27. తార్కిక ప్రకరణము

ఏకోన వింశతి వర్ణకము
27. తార్కిక ప్రకరణము

            వేదాంత శాస్త్ర వ్యతిరిక్తమయిన కావ్య నాటక శబ్ద శాస్త్ర తర్క శాస్త్రాదులను చదివిన వారలును కేవల కర్మఠులైన వారలును ముముక్షువును నానోపాయంబులను బన్ని బెదరు పుట్టించి చెరుతు రనుట దృష్టాంత పూర్వకంబుగ నిరూపించుచున్నారము. అది యెటులనిన, ఈ లోకంబు నందు మండలేశ్వరుం డనురాజు గలఁడతడు తన పురోహితునిఁ బిలిచి యజ్ఞము సేయుమని యాజ్ఞాపించి సకల పదార్థంబుల నిచ్చెను. తరువాత పశువు దొరకక పశుపరీక్షకుఁడయిన బ్రాహ్మణునిఁ బిలిచి కొంత ద్రవ్యమిచ్చి పశువును విలిచి తెమ్మని పంపించెను. అటు తర్వాత ఆ బ్రాహ్మణుఁడు గ్రామాంతరంబునకుఁ బోయి పశువును తీసికొని వచ్చుచుండఁగా సుంకము తీయువారు సుంకమిమ్మని యడ్డగించిన, ఈ పశువు నగరికి పోవునది యని చెప్పఁగా వాండ్లు నగరికి వెఱచి సుంకంబు తీయక విడిచిరి. అంతట నక్కడనుండి బయలుదేరి పశువును తీసుకొని వచ్చుచుండెను. అప్పుడు ఆ సుంకరులలో నొకఁడు మఱియొకని చూచి వానిని భ్రమింపఁజేసి యుపాయముచే ఆ పశువును గ్రహింతమని చెప్పఁగా వాఁడు విని యీ యుపాయ మెటువంటిదనిన నందుకు రెండవవాఁడు చెప్పుచున్నాఁడు.

            మనము నలుగురమూ పోయి యీ పశువును గొనిపోవుచుండెడి మార్గమునకు నాలుగు ప్రక్కలయందుఁ జేరి వానికి చిత్తవైకల్యంబు కలుగు నట్టి మాటలాడి పశువు నపహరింప వచ్చునని చెప్పెను. అంతట నాయిరువు రును మఱియు నిద్దఱు మనుష్యులను సహాయముగాఁ బిలుచుకొనిపోయి యీ బ్రాహ్మణుఁడు పోవునట్టి త్రోవకు నాలుగు దిక్కులయందును గనిపెట్టి యుండిరి. బ్రాహ్మణుండును ఆ పశువును గట్టిన రజ్జువును చేతఁ బట్టుకొని పోవుచుండెను. అప్పుడు మొదట నున్నవాఁడు అయ్యా ! బ్రాహ్మణునికి కుక్కను పెంచుట యుచితమా? లేక పెంచినప్పటికిని వెఱ్ఱి కుక్కనా పెంచవలె, మంచి కుక్క దొరకక పోయెనా? నీ యొక్క అదృష్టము మంచిది. కాకపోయిన నిదివరకే నిన్ను చంపదా? ఇది మనుష్యులను చంపును గనుక దూరముగాఁ బట్టుము. మా యొద్దకు తేవలదు అని చెప్పి దానికి భయపడిన వాని వలెనే పరుగెత్తిపోవ సాగెను. బ్రాహ్మణుఁడు వాని మాటలును వాఁడు పరుగెత్తుటయును జూచి వీఁడు వెఱ్ఱివాఁడుగా నున్నాఁడు. కాకుండిన ఈ పశువును చూచి యిటువలె చెప్పి పరుగెత్తునా యని వాని మాటలు సడ్డసేయక పోవుచుండెను. మఱికొంతదూరము పోఁగానే రెండవ వాఁడును ఆ బ్రాహ్మణుం జూచి అదే ప్రకారము చెప్పెను. అప్పుడు బ్రాహ్మ ణుఁడు వాఁడు చెప్పినట్టె వీఁడును జెప్పుచున్నాఁడు. వెఱ్ఱి కుక్కను జూచి పశువని భ్రమసి తెచ్చితినేమో యని సంశయించి యది తన్ను చంపునేమో యని చేతి రజ్జువును పొడుగుగాఁబట్టుకొని భయపడి తిరిగి తిరిగి చూచుచు పోవుచుండెను. మఱికొంతదూరము పోయిన తర్వాత మూఁడవవాఁడు ఆ బ్రాహ్మణునిఁ జూచి యోయయ్యా ! వెఱ్ఱి కుక్కను మా యొద్దకు తేవలదు దూరముగాఁ బొమ్మని కూఁతలు పెట్టుచుఁ బాఱిపోయెను. అంతట నా బ్రాహ్మణుఁడు దిగులుపడి మోసపోయి వెఱ్ఱి కుక్కను గొంటిని దీని నిచ్చట విడిచి పెట్టి పోయితినా, తన్ను దిగవిడిచి పోవుట తెలుసుకొని తరుముకొని వచ్చి చంపును. ఏమి సేయుదును. దీనిని విడచుట కెయ్యది ఉపాయం బని చింతించుచు మెల్ల మెల్లగాఁ బోవుచుండఁగా నాలుగవవాఁడు అతనిం బిలిచి పూర్వ రీతిగాఁనే చెప్పఁగా నా బ్రాహ్మణుఁడు వానితో అయ్యా! యీ వెఱ్ఱికుక్కను విడుచుటకుఁదగిన యుపాయము చెప్పి నన్ను కాపాడితివేని నీకు మిక్కిలి సుకృతంబు గలుగు నని వేఁడుకొనెను. అందుకు వాఁడు నాకు నీ సమీపంబునకు వచ్చుటకు భయమగుచున్నది. ఆ వెఱ్ఱి కుక్కను వదలుటకుఁ దగిన యుపాయంబును చెప్పెదను వినుము. ఇప్పుడు నీవు రజ్జువుతోడ దానికొక చెట్టు నొద్దకు తీసుకొనిపోయి చెట్టుకు రజ్జువుచేత మూఁడు చుట్లుచుట్టి ముడివేసి పాఱిపోయితి వేని అది నిన్ను తరుముకొని రాఁజాలక అక్కడనే యుండును. నీవు సౌఖ్యంబుగా ప్రాణంబులు కాపాడు కోవచ్చునని చెప్పెను. బ్రాహ్మణుఁడందుకు సమ్మతించి, యా పశువు నొక్క, వృక్షంబునకు కట్టివేసి నీవంటి పుణ్యాత్ములెక్కడను లేరు, నాకు పోయిన ప్రాణంబును తెచ్చి యిచ్చితివి. దుర్మరణంబు దప్పెను. పోయి వచ్చెద దయయుంచుమని చెప్పి వానింబొగడుచు పశువును కొనవలెనని వచ్చి తిరిగి తల్లికడుపునఁ బుట్టినట్లాయెను. ఇంకమీఁద నిట్టి పెత్తనమునకుం బోరాదని తలఁచుచు దన నివాసంబునకుఁ బోయెను.

            ఈ ప్రకారంబున వంచకులైన యాసుంకరులు బ్రాహ్మణుఁడు ప్రత్యక్షంబుగఁ గొనిన పశువును గ్రహించుటకై యతని బుద్ధిని యెటుల చెఱచిరో అటులే తార్కికులు శాబ్దికులు పౌరాణికులు కర్మఠులు మొదలైన వారు ముముక్షువులైన వారిని గీతలు చదువుటవలనను, యోగీశ్వరుల సాంగత్యంబువలనను, ఉపనిషత్తులు చదువుట వలనను ఫలమేమి ? నీకేమో పాపకర్మ ముపస్థితమయి యున్నది. నారదాదులకుఁ గూడ జ్ఞానము లేదని పురాణాదులయందుఁ జెప్పఁబడియున్నది  ఏక జీవపక్షమువారు జ్ఞానము సర్వాత్మనా కూడదని చెప్పినారు. కలియుగమందు సన్యాసమే కూడదని శాస్త్రంబులయందుఁ జెప్పఁబడినది. వీరందఱునూ కూటికొఱకు సన్య సించినవారు. జ్ఞానమేది? అజ్ఞానమేది? మేము సకల శాస్త్రములును చదివి జ్ఞానముఁ గూడదని విచారించి కర్మములే చేయుచున్నారము. ముక్తి పొందవలెనను కోరిక గలిగియుండెనేని తర్క వ్యాకరణాది శాస్త్రంబులు చదివి కావ్యనాటకాలంకారాదులయందు ప్రవీణత్వంబు సంపాదింపుము. ఉపనిషత్తులు మొదలైన వానిని స్మరింపక జ్ఞానబోధ చేసెడివారు వంచకులని యెంచుకొనుము. వారికి జ్ఞానము గలిగి గదా నీకు బోధింపవలెను. వారికే అమానిత్వాది సాధనంబులు లేవు. క్షణమాత్రమయిన నెండకు సహింపలేరు. జ్ఞానులని పేరు పెట్టుకొని యున్నారు గాని జ్ఞానలక్షణంబులైన స్థితప్రజ్ఞత్వాదు లొకటియైన వారియందు లేదు. కోపతాపంబులధికంబులై యున్నవి. ఒక శ్లోకంబునకు అర్థమడిగితే చెప్పలేరు. వీరి వంచకత్వంబునకు లోబడి లోకంబునం దనేకులు చెడిరి. నీవును చెడియెదవని నీయందుఁగల విశ్వాసముచేత నింతదూరము చెప్పితిమి. నీకు ముక్తి కావలెనను తలంపు గలిగియుండెనేని సులభమయిన మార్గంబును జెప్పెదము. మాకు రహస్య ములైన మంత్రంబు లనేకంబులు తెలియును. వానియందొక మంత్రంబును పదేశించెదము. ఆ మంత్రమును జపించుచు వచ్చితి వేని, ఇహంబున సర్వాభీష్టములును గలుగును. పరంబున మోక్షంబు గలుగును. ఇందుకు సందేహంబు లేదు. మా మాటలు నమ్మి బ్రతుకుమని చెప్పి ఈ ప్రకారంబుగ నాక్షేపించి వంచకులగుతాము సద్గురువు వంచకులని బోధించి వేదాంత మందును ఆత్మ స్వరూపోపదేశకులగు గురువులయందును ముముక్షు వులకుఁ గల విశ్వాసమును తొలఁగింతురు. కాఁబట్టి యట్టి వంచకుల మాటలు విశ్వసింపక  వేదాంతమందును సద్గురువుల యందును విశ్వాసము గలిగి గురుశుశ్రూషాపూర్వకంబుగా శ్రవణాదులు చేసి జ్ఞానంబు సంపాదించి ముముక్షువైనవాఁడు కృతార్థుఁడు కావలెను. ఇది సిద్ధము.

ఇది ఏకోనవింశతి వర్ణకము.