37. తత్త్వాది నిరూపణము

ఏకోనత్రింశద్వర్ణకము
37. తత్త్వాది నిరూపణము

            తత్త్వంబుల నిరూపించుచున్నారము. తత్త్వంబు లనఁగా జ్ఞానేంద్రియ పంచకమును, కర్మేంద్రియ పంచకమును, ప్రాణాది పంచకమును, శబ్దాది పంచకమును, మననాది చతుష్టయమును. ఇవి యన్నియుం గూడి యిరువదినాల్గు తత్త్వంబులని చెప్పఁబడును. ఈ చెప్పఁబడిన యిరువదినాల్గు తత్త్వంబులును, అపంచీకృతంబులును, శరీర త్రయమును, అవస్థాత్రయమును, అజ్ఞానమును, యివి యన్నియుంగూడి ముప్పది యాఱుతత్త్వంబులు. ఇంకను తొంబదియాఱు తత్త్వంబుల నిరూపణ మెట్లనిన ఇప్పుడు చెప్పిన ముప్పదియాఱు తత్త్వములును, షడ్భావ వికారంబులును, షట్కౌశికంబులును, షడూర్ములును, అరిషడ్వర్గంబులును, జీవత్రయంబులును, గుణత్రయంబులును, కర్మ త్రయంబులును, వచనాదాన గమనవిసర్గానందంబులును, సంకల్పాధ్య వసాయాభిమానావ ధారణంబులును, వైచిత్య్రాదిచతుష్టయంబులును, దిగ్వాతార్కాది చతుర్దశాధిష్ఠాన దేవతలును ఇవియన్నియుంగూడి తొంబది యాఱు తత్త్వంబులు. ఈ తత్త్వంబులకు విలక్షణుఁడై అసంగుఁడయిన సాక్షి నేనని యెవఁడెఱుంగుచున్నాఁడో వాఁడు ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.


ఇది ఏకోనత్రింశద్వర్ణకము.