43. పంచప్రళయముల యొక్క మననము

పంచత్రింశద్వర్ణకము
43. పంచప్రళయముల యొక్క మననము

            ప్రళయస్వరూప మెయ్యది యనిన, నిత్యప్రళయ మనియు, అవాంతర ప్రళయమనియు, దైనందిన ప్రళయమనియు, బ్రహ్మప్రళయ మనియు, ఆత్యంతిక ప్రళయమనియు అయిదు విధంబులు. వీనిలోపల నిత్యప్రళయమనఁగా సమస్త ప్రాణులయొక్క సుషుప్తి నిత్యప్రళయము. అవాంతరప్రళయమనఁగా కృతత్రేతాద్వాపర యుగములును ఆయా మనువుల యాధిపత్యము అమరుపర్యంతంబును అవాంతరప్రళయమని చెప్పఁబడును. కాఁబట్టి బ్రహ్మదేవుని యొక్క పగటియందు పదునాలగ వాంతరప్రళయములు. వీనికి నైమిత్తికప్రళయమనియును, మన్వంతర ప్రళయ మనియును రెండు పేళ్ళు. యుగప్రళయము వీనిలో నంతర్భూతము. దైనందినప్రళయమనఁగా బ్రహ్మదేవుని యొక్క సుషుప్తి దైనందిన ప్రళయము. బ్రహ్మ ప్రళయ మనగా బ్రహ్మదేవుని యొక్క నాశావస్థ. ఆ యవస్థయందు ఆకాశాది పంచభూతములును సర్వాత్మనా లేవు. అజ్ఞానంబు మాత్రమే మహా ప్రళయమై యుండును. దానికి ప్రకృతిప్రళయ మనియును, మహాసుషుప్తి యనియును, ఆత్యంతికప్రళయమనియును మూఁడు పేళ్ళు. ఆత్యంతికప్రళయమనఁగా ముక్తి. ఆ యవస్థయందు సర్వాత్మనా జ్ఞానంబు లేదు. ఈ ప్రకారంబుగా పంచప్రళయంబులును అన్యోన్య వ్యావృత్తంబులై యున్నవి గనుక, అసత్తైపోయెను. ఈ ప్రళయంబుల కాధారుఁడై యీ ప్రళయంబులయందనుస్యూతుఁడై అసంగుండయి అసంసారియైన ఆత్మ నేనని యెవడెఱుఁగుచున్నాఁడో వాఁడు ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.

ఇది పంచత్రింశద్వర్ణకము.