతంబును ప్రతి సంవత్సరంబును వారల నుద్దేశించి శ్రాద్ధంబులును మధ్యే మధ్యే అష్టకాది శ్రాద్ధంబులును పుణ్య క్షేత్రంబులయందు తీర్ధ శ్రాద్ధాదులును చేయుచున్నారు. కాఁబట్టి ఈ చెప్పఁబడిన దృష్టాంతముల చేతను, ఈ స్థూలశరీరము పిత్రాది శబ్దంబుల కర్థంబు గాదని స్పష్టముగాఁ దోచుచున్నది. అటువలె గాక భస్మమైపోయిన స్థూల శరీరమే పిత్రాది శబ్దంబుల కర్థమనుట కూడదు. ఈ స్థూలశరీరంబు నందుండి లోకాంతర గమనంబు పొందినవారే ఆ పిత్రాది శబ్దంబుల కర్థమనుట కూడును. కాఁబట్టి ఈ స్థూలశరీరము పిత్రాది శబ్దంబులకు అర్థంబు కాదు. ఈ చెప్పిన యుక్తులచేత నీ స్థూలశరీరంబు పిత్రాది శబ్దంబులకు అర్థము గాకపోయినను, ఇందుచేత సూక్ష్మశరీర సిద్ధి కలిగెనా? యనిన కలిగెను.

            అది యెటులనిన, ఈ స్థూలశరీరమును విడిచి లోకాంతర గమనంబు నొందునది యేదియో అదియే సూక్ష్మశరీరంబు. ఇటువలెఁ జెప్పునప్పుడు ఆ పిత్రాది శబ్దంబులకు ఈ సూక్ష్మశరీరమే అర్థమని చెప్పి నట్లాయెను గదా యనిన, అటుల గాదు. పిత్రాది శబ్దంబులకు సూక్ష్మ శరీరము ద్వారా చేతనమని అర్థము. సూక్ష్మశరీరము చేతగదా పిత్రాది శబ్దంబులకు చేతనమను నర్థంబు సిద్ధించె. అచేతనమయిన సూక్ష్మశరీరంబు పిత్రాది శబ్దంబుల కెటువలె నర్థమౌననిన, చేతనమనఁగా ఆత్మ. ఆ యాత్మ యాకాశమువలె వ్యాపకుఁడు గాన, నితనికి లోకాంతర గమనాగమనములు కూడదు. నిరవయవుడు గనుక, కర్మాది సంస్కారాశ్రయత్వము కూడదు. కర్మాది సంస్కారాశ్రయము నంగీకరింపపోయినచో కృతనాశకృతాభ్యాగమాది దోషంబులు వచ్చుచున్నవి. కాఁబట్టి కర్మాది సంస్కారంబున కాశ్రయంబున సూక్ష్మశరీరమే లోకాంతరగమనంబు నొందునదియని యంగీకరింప వలెను. అట్లయితే చావుపుట్టువులును లోకాంతర గమనాగమనంబులును పుణ్యపాపంబులును చేతన కర్మంబులయి యెట్లు తోఁచుచున్నవనిన, వ్యాపకుండైన ఆత్మ సూక్ష్మశరీరంబునకు పదియాఱవ అవయవమై అంతఃకరణంబునందలి ప్రతిబింబము ద్వారా ఆ సూక్ష్మశరీరంబుతోడ నధ్యాస వచ్చినందున నగ్ని తోడి తాదాత్మ్యంబు వలన నయఃపిండంబెటుల దోఁచుచున్నదో యటుల నీ సూక్ష్మశరీరంబుతోడి తాదాత్మ్యంబు వలన స్థూల శరీరంబును మోహంబుననే చేతనంబు చందంబున దోఁచుచున్నది. కాన చావు పుట్టువులు మొదలైన ధర్మంబులు మోహముచేత నధర్మంబుల చందనంబున దోఁచుచున్నవి. గనుక స్థూల సూక్ష్మ కారణ శరీరంబులును అంతఃకరణంబు నందలి ఆత్మప్రతిబింబమును వీనికి అధిష్ఠానభూతం బయిన చైతన్యంబునుగూడి మోహము చేత పిత్రాది శబ్దంబులకు అర్థమయి తోఁచుచున్నది. విచారించునపుడు వానివానికి వాచకంబులయిన శబ్దంబుల వలన జెప్పఁబడిపోయెను గనుక, వీని లోపల నొకటియును అర్థమని తోఁచలేదు. జన్మమరణంబు లీస్థూలశరీరంబునకేయని ప్రత్యక్షంబుగఁ గను పడుచున్నది. కనుక ద్రష్టయై నిత్యుఁడయి వ్యాపకుఁడై చైతన్య స్వరూపుఁడైన యాత్మకే చెప్పిన ధర్మంబులలో నొకటియును లేదని తోఁచుచున్నది. ఇట్టి స్వరూపముగల ఆత్మకు మోహముచేత వచ్చిన జీవత్వంబున లోకాంతర గమనాగమనంబులును పిత్రాదిశబ్ద వాచ్యత్వంబును దేనియందు నధ్యాస ద్వారా వచ్చినదియో అదియే స్థూలశరీర వ్యతిరిక్తమయిన సూక్ష్మశరీరమని యెఱుంగఁదగినది.

            మఱియును యుక్త్యంతరము చేతను స్థూలశరీరముకంటె సూక్ష్మ శరీరంబు భిన్నంబని తోఁచుచున్నది. ఆ యుక్త్యంతరం బెయ్యది యనిన విచిత్రంబులయి నానావిధంబులగు వ్యాపారంబులు దేనివలనఁ జేయఁబడుచున్నవియో అదియే సూక్ష్మశరీరంబు. ఈ వ్యాపారంబులన్నియు స్థూలశరీరమువలననే చేయఁబడుచున్నవని చెప్పుదమనిన, ప్రేతశరీరంబు వలననుం జేయఁబడవలయు. అట్లు గానము గనుక, స్థూలశరీరంబునకంటె నన్యమగు సూక్ష్మశరీరముచేతనే చేయఁబడినట్లు తోఁచుచున్నది. ఇటుల చెప్పవలసినదేమి? ఆత్మ తానే సకలకర్మంబులను జేయుచున్నాఁడని చెప్పుదమనిన, ఆ యాత్మ వ్యాపకుఁడయి యున్నాఁడు గనుక, ఆకాశాదుల యందుండెడి ఆత్మయు నటువలె చేయవలయును. చేయలేదు గనుక, ఆత్మ కర్మము చేయుచున్నాఁడని చెప్పఁగూడదు. ఆకాశాదులయందుడునట్టి యాత్మ కర్మము సేయకున్నను స్థూలశరీరముతోఁ గూడుకొని యుండెడి ఆత్మ కర్మము చేయుచున్నాఁడని చెప్పుదమనిన, ప్రేతశరీరముతోఁ గూడు కొనిన యాత్మయును కర్మము చేయవలెను. అటుల చేయలేదు గనుక, స్థూలశరీరముతో గూడుకొనిన ఆత్మ కర్మలను జేయుచున్నాఁడని చెప్పఁగూడదు. అయితే ఆత్మతోఁ గూడుకొనియుండెడి స్థూలశరీరముగదా కర్మంబుల జేయుచున్నదని చెప్పవలయును. అటుల చెప్పునప్పుడు వ్యాపకుఁడయిన ఆత్మతోఁ గూడుకొని యుండెడి ప్రేతశరీరము వలననుం గర్మం బొనర్పఁబడవలయును. అటు లొనర్పఁబడుటలేదు. కనుక ఆత్మతోఁ గూడుకొని యుండెడి స్థూలశరీరంబు కర్మమొనర్చుచున్నదని చెప్పఁగూడదు. ఇటుల విచారింపఁగా స్థూలశరీరంబు కర్మసేయుట లేదు. సద్రూపుడైన కేవలమైన ఆత్మయును స్థూలశరీరముతోఁ గూడుకొనియుండెడి ఆత్మయును ఆత్మతోఁ గూడుకొని యుండెడి స్థూలశరీరంబును కర్మము సేయుట గానము. ఇట్లున్నప్పటికిని చిత్రంబులయి నానా విధములయిన కర్మంబులు చేయఁబడుట కనుపడుచున్నయది. ఇవియన్నియు దేనివలనఁ జేయఁబడుచున్నవియో అదియే సూక్ష్మశరీరము. సద్రూపుడైన ఆత్మ వ్యాపకుఁడై నిరవయవుఁడై నిర్వికారుఁడై అద్వితీయుఁడై యున్నాఁడు గనుక, దేని తోడను గూడియుండలేదు. ఆ యాత్మకంటె నన్యమైన వస్తువు లేదు. కాఁబట్టి మరియొకటియు నాత్మతోఁ గూడుకొని యుండలేదు. సకల కర్మలను కారక సాపేక్షంబులై యుండినను ఆత్మ యొక కర్మయేనియుం జేయకుండినను ఆత్మయం దనాదియై అవిద్యయను నజ్ఞానంబు కల్పితంబయి యుండుటచేత, దానివలన గల్పింపబడిన అపంచీకృత పంచమహాభూతముల ద్వారా కల్పితంబయి ఆత్మసత్త వలన సత్తువలెఁ దోఁచెడి సూక్ష్మశరీరంబు స్థూల శరీరంబును గూడుకొని సమస్త కర్మంబులను జేయుచున్నది. అటుల చెప్పుట చేత సూక్ష్మశరీరము స్థూలశరీరమువలె ప్రత్యక్షముగ గనఁబడక స్థూల శరీరముతోఁ గూడుకొని కర్మమును చేసినప్పటికిని ఆ కర్మము సూక్ష్మ శరీరము చేతనే చేయబడుఁచున్నదని అర్థమగుచున్నది.

            సూక్ష్మశరీరము స్థూలశరీరముతోఁ గూడుకొని కర్మలు చేసినప్ప టికిని, సూక్ష్మశరీరముచేతనే చేయఁబడుచున్నవని యెటు లెఱుంగ వచ్చు ననిన, సూక్ష్మశరీరము సూక్ష్మమే. కాఁబట్టి స్థూలమువలె దోఁచలేదు. లోకంబునం దేవస్తువు కర్మంబునకుఁ గర్తగా నున్నదో ఆ వస్తువు మఱియొక దాని నాశ్రయించుకొని కర్మము చేయుచున్నది గాన, ఆ కర్మమును చేసినను నేవస్తువు నాశ్రయించుకొని చేయుచున్నదో, ఆశ్రయమయిన దానిచేతనే చేయఁబడినట్లు అజ్ఞానులకు తోఁచుచున్నది గనుక, అటులే సూక్ష్మశరీరము స్థూలశరీరము నాశ్రయించుకొని సకల కర్మములను చేసినప్పటికిని ఆ కర్మలన్నియు నాశ్రితమైన సూక్ష్మశరీరము యొక్క కర్మలేయని యీ కర్మ ద్వారా స్థూలశరీరమువలెనే సూక్ష్మశరీరమును యీ స్థూలశరీరముకంటే భిన్నముగ విచారించునట్టి పురుషునికి దోఁచును. నా చక్షుస్సు, నా శ్రోత్రము నా వాక్కు, నా ప్రాణము, నా యంతఃకరణము, నా బుద్ధి, ఆనెడి యనుభవము చేతను స్థూలశరరీముకంటె భిన్నముగ సూక్ష్మశరీరమొకటి తోఁచుచున్నది. ఇటుల కార్యములయిన స్థూలశరీరంబువలన వీనికి కారణంబయిన ఆత్మకు జీవత్వేశ్వరత్వ జగత్కారణత్వంబులయందు ఉపాధియైన అవయవములచేత ననిర్వచనీయమై ప్రకృతియనియు, మాయ యనియు, నవిద్యయనియుఁ జెప్పఁబడిన కారణశరీర మొకటికలదని శ్రుత్యాదులచేతఁ జెప్పఁబడుచున్నది. ఇంతేకాదు, నేను అజ్ఞుఁడను, జడుఁడను, ఏమియు నెఱుఁగనివాఁడననెడి అనుభవము వలన ఉన్నాఁడు గనుక, సద్రూపుఁడనియును కారణశరీర మొకటి కలదనియును తోఁచుచున్నది.

            ఈ ప్రకారముగా సమస్త ప్రాణులకును మూఁడు శరీరముల యొక్క కూడిక కలిగి యున్నప్పటికిని ఆకాశమువలె నా శరీరములతోడను గూడని వాఁడయి కాలత్రయమందు నున్నాఁడు గాన, సద్రూపుఁడై సమష్టి వ్యష్టి రూపమై శరీరత్రయాత్మకమయిన ప్రపంచనిష్ఠ పదార్థములలో నేపదార్థము చేతనుం దెలియబడక తానా పదార్థముల నెఱుఁగుచున్నాఁడు గనుక, చిద్రూపుఁడయి పరమ ప్రేమాస్పదుఁడగుట వలన నానంద రూపుఁడై తోఁచుచున్నాడు. ఇటువంటి ఆత్మ నేనని ముముక్షువు లెఱుఁగఁదగినది. కార్యమైన శరీరత్రయంబును కారణమైన పృథివ్యాదులును ప్రత్యక్షముగఁ దోఁచుచుండఁగా శ్రుత్యాదులచేత జెప్పఁబడిన అద్వితీయత్వ పరిపూర్ణత్వము లాత్మకెటుల గూడుననిన, సమష్టి వ్యష్ట్యాత్మకమైన శరీరత్రయ మనెడి ప్రపంచ మా యాత్మయందారోపితమై యున్నది. కనుక రజ్జ్వాదులయం దారోపిపఁబడిన సర్పాదులకు రజ్జుమాత్ర స్వరూపమెటు వలెనో అటుల ఆత్మయం దారోపిత మైన ప్రపంచమునకు ఆత్మ వినాగా వస్త్వంతరంబు లేదు గాన, ఆత్మకు నద్వితీయత్వాపాదకమైన వస్త్వంతరము లేదు. కాఁబట్టి ఆత్మ యద్వితీయుడనుటకు సందేహము లేదు. ఎప్పుడు ఆత్మకు అద్వితీయత్వము సిద్ధించెనో అప్పుడే పరిపూర్ణత్వంబును సిద్ధించెను. అదెటులనిన, ఆత్మకు భ్రాంతిచేత, పరిచ్ఛిన్నముల వలెనే తోఁచెడి దేశ కాల వస్తువు లాత్మ వ్యతిరిక్తముగా లేకపోయెను. కనుక త్రివిధ పరిచ్ఛేద శూన్య స్వరూపమైన పరిపూర్ణత్వము సిద్ధించెను. ఇటువంటి ఆత్మ నేనని ముముక్షువు లెఱుఁగవచ్చును. ఈ ప్రకారముగ నెవ్వడెఱుఁగుచున్నాఁడో వానికి కాల త్రయమందును ప్రపంచము లేదు. అయినప్పటికిని ప్రారబ్ధమెంత పర్యంత మున్నదో, అంత పర్యంతంబును ఈ దేహేంద్రియాది ప్రపంచము మిథ్యా భూతమై తోఁచవచ్చును. అటువలె దోఁచినందున, జీవన్ముక్తికి మిథ్యా భూతమై ఆభాస రూపమైన సుఖదుఃఖ ప్రతీతిచేత బాధ లేదు. మిథ్య యనఁగా నెయ్యది యనిన, రజ్జు సర్పాదులవలె స్వాధిష్ఠానాజ్ఞానముచేత బాథింపఁబడునది యనియు, స్వప్నమనోరాజ్యముల వలె చూచుచుండఁగానే నశించి పోవునది యనియు, మరుమరీచికాజలములవలె ననిర్వచనీయ మనియు, దగ్ధపటాదులవలె సత్తారహితమై తోఁచునది యనియు, శాస్త్రమందు జెప్పఁబడిన మిథ్యాత్వలక్షణ మీసమష్టి వ్యష్టాత్మకమైన దేహేంద్రియాది ప్రపంచ మందున్నది గనుక, పరమార్థ స్వరూపుఁడైన ఆత్మయే పరతత్త్వము. ఆత్మకంటె భిన్నమువలె భ్రాంతిచేతఁ దోఁచెడి జగత్తు మిథ్యయని నిశ్చయించుటకు సందేహము లేదు. ఎవ్వఁడేనియు శాస్త్రోక్త సాధన సంపత్తి కలిగి పరమార్థాద్వితీయ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుఁడైన ఆత్మ నేను, నన్ను వినాగా జగత్తు లేదని తోఁచెనేనియు నీమిథ్యా భూతమైన జగత్తు చేతను నాకు శరీరము లేదని సంశయభావనా విపరీతభావనలు లేక యెవడెఱుఁగుచున్నాఁడో వాఁడే జీవన్ముక్తుఁడు, విద్వాంసుఁడు, సకల శాస్త్రవేది, సమస్తమైన వారలకును బూజ్యుఁడునని శాస్త్ర సిద్ధాంతము. ఈ యర్థమందు సంశయము లేదు.

ఇది పంచదశ వర్ణకము.