25. ప్రతిబంధత్రయ నిరూపణము

సప్తదశ వర్ణకము
25. ప్రతిబంధత్రయ నిరూపణము

            జ్ఞానమునకు ప్రతిబంధకమైన ప్రతిబంధత్రయంబును, వానికి నివృత్తియును నిరూపించుచున్నారము. ప్రతిబంధము భూతప్రతి బంధమనియు, వర్తమాన ప్రతిబంధమనియు, భావిప్రతిబంధమనియు మూడు విధంబులు. అందు భూతప్రతిబంధ లక్షణం బెట్టిదనిన బహు కుటుంబియగు బ్రాహ్మణుడొకఁడు జీవనార్థమై యొక యెనుమును సంపాదించి దానివలన గలిగిన పాలు పెరుగు నెయ్యి విక్రయపెట్టి ఆ ద్రవ్యముచేత పుత్రకళత్రాదులను రక్షించుచు, ఎనుమును కసవు ప్రత్తిగింజలు మొదలైనవాని వలన తుష్టిగా మేపుచు తదేకనిష్ఠుఁడై యుండఁగా కొంత కాలంబునకు కర్మవశంబు వలన నతని పుత్ర కళత్రాదులు నశించిరి. ఎనుమునుం జచ్చెను. అప్పుడతండేకాంగియై సంసారము సత్యమని నమ్మి బహుశ్రమలు పడితిని. ఇప్పుడది స్వప్నంబువలె నసత్యంబయ్యె. సంసారాపేక్ష కలిగిన వానికన్న మూర్ఖుండొరుడెవ్వండును గాఁడు అని వానికి సంసారమునందు తుచ్ఛత్వబుద్ధి పుట్టి విరాగియై సన్యసించి, సద్గురు సాన్నిధ్యంబు సంపాదించుకొని, శ్రవణాదులను చేసెను. అంతనొక సమయంబున గురువు లతనిఁ జేరఁబిలిచి నీవు బహుదినంబులనుండి శ్రవణాదులను చేసితివే కృతకృత్యత నీకుం దోఁచియున్నదా ? యనిన మఱేమియుఁ గాన. పూర్వాశ్రమంబునం దొక యెనుము గలిగి యుండెను. ఆ యెనుము నాఁడే మృతమై పోయెను. అయినప్పటికిని శ్రవణ మనన నిధిధ్యాసన కాలంబులయందును ఆ యెనుమే సాక్షాత్కారమయి యున్నది యని యథార్థంబుగా విజ్ఞాపనము చేసెను. అంతట గురువులిది భూత ప్రతిబంధమని నిశ్చయించి దానిం బోనడఁచుటకై ఆయెనుమునందలి స్నేహంబు ననుసరించి తత్త్వము నుపదేశించిరి.

            అది యెటువలె ననిన, గురువులు శిష్యునిఁ జూచి నీకు సాక్షాత్కార మైన యెనుము అస్తి భాతి ప్రియ నామ రూపము లనెడివానిలో తుది రెండవ యవములను త్రోచి అస్తి భాతి ప్రియములను నేనని చింతింపుమని యుపదేశించిరి. ఆ యుపదేశ ప్రకార మతఁడు చింతించుచు రాఁగా ఆ నామ రూపములు తోఁచక సచ్చిదానంద స్వరూపుఁడైన ఆత్మ నేననే నిశ్చయము తోఁచి కృతకృత్యుఁడాయెను. ఇది లోకమందు ప్రసిద్ధము. విద్యారణ్య స్వాముల వారు ప్రతిబంధత్రయంబును, దానికి నివృత్తిని పంచదశ ప్రకరణ మందు, ఈ ప్రకారముగానే నిరూపించినారు. వర్తమాన ప్రతిబంధము విషయాసక్తి లక్షణము, ప్రజ్ఞామాంద్యము, కుతర్కము, విపర్యయ దురాగ్రహము అని నాలుగు విధంబులు. అందు విషయాసక్తి లక్షణం బనఁగా విషయంబులందు గాఢమయిన ఆసక్తి కలిగియుండుట. ప్రజ్ఞామాంద్య మనఁగా, గురువులు చెప్పిన యర్థము బుద్ధియందెక్కకపోవుట. కుతర్కమనఁగా గురువు లానతిచ్చిన అర్థంబునకు విపరీతార్థంబు తోచుట. విపర్యయ దురాగ్రహ మనఁగా నేను శ్రోత్రియుఁడను, పండితుఁడను, విరక్తుఁడనని దేహేంద్రియాదుల యందాత్మత్వబుద్ధి కలుగుట. ఇవి నాలుగును వర్తమానప్రతిబంధము లనఁబడును. వీనికి నివృత్తి యెటులనిన, శమదమోపరతితితీక్షల వలన విషయాసక్తి లక్షణంబును, పునఃపునః శ్రవణము చేయుటవలన ప్రజ్ఞామాంద్యంబును, మననమువలనఁ గుతర్కంబును, నిధిద్యాసనము వలన విపర్యయ దురాగ్రహంబును పోవును. ఈ ప్రకారంబున ప్రతిబంధమునకు నాశము వచ్చుచుండఁగా ముముక్షువు లయిన వారికి తానే ఆత్మ స్వరూపమను నిశ్చయంబు బుద్ధియందు కలగును. ఆగామిప్రతిబంధంబు పాపకర్మంబువలన నెపుడు వచ్చుటయును తెలియఁబడక వచ్చునట్టిది. దానినెటువలె నెఱుంగనగు ననిన, ఉపస్థితమయిన పాపకర్మంబు ముముక్షువున కొకవిధంబునందు రూఢమయి దయా రూపమయిన యాసక్తి పుట్టించునది భావిప్రతిబంధమని తెలియవలెను. ముముక్షువైన వాఁడయ్యాసక్తిని భావిప్రతిబంధకమని తెలియఁజాలక అకర్తయు ననంగుఁడునైన నన్ను ఈ యాసక్తి యేమిసేయఁగలదని దానికి అసడ్డసేయకున్నట్లయితే అవి వానికి కొన్ని జన్మంబులనీయకపోదు. ఆ భావిప్రతిబంధంబు జన్మంబుల నిచ్చుననుటకు ప్రమాణంబేమి యనిన, వాసుదేవుల కొక జన్మంబు గలిగెననియు, భరతునకు మూఁడు జన్మంబులు గలిగెననియు, మఱికొందఱి కనేక జన్మంబులు గలిగెననియు శ్రుతి స్మృతి పురాణంబుల యందు జెప్పఁబడియున్నది. కాఁబట్టి ముముక్షువైన వాఁడీ చెప్పఁబడిన ప్రతిబంధత్రయంబును విచారించి ప్రతిబంధంబులు తన్నంట కుండునటుల తొలఁగఁజేసికొనవలయును. అట్లొనర్పకున్న, వానికి కొన్ని జన్మంబులు కలుగుట సిద్ధంబు, సందేహంబు లేదు. ఈ ప్రతిబంధ త్రయంబెవ్వని కేజన్మమందు నశించి పోవుచున్నదో వానికాజన్మమందు ముక్తి సిద్ధము.

ఇది సప్తదశ వర్ణకము.