24. తాపత్రయ నిరూపణము

షోడశ వర్ణకము
24. తాపత్రయ నిరూపణము

            తాపత్రయము యొక్క స్వరూపము నిరూపింపుచున్నారము.  తాపత్రయ మనఁగా ఆధ్యాత్మిక తాపమనియు, ఆధిభౌతిక తాపమనియు, ఆధిదైవిక తాపమనియు మూడు విధములు. అందు శరీరము నధిష్టించి వచ్చునట్టి క్షయరోగము శీతజ్వరము సన్నిపాతము తలనొప్పి కడుపునొప్పి మొదలైన రోగములచేత వచ్చెడి దుఃఖమునకు ఆధ్యాత్మిక తాపమని పేరు. ఇట ఆత్మయన శరీరమని తెలియవలెను. పశువులు, ఏనుగులు, గుఱ్ఱములు, పెద్దపులులు, సర్పములు, వృశ్చికములు, మశకములు, మక్షికములు, మత్కుణములు మొదలైన జంతువుల వలన వచ్చెడి దుఃఖమునకు ఆధి భౌతిక తాపమని పేరు. మంచు, ఎండ, జలము, వర్షము, పిడుగు, వాయువు, గుడి, గోపురములు, ప్రాకార మంటపములు మొదలైన అచేతన ముల వలన దైవ వశమున వచ్చెడి దుఃఖమునకు ఆధిదైవిక తాపమని పేరు. ఈ తాపత్రయముల యొక్క స్వరూపమిట్టిదని తెలిసి, ఈ తాపత్రయము శరీరంబునకును, దేహేంద్రియాదులకును గాని, వీనికి సాక్షియైన నాకు (ఆత్మకు) లేదని యెవడెఁఱుంగుచున్నాఁడో వాఁడే ముక్తుండఁని వేదాంత సిద్ధాంతము.

ఇది షోడశ వర్ణకము.