38. జితేంద్రియుని లక్షణ నిరూపణము

త్రింశద్వర్ణకము
38. జితేంద్రియుని లక్షణ నిరూపణము

                        శ్లో||  అజిహ్వష్షండకః పంగు రంధో బధిర ఏవ చ
                                   ముగ్ధశ్చ ముచ్యతే భిక్షుః షడ్భి రేతై ర్నసంశయః

            అజిహ్వుండనఁగా నాలుక లేనివాఁడు. అజిహ్వుఁడు కాఁడు. మఱి యెవఁడనఁగా ఇది నాకు ప్రియము, ఇది నాకు ప్రియము కాదు అని చెప్పక కర్తృత్వాద్యభిమాన రహితుఁడై పెట్టినది భక్షించి, అసత్యంబులు పలుకక మితభాషియై యెవఁడున్నాఁడో వాఁడు అజిహ్వుఁడని చెప్పఁబడుచున్నాఁడు. షండుడనఁగా శిశ్నంబు లేనివాఁడు కాఁడు. సద్యోజాతమైన శిశువును, పదియాఱేండ్ల యువతిని, నూఱేండ్ల ముదిదానిని చూచి ముగ్గురి యందును సమ చిత్తుండై నిర్వికారుండై యెవఁడున్నాఁడో వాఁడు షండుడని చెప్పబడును. పంగు వనఁగా కుంటివాడుగాఁడు. మఱి యెవఁడనఁగా భిక్షార్థమయిపోవుట. మూత్రపురీషాదులు విడుచుటకై బాహ్యమందు పోవుట. గ్రామాంతరంబునకు పోవలెనని యిచ్ఛపుట్టి యోజన దూరంబుకన్న అధికంబు పోకయుండుట, ఇటువలె నెవఁడున్నాఁడో వాఁడు పంగువని చెప్పఁబడును. అంధకుఁడనఁగా గుడ్డివాఁడు గాఁడు. మఱి యెవఁడనఁగా కన్నులున్నప్పటికిని సంచరించినప్పటికిని, నే సన్యాసి యొక్క దృష్టి నాలుగు తాడి మ్రాఁకులు పొడవుగల భూమిని విడిచి దృష్టి యావలికి పోలేదో ఆ సన్యాసి యంధుడని చెప్పబఁడును. బధిరుఁడనగా చెవులు వినరానివాఁడు కాఁడు. మఱియెవఁడనఁగా హితమైన వాక్యంబును, అహితమయిన వాక్యంబును, మిక్కిలి రమ్యమయిన వాక్యంబును, మిక్కిలి దుఃఖకరమైన వాక్యంబును, శ్రోత్రంబువలన విన్నప్పటికిని యెవఁడు హితా హితంబులను గ్రహింపకున్నాఁడో వాఁడు బధిరుఁడని చెప్పఁబడును. ముగ్ధుఁడనఁగా మూఢుండును సౌందర్యహీనుఁడు కాఁడు. సమస్త విషయంబులును సన్నిధానమందు వచ్చియున్నప్పటికిని యింద్రియ పటుత్వంబు గల వాఁడయి విషయంబుల ననుభవింపగల సమర్థుఁడయి యున్నప్పటికిని నిద్రపోవు వాని వలెనే యెవఁడున్నాఁడో వాడు ముగ్ధుఁడని చెప్పఁబడును. ఈ యార్గురును శ్రవణము ద్వారా జ్ఞానమును సంపాదించి ముక్తులౌదురని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.


ఇది త్రింశద్వర్ణకము.