39. సప్తవిధ చైతన్య నిరూపణము

ఏకత్రింశద్వర్ణకము
39. సప్తవిధ చైతన్య నిరూపణము

శ్లో||    శుద్ధమీశ్వర చైతన్యం జీవచైతన్యమేవ చ
           ప్రమాతా చ ప్రమాణంచ ప్రమేయాశ్చ ఫలం తథా
           ఇతి సప్తవిధం ప్రోక్తం భిద్యతే వ్యవహారతః
           మాయోపాధివినిర్ముక్తో శుద్ధ ఇత్యభిధీయతే
           మాయాసంవర్తతశ్చేశో జీవో విద్యావశస్తథా
           అంతఃకరణసంబంధః ప్రమాతేత్యభిధీయతే
           తథా తద్వృత్తి సంబంధం ప్రమాణ మితికీర్తితమ్‌
           అజ్ఞాన మపి చైతన్యం ప్రమేయ మితికథ్యతే
           త థాజ్ఞాతశ్చ చైతన్యం ఫల మిత్యభిధీయతే

            ఇందుకు అర్థము : శుద్ధ చైతన్యమనియు, నీశ్వరచైతన్యమనియు, జీవచైతన్య మనియు, ప్రమాతృచైతన్య మనియు, ప్రమాణ చైతన్యమనియు, ప్రమేయ చైతన్య మనియు, ఫలచైతన్యమనియు వ్యవహారమందొక్క చైతన్యమే యిటువలె నేడు విధంబులుగా జెప్పఁబడును. ఆ యేడు విధంబులకును భేద మేమి యనఁగా, మాయోపాధిరహితమగునది శుద్ధ చైతన్యము. మాయా సహితమైనది ఈశ్వర చైతన్యము. అంతఃకరణ ప్రతిబింబితము జీవ చైతన్యము. ప్రమాతయన సర్వము నెఱుఁగు సాక్షి మాత్రుఁడు. అట్టి సాక్షి చైతన్యము ప్రమాతృచైతన్యము. ప్రత్యక్షాదిజ్ఞాన కారణమగునది ప్రమాణ చైతన్యము. యథార్థముగాఁ దెలియఁదగినది ప్రమేయ చైతన్యము. యథార్ధ జ్ఞానము ప్రమాఫల చైతన్యము. ఒక పరిపూర్ణ చైతన్యమే యిట్లు ఉపాధి సంబంధమువలన సప్త విధములుగా జెప్పఁబడుచున్నది. ఉపాధి నిరసనము వలన నీభేదము నశించి పరిపూర్ణ చైతన్య మొకటియే శేషించును. అట్టి పరిపూర్ణ చైతన్యరూప పరమాత్మయే నేను అని యెఱిఁగినవాడే ముక్తుఁడు.


ఇది ఏకత్రింశద్వర్ణకము.