36. అసంభావన, విపరీత భావన

అష్టావింశతి వర్ణకము
36. అసంభావన, విపరీత భావన

            అసంభావన, విపరీత భావన లనఁగా దృష్టాంత పూర్వకంబుగా నిరూపించుచున్నారము. అది యెటువలె ననిన శ్రుతులకు తాత్పర్యంబు నిరూపించునపుడు షడ్విధలింగంబులను నిరూపించుచున్నారము. అది యెటువలె ననిన ఉపక్రమమనియును, ఉపసంహారమనియును, అపూర్వక మనియును, ఫలమనియును, అర్థవాదమనియును,ఉపపత్తి యనియును నాఱువిధంబులు. వీనిలో నుపక్రమోపసంహారములు రెండును నొక లింగము. అభ్యాసంబొక లింగము. అపూర్వమొక లింగము. ఫలమొక లింగము, అర్థవాదమొక లింగము, ఉపపత్తి యొక లింగము. ఈ యాఱింటి చేతను శ్రుతులయొక్క తాత్పర్యంబు నిర్ణయింపఁబడుచున్నది. కాఁబట్టి వీనికి లింగంబులని పేరు. ఉపక్రమంబనఁగా, సృష్టికి ముందు ఈ జగత్తు నామరూపరహితమయిన సత్తా మాత్రమే యుండెనని ప్రతిపాదించుట. ఉపసంహారమనఁగా ఈ తోఁచునట్టి సమస్త జగత్తును ఆ సత్తుయొక్క స్వరూపంబు. అదే సత్యము అదే ఆత్మయని ప్రతిపాదించుట. ఈ రెండును అద్వితీయాత్మ స్వరూపంబును ప్రతిపాదింపుచున్నవి గనుక, ఈ రెండును కూడి ప్రథమ లింగము. అభ్యాసమనఁగా నీవు బ్రహ్మమని తొమ్మిది ప్రకారంబుల నుపదేశించుట. ఆ యుపదేశముచేతను నీ యొక్క స్వరూపంబునకే అద్వితీయాత్మమును బోధింపుచున్నది గనుక, ఈ యభ్యాసంబు రెండవ లింగము. అపూర్వమనఁగా అష్ట ప్రమాణములలోపల నుపనిషత్ప్రమాణంబుల చేత ఆత్మ లక్షణంబు లెఱుంగఁబడుచున్నవి. ఇతర ప్రమాణంబులచేత నెఱుంగబడ లేదనుట. ఈ యపూర్వము ఈ యద్వితీయాత్మయందే సిద్ధించియున్నది గనుక, ఇది మూఁడవ లింగము. అద్వితీయాత్మ జ్ఞానంబునకు ప్రారబ్ధ మెంతపర్యంతంబు నశింపలేదో అంతపర్యంతంబును దేహేంద్రియాది ప్రపంచంబు మిథ్యా రూపంబుగాఁ దోఁచుట. ఆ ప్రారబ్దంబునకు నిశ్శేష నాశమెప్పుడు వచ్చుచున్నదో అప్పుడు జగత్తు సర్వాత్మనా తోఁచక అద్వితీయాత్మ స్వరూపంబుగా నుండుననెడి ప్రతిపాదనంబు ఫలము. ఇది నాలుగవ లింగము. అర్థవాదమనఁగా ఏ వస్తువు విన్నందుచేత వినఁబడని వస్తువు వినఁబడుచున్నదో, యే వస్తువు మననము చేయుటచేత మననము చేయఁబడని వస్తువు మననము చేయఁబడుచున్నదో యేవస్తువు నెఱుంగుటచేత నెఱుంగఁబడని వస్తువ వెఱుంగఁ బడుచున్నదో అది యర్థవాదము. ఈ యర్థంబునకు స్వార్థమందు తాత్ప ర్యంబు లేదు గనుక, అద్వితీయాత్మ స్వరూపమందే తాత్పర్యము. దీనికి అర్థవాదమని పేరు. ఇది పంచమలింగము. ఉపపత్తి యనఁగా మృత్తువలనం బుట్టిన ఘటశరావాదులును స్వర్ణంబు వలనఁ బుట్టిన కటక మకుటాదు లును ఆయస్సు వలనం బుట్టిన ఖడ్గాదులును కారణముకన్న పృథక్కుగాఁ దోఁచినప్పటికిని నీకార్యాదులకు ఉచ్చారణఁబు మంత్రము వినాగా అర్థము లేదు గనుక కారణవ్యతిరిక్తంబుగా కార్యంబు లేదనెడి యుక్తి ఉపపత్తియని చెప్పఁబడును. ప్రసిద్ధంబుగాఁ దోఁచునట్టి జగత్తు పరమాత్మస్వరూపమైన బ్రహ్మంబు గాన, దృష్టాంతస్వరూపమైన యీ జగత్తుకు పరమాత్మ కన్న అభిన్నత్వంబు ప్రతిపాదింపుచునుండు ప్రత్యగాత్మకు అద్వితీయత్వంబును సూచింపుచున్నది గనుక, ఇది ఆఱవలింగమని చెప్పఁబడును. ఈ ప్రకారంబుగా షడ్విధ లింగంబుల చేతను శ్రుతులకు తాత్పర్యము నెవఁడు ఈ ప్రకారంబు నిర్ణయింపుచున్నాఁడో వానికి శ్రవణ మాత్రము చేతను అద్వితీయాత్మ జ్ఞానంబు వచ్చును. సందేహంబు లేదు. ఇది సిద్ధము.

ఇది అష్టావింశతి వర్ణకము.