28. సంశయత్రయ నిరూపణము

వింశతి వర్ణకము
28. సంశయత్రయ నిరూపణము

            సంశయాసంభావనా విపరీతభావంబువలన నెయ్యవి యనిన, దష్టాంత పూర్వకంబుగ నిరూపించుచున్నారము. వస్తుద్వయంబు నొకదాని యందారోపించుట సంశయము. అనగా ఇది స్థాణువో, పురుషుడో యని తలఁచెడి చిత్తవృత్తి. ఇక్కడ స్థాణువు ఉండవలసిన పనియేమి? స్థాణువు ఉండనేరదే యని తలఁచెడి చిత్తవృత్తి యసంభావన. ఒక వస్తువునందుఁ గల నైజమును కాదని తలఁచుట విపరీతభావన. అది ప్రమాణగత సంశయము, ప్రమేయగతసంశయము, ప్రమాణగతాసంభావన, ప్రమేయ గతాసంభావన, ప్రమాణగత విపరీతభావము, ప్రమేయగత విపరీత భావము అని ఒకటొకటి రెండేసి విధములయి యుండును. అందు ప్రమాణ సంశయం బెయ్యెది యనిన, శ్రుతి కర్మను ప్రతిబాధించుచున్నదా? లేక శిష్టమయిన ప్రత్యగ్బ్రహ్మమును ప్రతిబాధించుచున్నదా? యని వచ్చెడి సంశయము ప్రమాణగత సంశయము. ప్రమేయగత సంశయమనఁగా, జగత్కారణ వస్తువు బ్రహ్మమా? లేక ప్రధానాదులా! యని వచ్చెడి సంశయము. ప్రమాణగతాసంభావన యనఁగా బ్రహ్మము శుద్ధ వస్తువగుట వలన ప్రమాణాంతరము చేత పృథివ్యాదులవలె నెఱుఁగఁబడుచున్నది కనుక శ్రుతులు ఆ శుద్ధ బ్రహ్మము జగత్కారణమని యెటుల ప్రతిపాదించును? ప్రతిపాదింప నేరవే అనెడి నిశ్చయంబే ప్రమాణగతాసంభావన. ప్రమేయ గతాసంభావన యనఁగా జగత్తు కంటే బ్రహ్మము విలక్షణమయి యున్నది.  కనుక జగత్తుకు కారణమని చెప్పఁగూడదు. ప్రధానాదులే జగత్తుకు కారణమనే నిశ్చయము ప్రమేయగతాసంభావన. ప్రమాణగత విపరీతభావన యనఁగా బ్రహ్మము శుద్ధ వస్తువు గనుక శ్రుతులకు శుద్ధ బ్రహ్మమును ప్రతిపాదించుట యందు తాత్పర్యము లేదు. శ్రుతులు శుద్ధ బ్రహ్మంబును ప్రతిపాదించినట్టయిన పురుషునకు వృత్తినివృత్తులు కానము గనుక, ప్రయోజనము లేకపోవును. లోకమందు ప్రవృత్తి పూర్వకముగానే పురుషార్థంబును కన్నారము. అశుద్ధ్యాది వికారములతోఁ గూడుకొని యుండెడి జగత్తుకు కారణమైన బ్రహ్మంబును అశుద్ధ్యాదులతో గూడుకొని యుండవలెను. అటుల నుండలేదు. కాఁబట్టి ప్రధానాదులే జగత్తుకు కారణమని బుద్ధి యందుఁ దోఁచుట ప్రమేయగత విపరీత భావన. ఇటువలె అంతర్యమందును జీవుఁడు గాను జగత్తులో నొకఁడు గాను తోఁచుచుండెడి తాను జగద్విలక్షణమయిన బ్రహ్మమగునో కాదో యనెడిది ప్రత్యగాత్మ విషయము సంశయము. అటువలెనే కర్తృత్వాద్యనేక ధర్మయుక్తుండై పరిచ్ఛిన్నుండై జనన మరణంబులతోఁ గూడుకొని యుండెడి తనకు విపరీత లక్షణములు గల బ్రహ్మస్వరూపత్వము నెటువలేఁ గూడును? కూడనేరదే యని నిశ్చయించుట ప్రత్యగాత్మ విషయమయిన అసంభావన. ఇటుల తాను అర్త యయ్యెనేని తన్నుద్దేశించి ఈ కర్మను చేయుము, ఈ కర్మను చేయకుము, దీనిని మానుము, దీనిని మానకుము, దీనిని గ్రహింపుము, దీనిని గ్రహింపకుము, దీనిని భక్షింపుము, దీనిని భక్షింపకుము అను నీలాటి ధర్మములు శ్రుతియందు ప్రవర్తింప నేరవు. కాఁబట్టి నేను కర్తనే, సందేహము లేదు అనే కర్తృత్వాదుల కుపయోగమయిన అభిమానాదులకు సర్వధర్మ ప్రతీతి లక్షణమయినది విపరీత భావన. ఈ ప్రకారముగా న్యాయ మందు సంశయము, అసంభావన, విపరీత భావన అనెడి సంశయ త్రయమును విచారించి, ఇవి రాకుండఁ జేసికొని యెవఁడు విజ్ఞానమును సంపాదించు చున్నాఁడో, వాఁడే ముక్తుండని వేదాంత సిద్ధాంతము.

ఇది వింశతి వర్ణకము.