6. చేతనా చేతనవిచారము

తృతీయ వర్ణకము
6.   చేతనాచేతన విచారము

            శ్లో||  చేతనాచేతనే యే వై శ్రుతౌ సమ్యక్సమర్థితే
                       తే ద్వేమయా ఽభిరచ్యేతే భావయ శృణుతా మిహ

            ప్రపంచము ఆత్మ యనియును, అనాత్మ యనియును రెండు విధంబులు. ఆత్మయనఁగా ప్రపంచాతీతుఁడుగదా ! ప్రపంచాతీతుఁడైన యాత్మను ప్రపంచాంతఃపాతిగా చెప్పవచ్చునా ? అనఁగా చెప్పవచ్చును. ప్రపంచము చేతనాచేతనాత్మకమై కదా తోఁచుచున్నది. కాఁబట్టి ప్రపంచా తీతుఁడైన ఆత్మ ప్రపంచముతో కూడకపోయినచో ప్రపంచము చేతనాచేత నాత్మకముగా తోఁపదు. తోఁచుచున్నది కాఁబట్టి, ప్రపంచాతీతుఁడైన యాత్మను ప్రపంచాంతఃపాతిగానే చెప్పవచ్చును. అయితే ప్రపంచములో చేతనం బెయ్యది ? యచేతన మెయ్యది ? యనిన, పాదములతో నడుచునదియు ఱెక్కలతో నెగయునదియు, నేలఁ బారుకాడునదియునుం జేతనములు. పృథ్వీ జల పర్వత వృక్షాదులు అచేతనంబులు. అయితే ప్రపంచం బనేక పదార్థంబులుగాఁ దోఁచుచుండఁగా రెండు పదార్థంబు లని యెటులఁ జెప్పవచ్చు ననిన చెప్పవచ్చును. అది యేలాగన, ప్రపంచము ఆత్మయనియు, ననాత్మయనియు రెండు విధములు. అనాత్మ యొక్కటియే కార్య రూపంబుగాఁ బరిణమించి అనేక పదార్థంబు లాయెను. వానితోఁ గూడుకొని ఆత్మయు ననేకమువలెనే తోఁచుచున్నాఁడు. ఆ యనాత్మతోఁగూడు కొని తోఁచెడియాత్మ జీవుఁడనియును, ఈశ్వరుఁడనియును రెండు విధంబులుగాఁ దోఁచుచున్నాఁడు. జీవేశ్వరులలో జీవుఁడనేక విధంబులు గాను ఈశ్వరుం డనేక విధంబులుగానుం దోఁచుచున్నారు. జీవుండనేక విధంబులుగాఁ దోఁచినం దోఁచనిమ్ము. ఒక్కం డైన ఈశ్వరుం డనేక విధంబులుగా నెటుల దోఁచునన, తోఁచును. పుణ్య క్షేత్రంబులయందును, పట్టణంబులయందును గ్రామాదులయందును ప్రతి గృహంబునందును ఈశ్వరుం డనేకవిధంబులుగాఁ దోఁచుచున్నాఁడు. అక్కడక్కడఁ దోఁచినవన్నియు మృచ్ఛిలాదారుతామ్రాదిప్రతిమలు గదా ! ఇట్లుండగా నీశ్వరుఁడు తోఁచుచున్నాడఁని యెందులకు చెప్పవలయుననిన మృచ్ఛిలాదారుతా  మ్రాది ప్రతిమలయం దందఱికిని నీశ్వరబుద్ధియేగాని, ప్రతిమాదిబుద్ధి సర్వాత్మనా లేదు. వానియందు ప్రతిమాది బుద్ధిగలిగి యీశ్వరబుద్ధి లేకపోయిన గోపుర ప్రాకారమంటపాదులకును, పూజాభిషేకముల కొఱకును లక్షాది ద్రవ్యవ్యయము నేల చేయుదురు ? అటుల సెలవు చేయరుగదా? చేయుచున్నారు. కనుక నాప్రతిమాదులయందీశ్వరబుద్ధి రావచ్చునా ? అనాత్మ స్వరూపమైన ప్రతిమాదులందీశ్వర బుద్ధి రావచ్చునా ? యన, రావచ్చును. మిక్కిలి నీచమైన దేహేంద్రియాది సంఘాతమే నే ననువానికి ఆ ప్రతి మాదులయం దీశ్వరత్వబుద్ధి రావచ్చును. దేహేంద్రియాదులు నీచపదార్ధంబు లగునా? యనిన అగును. అది యెటులనఁగా శుక్ల శోణితంబు వలనఁబుట్టినవి గనుకను, మాంసమూత్ర పురీషాదులచేత నిర్మింపబడినవి గనుకను శరీరము మృతమయిపోయినప్పటికిని, ఉండువారికి అర్థచండాలాది క్లేశంబులం జేయుచున్నవి గనుకను, ఈదోషంబు లాప్రతిమాదులయందు లేవు గనుక ఆ ప్రతిమాదులయందు సమర్పించిన స్రక్చందనాదులు పరులకు కృతార్థతఁ జేయుచున్నవి గనుకను, ఆ ప్రతిమాదులకు హాని వచ్చినప్పటికిని తిరుగా నుపకారమునకు వచ్చుచున్నవి గనుకను, ఆ ప్రతిమాదులయం దీశ్వరత్వబుద్ధి రావచ్చు ననుట యుచితమే. అయితే ఒక్క యనాత్మ పదార్థమే కార్యరూపంబుగాఁ బరిణమించి అనేకములుగాఁ దోఁచును. దానితో మఱియొక పదార్థము గూడుకొని యనేకంబుగాఁ దోఁపవచ్చు ననుట యందు దృష్టాంతంబునుం గలదు. అది యెటులన, పృథివి యొకటియే కారణరూపంబుగాఁ బరిణమించి పర్వత వృక్ష ప్రాకార గోపుర మంటప గృహ కుడ్య కుసూల ఘట శరావాదిరూపములుగాఁ దోఁచుచున్నది. వానితోఁ గూడుకొనిన యాకాశంబు ఘటాకాశంబనియు, మఠాకాశం బనియు, వృక్షవనాకాశ మనియు, గోపుర మంటప కుడ్య కుసూలాకాశమనియు నెటులఁ దోఁచుచున్నదో అట్లు కార్యరూపంబుగాఁ బరిణమించిన అనాత్మ పదార్ధంబులం గూడుకొని ఆత్మయు దేవదత్తుఁ డనియు, యజ్ఞ దత్తుఁడనియు, రాముఁడనియు, కృష్ణుఁడనియు ననేకంబులుగాఁ దోచుచున్నాఁడు. ఈ పృథివ్యాకాశ దృష్టాంతంబునకు ప్రతిబింబదృష్టాంతముం జెప్పెదము. అది యెటులనఁగా, ఒక జలమే ఉపాథుల వలన సముద్రంబు లనియు, తటాకంబు లనియు, సరస్సులనియుం జెప్పఁబడుచున్నది. ఈ జలంబుల యందు ఆదిత్యుఁ డొక్కఁడే ప్రతిబింబించి యనేక విధంబులుగా తోఁచుచున్నట్లు ఆత్మయు ననాత్మకార్యంబగు నంతఃకరణంబులయందు ప్రతిబింబించి యనేకంబులుగాఁ దోఁచుచున్నాఁడు. అటులఁదోఁచినప్పటికిని అనాత్మ కార్యశరీరమైన యంతఃకరణము యొక్క ధర్మంబు లాత్మను కాలత్రయంబు నందును స్పృశింపలేవు. అది యెటులనఁగా, జలగతంబులైన శైత్యచలనాది వికారంబులు జలంబునందు ప్రతిబింబించిన, ప్రతిబింబంబు నెట్లు స్పృశింపలేవో అటులనే నంతఃకరణముయొక్క ధర్మంబులు వికారంబులును నంతఃకరణమునందు ప్రతిబింబించిన జీవుని స్పృశింప నోపవు. ఆ యంతఃకరణాదులకు నధిష్ఠాన రూపకమైన ప్రత్యగాత్మను స్పృశింపలేవు అనునది చెప్పవలెనా ! అంత మాత్రమే కాదు. ఎటులయిన నేమి ? పృథివి వికారంబులును, పృథివి కార్యంబులయొక్క వికారంబులును పృథివికి నాధారభూతంబైన యాకాశంబును ఎటుల స్పృశింపలేవో, అటుల ననాత్మ యైన అజ్ఞానంబును, అజ్ఞానకార్యంబు లయిన దేహేంద్రియాది ధర్మంబులును, జ్ఞానంబునకును, అజ్ఞాన కార్యంబులకును ఆధారభూతం బయిన ప్రత్యగాత్మను స్పృశింపలేవు. ఈ ప్రకారం బాత్మానాత్మ విచారణం బొనర్చి యయ్యాత్మ స్వరూపంబు నే నని యెవం డెఱుంగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.

            శ్లో||  ఆత్మానాత్మ వివేకేన పునస్సంసారనిర్వృతిః
                       తద్వినా జన్మ కోట్యాపి బంధచ్ఛేదో న సిద్ధ్యతి

ఇది తృతీయ వర్ణకము