7. దుఃఖము స్వాభావికము గాదనుట

చతుర్థ వర్ణకము
7.   దుఃఖము స్వాభావికము గాదనుట

      శ్లో||  జనే యద్దుఃఖ మస్త్యేత త్కింస్వరూప ముతాస్య తత్‌
               సమ్య గాగంతుకం వేతి భాషయా చింత్య తే మయా

            ప్రాణులకు దుఃఖము స్వాభావికమా ? లేక ఆగంతుకమా ? యనిన, నాగంతుకంబే యని చెప్పవలెను. స్వాభావికంబని చెప్పినచో దుఃఖనివృత్తి కొఱకై యెవరును యత్నము చేయక యుండవలయు. అట్లుండక యత్నము చేయుచున్నారు. కనుక దుఃఖము స్వాభావికమని చెప్పఁగూడదు. ఆగంతుకమే యని చెప్పవలెను. స్వాభావికమే కానీ, దుఃఖనివృత్తి కొఱకు యత్నమే చేయనీ అనిన, స్వాభావిక మనఁగా, స్వరూపమాయెను గనుక స్వరూపంబునకే నాశంబు వచ్చును. వచ్చినచో రానిమ్ము అనిన, దుఃఖము వలన నివర్తింపఁబడిన వాఁడెవఁడును లేకపోవలెను. కాబఁట్టి దుఃఖము స్వాభావికమై పోదా ? యనినఁబోదు. అది యెటులనిన, వేపాకుకు చేదు స్వాభావికము. చేదులేని వేపాకు నెందుం గానము. అటులనే ఆత్మయందును దుఃఖంబు స్వాభావికం బయ్యెనేని పోఁజాలదు గనుక, ఆత్మకు దుఃఖంబు  స్వాభావికం బని చెప్పఁగూడదు. ఆగంతుకమనియే చెప్పవలెను. స్వాభావికంబే యగుంగాక. దానికి నివృత్తియు వచ్చుం గాక ! అగ్నికి స్వాభావికంబగు నుష్ణత్వంబునకు మణిమాంత్రౌషధంబులచేత నివృత్తియు, శైత్యంబుల కావిర్భావంబునుం గన్నారము. జలంబునకు శైత్యంబు స్వాభావికంబు. అట్టి స్వాభావికంబైన శైత్యంబునకు నగ్నిసంపర్కంబుచేత శీతనివృత్తియు, నుష్ణత్వంబునకు నావిర్భావంబునుం గన్నారము. అటులే యాత్మకు దుఃఖంబు స్వాభావికంబు. స్వాభావికంబైన దుఃఖంబునకు నుత్కృష్ట కర్మోపాసనల నివృత్తియును, సుఖంబున కావిర్భావంబును వచ్చె నని చెప్పుదమన, దుఃఖమునకు తాత్కాలిక పరిభావమే కాని, ఆద్యంతక నివృత్తి రానేరదు. అది యెట్లనిన, అగ్నియందు తాత్కాలికమందు పరిభూతంబులగు నుష్ణాదులకు కాలాంతరంబునం దెటుల నావిర్భావము వచ్చుచున్నదో, అటులే యాత్మకు నుత్కృష్ట కర్మోపాసనాఫల రూపకమయిన సుఖమునకు నాశము వచ్చుచుండగా దుఃఖము మరల నావిర్భవించును. దుఃఖంబున కాద్యంతనివృత్తి రానేరదు. ఇట్లు చెప్పినచో మోక్షమునకు జన్యత్వంబును, అనిత్యత్వంబును సిద్ధించును. అటుల వచ్చినను రానిమ్మనిన, నది యెవనికి సమ్మతంబు గాదు. ఇంతియేగాక ఆత్మ ఆనంద స్వరూపుండని చెప్పెడి సకల శ్రుతిస్మృతీతిహాస పురాణాదులయందు గల వచనములకు వైయర్థ్యప్రాప్తి యగును. మఱియు సుషుప్త్యవస్థ యందును, సమాధ్యవస్థ యందును, తూష్ణీంభూతావస్థ యందును, ఆత్మయున్నాఁడు గనుక, స్వాభావికమయిన దుఃఖము తోఁచవలెను. ఈ యవస్థాత్రయంబు నందును ప్రాణులకు నేను దుఃఖినైయుంటినని యనుభవము లేదు గనుకను, నేను సుఖముగా నుంటినని యనుభవమున్నది గనుకను, ఆత్మకు దుఃఖము స్వాభావికమని చెప్పఁగూడదు. ఒకవేళ అంగీకరించినచో నీసుఖాను భవమునకు వైయర్థ్యము వచ్చును. కనుక ఆత్మకు దుఃఖము స్వాభావికమని చెప్పఁగూడదు. ఆగంతుక మనియే చెప్పవలెను.

            అట్లయిన దుఃఖ మెందుచేత వచ్చిన దన, శరీర పరిగ్రహముచేత వచ్చెను. ఎందెందు శరీర పరిగ్రహము గలదో అందందు దుఃఖము గలదని వ్యాప్తి, అటుల నెవ్వరేనియుం జెప్పుదురా ? రాజప్రభృతులయందు సుఖమే యనుభవింపఁబడుచున్నది గనుక, శరీర పరిగ్రహముచే దిక్కులనెల్ల దుఃఖమనుభవింపబడుచున్నదని యెటుల చెప్పవచ్చుననిన, చెప్పవచ్చును. అది యెటులనగా, రాజప్రభృతులయందును దుఃఖమే యనుభవింపఁబడుచున్నది. రాజప్రభృతులకు దేహమందు రోగమువచ్చెనేని దుఃఖము, కుమారులు లేకపోయిన దుఃఖము, కుమారులు చెప్పినట్లు వినకపోయిన దుఃఖము, ప్రియుండగుపుత్రుండు మృతుండయ్యెనేని దుఃఖము, శత్రువులు బలవంతులై రాజ్యమాక్రమించుకొని పోదురని దుఃఖము, భార్యలొకరికొకరు కోపించుకొని ఔషధ ప్రయోగములు సేసెదరని దుఃఖము, రాజ్యమునందు అనావృష్టి కలిగెనేని దుఃఖము. ఇవి మొదలయిన దుఃఖంబులు రాజ ప్రభృతుల యందునుం గానఁబడుచున్నది. కనుక వారలు సుఖ స్వరూపులనుట మోహము. మోహముచేత దుఃఖము సుఖముగాఁ దోఁచునా? యన దోఁచును. అది యేలాగన: మూటమోయువారికి కూలి అడ్డెడు బియ్యము అధికముగా దొరికిన మూటభారముచేత వచ్చిన దుఃఖమును లెక్కసేయక సంతోషపడుచున్నాఁడు. అడ్డెడు బియ్యము కూలి తగ్గినచో దుఃఖపడుచున్నాఁడు. బోయలు తమ దొరకు పయనము గలిగిన సంతోషపడుచున్నారు. పయనము లేకపోయిన దుఃఖపడుచున్నారు. పని చేయువారు పని లేకపోయిన ఖేదము నొందుచున్నారు. వేగులవారు పయనము లేకపోయిన వెతఁ జెందుచున్నాఁడు. మావటి వానికి క్రొత్త యేనుఁగు నిచ్చిరేని సంతోషించుచున్నాడు. ఇవి మొదలైన దుఃఖములు, వీరలకెటుల సుఖములుగాఁ దోఁచుచున్నవో అటుల రాజప్రభృతులకును దుఃఖమే సుఖమువలె మోహముచేత తోఁచుచున్నది. కనుక రాజప్రభృతులను ఆశ్రయించుకొని యుండువారలకు దుఃఖము కలదనుట వేఱే చెప్పవలెనా? అట్లైతే వివేకులకును దుఃఖము కలదా ? యనిన కలదు. అది యెట్టులనిన వివేకియనఁగా, శరీరము గలవాఁడో, లేనివాఁడో యని విచారించు చున్నాము. అశరీరియైన వానికి వివేకియని వ్యవహారము లేదు గనుక శరీరము గలవాఁడే వివేకియని చెప్పవలెను. కాన వివేకికిని దుఃఖము గలదు. అది యెట్టులనిన వివేకికిని ఆఁకలి దప్పులును, శీతోష్ణాది ద్వంద్వ దుఃఖములును, కడుపునొప్పి, తలనొప్పి, వ్యాఘ్ర వృశ్చిక సర్పాదులవల్ల వచ్చిన భయ కంపాదులును తోఁచుచున్నవి. కనుక వివేకులకును దుఃఖము కలదు. అట్టులైనచో వివేకికిని అవివేకికిని భేదమెటులనిన, వివేకియైన వాఁడు సర్వ దుఃఖములును అంతఃకరణనిష్ఠము కాని సాక్షియైన తనకు లేవని చూచును. అవివేకియైనచో ఈ దుఃఖములన్నింటిని తన యందా రోపించుకొని అన్యనిష్ఠమయిన దుఃఖములు గూడ తనయందే యారోపించుకొని, పుత్రుఁడు సుఖముగ నుండిన తాను సుఖించు చున్నట్లును, పుత్రుండు నశించిపోయిన తా నశించిపోయినట్లును తపించు చున్నాఁడు. కనుక వివేకికిని అవివేకికిని భేదము లేదని చెప్పఁగూడదు. ఎఱుంగబడు చున్నదియ గాక శరీరము కలదని, దుఃఖము కలదని ఆ శాస్త్రములే చెప్పుచున్నవి గనుక, దేవతలకును దుఃఖము గలదు. అది యెటులన, అన్యోన్య యుద్ధములచేతను క్రూరములైన పరస్పర శాపముల చేతను, బలిమి చేతను, ఒకనియైశ్వర్యమును మఱియొకం డపహరింపం దలంచుటచేతను రాక్షసులు తమ రాజ్యములను వశపరచుకొని తమ్ముం దఱుముటచేతనుం, గారా గృహంబుల యందుంచుట చేతను, రాక్షసులకు తాము భృత్యులై యుండుట చేతను, పుణ్యకర్మక్షయముచేత నాశము వచ్చుట వలనను, అనేక దుఃఖములు అమరులకును కలవని శ్రుతి స్మృతీతిహాస పురాణములు చెప్పు చున్నవి. కనుక దేవతలకును దుఃఖము గలదు. అయితే మనవలెనే దుఃఖులయిన దేవతలు మనకు నుపాస్యులై యభీష్టఫలంబుల నెవ్విధంబున నీఁగలరనిన, నీయంగలరు.  అది యేలాగన, రాజప్రభృతులు తాము దుఃఖము గలవారయినను ద్రవ్య సంపన్ను లగుటచేత మనకు నుపాస్యులై యిష్టార్థంబు లెటుల నొసంగుచున్నారో అటులనే దేవతలును దుఃఖములచేత పీడింపఁబడువారలయినప్పటికిని యోగైశ్వర్యాదిసంపన్ను లౌటచేత మనకు నుపాస్యులును, అభీష్టఫల ప్రదాయకులును అగుదురు. అయితే దేవతలు ఆనందస్వరూపులని చెప్పెడి శాస్త్రములకు తాత్పర్యమేమి యనిన, వివేకియైన వాఁడు శరీరంబుతోఁ గూడుకొని దుఃఖము గలిగినవాఁడై యుండియు నాదుఃఖంబు నంతఃకరణనిష్ఠంబుగా నెటుల చూచుచున్నాఁడో అటులే ఉత్కృష్టులైన దేవతలును దుఃఖంబు నంతఃకరణనిష్ఠంబుగానే చూచుచు సర్వదా బ్రహ్మానంద నిమగ్నులై యుందురు. కాఁబట్టి దేవతలు ఆనంద స్వరూపులని శాస్త్రంబులు చెప్పుచున్నవి.

            అయితే, దేవతలకు దుఃఖము కలదని చెప్పు శాస్త్రమునకు తాత్పర్య మేమనఁగా ఎక్కడెక్కడ శరీర పరిగ్రహము కలదో అక్కడక్కడ దుఃఖము కలదు. కనుక హిరణ్యగర్భశరీరపర్యంతంబును దుఃఖాక్రాంతంబయి యుండును గాన సశరీరముక్త్యర్థమయి యత్నము సేయరాదు. అశరీర ముక్తర్థ్యమయి యత్నము సేయవలెనని తాత్పర్యము. శరీర ముక్తి యొకటి కలిగి గదా అశరీర ముక్తికి యత్నంబు సేయవలయును. అశరీర ముక్తియని యొకటి కానమే? ఎవ్విధంబుగా యత్నంబు సేయనగు? శరీర ముక్తి యనియు నొకటి కలదా ? యనిన, కలదు. అశరీర ముక్తి లేదనుటకు ప్రమాణంబున్నది. అది యేలాగనిన శరీర ముక్తులయిన నక్షత్రాదులు ప్రత్యక్షంబుగాఁ దోచినట్టు అశరీర ముక్తులు ప్రత్యక్షంబుగాఁ గనుపడలేదు గనుకను, యోగులైనవారు యోగమహిమచేత లోకాంతరంబులకుం బోయి సశరీరముక్తులంజూచి వచ్చిరని శాస్త్రంబులలోఁ జెప్పియున్న చందంబునం జెప్పలేదు గనుక, శరీర ముక్తుండగువాఁడు నేను బహుకాలము శరీర ముక్తుండనై యుండి వచ్చితినని శాస్త్రంబునం జెప్పిన తెఱంగున నా శరీరముక్తుండగునతండు నేను బహుకాలము అశరీర ముక్తుండనై యుండి వచ్చితి నని శాస్త్రంబులోనఁ జెప్పియుండలేదు గనుకను శరీర ముక్తి కలదు. అశరీర ముక్తి లేదని చెప్పుదమన, చెప్పఁగూడదు. అది యెవ్విధంబున ననిన, సుషుప్తి సుఖము సకలప్రాణులకు నెవ్విధంబునం బ్రత్యక్షమో అదే ప్రకారము శరీర ముక్తియునుం బ్రత్యక్షమే. సుషుప్తి సుఖము ప్రత్యక్షమయితే ముక్తి సుఖంబునుంగూడ ప్రత్యక్షంబగునా ? యనిన, నద్వితీయ సుఖ స్వరూపంబుగా నుండెడిది సర్వసుషుప్తులయందును సమంబుగా నున్నది గనుక, నీకు సుషుప్తిసుఖంబు ప్రత్యక్షంబగునపుడు ముక్తియునుం బ్రత్యక్షమౌను. అయితే ప్రత్యక్షత్వము సుషుప్తిముక్తులయందు సమంబుగా నున్నది గాన, సుషుప్తిని ముక్తియని చెప్పుదమనిన సుషుప్తియం దజ్ఞానంబును బునరుత్థానంబును ఉన్నది గనుకను, ముక్తియందు పునరుత్థానంబును అజ్ఞానంబును లేదు గనుకను సుషుప్తి ముక్తియని చెప్పఁగూడదు. సుషుప్తి సుఖంబు తెఱంగున ముక్తిసుఖంబునుం బ్రత్యక్షంబై యున్నది గనుక, శరీర ముక్తికంటె అశరీర ముక్తి ప్రత్యక్షము. యోగియైనవాఁడు అశరీర ముక్తునికి వచ్చి చెప్పుచుండెడిదియు, నశరీర ముక్తుం డశరీర ముక్తుండనై యుండి వచ్చితినని చెప్పకుండుటయు అశరీరముక్తి లేదు. సశరీర ముక్తి కలదని చెప్పుటయందు నేనక్షత్రాదులు ప్రమాణంబుగాఁ జెప్పఁబడినవో అవియెల్ల స్వర్గలోక విషయంబులై, అనిత్యంబులై ప్రత్యక్షంబుగాఁ గానఁబడినవి గనుకను, బ్రహ్మలోక విషయంబులు గాకపోయెను గనుకను, నక్షత్రంబులకు సశరీర ముక్తి కలదనుటయందు ప్రమాణంబులు కావు. శాస్త్రమాత్ర ప్రమాణంబు ప్రమాణాంతరంబు లేదు. అశరీరముక్తి కలదనుటయందు శాస్త్రము, యుక్తి అనుభవంబు నున్నవి. అట్లుండుట వలన అశరీర ముక్తి కొఱకే యత్నము సేయవలయును. సశరీర ముక్తి కొఱకై యత్నంబు సేయరాదు. చేసిన దుఃఖంబు పో దనుటకు శాస్త్రంబును యుక్తియుం జెప్పఁబడెను. దుఃఖంబు పోదనుటకు అనుభవంబు జెప్పుచున్నారము.

            సుషుప్త్యవస్థయందు శరీర పరిగ్రహంబు లేదు గాన, దుఃఖంబును లేదు. జాగ్రత్స్వప్నాదులయందు శరీర పరిగ్రహంబున్నది గాన, దుఃఖంబు ననుభవింపబడుచున్నది. అట్లగుటవలన శరీర పరిగ్రహం బెచ్చటఁ గలదో అచ్చట దుఃఖంబునుం గలదు. శరీర పరిగ్రహం బెచ్చట లేదో అచ్చట దుఃఖంబును లే దనుట అన్వయవ్యతిరేక వ్యాప్తిచేత సిద్ధంబు. ఇట్లే ఆత్మకు శరీర పరిగ్రహము చేతనే దుఃఖంబు వచ్చుచున్నది. కావున దుఃఖంబు స్వాభావికం బని చెప్పఁగూడదు. ఆగంతుకమనియే చెప్పవలెను. అయితే యీ శరీర మెందుచేత వచ్చిన దనఁగా, కర్మంబుతోడంగూడిన పంచీకృత పంచమహాభూతంబుల వలననే వచ్చిన దని తోఁచుచున్నది. అట్లెందుకుఁ జెప్పవలె? కేవల పంచీకృత పంచమహాభూతంబులచేతనే శరీరంబు వచ్చినదని చెప్పుదమనిన, నట్లు చెప్పఁగూడదు. అది యెట్టులనిన అంతటను పంచీకృత పంచమహాభూతంబులున్నవి గావున, అందందు శరీరంబులు పుట్టవలెను. ఆవిధంబునం బుట్టలేదు. కాఁబట్టి కేవల పంచీకృత పంచమహాభూతంబులచేతనే శరీరంబు వచ్చినదని చెప్పగూడదు. పంచమహాభూతంబులు శుక్ల శోణితాకారంబులుగా నెక్కడఁ బరిణమించు చున్నవో అక్కడ శరీరంబులు పుట్టుచున్నవని చెప్పుద మనిన, ఆ మేరకు చెప్పఁగూడదు. నిత్యంబును స్త్రీ పురుష సంయోగంబు వలన శుక్ల శోణితంబులు పుట్టుచున్నవి గనుక, అందు శరీరంబులు పుట్టవలెను. అట్లు పుట్టుటలేదు. కాఁబట్టి ఆ మేరకు చెప్పఁగూడదు. శుక్ల శోణితంబులు లేవని చెప్పుదమనిన ప్రత్యక్షంబుగా నగపడుచున్నవి గాన, లేవని చెప్పఁగూడదు. అయినను శుక్లశోణితంబులకు సంయోగంబు లేదని చెప్పుద మనిన, శుక్ల శోణితంబులకు సంయోగంబు లేకపోయినట్టయితే స్త్రీ పురుషులకు రతి యుండఁగూడదు. అయినను శుక్ల శోణితంబులే దేశ కాలంబుల నపేక్షించి శరీరాకార మగుచున్నదని చెప్పుదమనిన, చెప్పఁగూడదు. అటులఁ జెప్పినట్లాయెనా ? ప్రాణులకు వైచిత్య్రంబు లేకపోవలెను. అయిన ప్రాణులకు వైచిత్య్రంబు గలదా యనిన, నొకరివలె నొక రుండలేదు గనుక, ప్రాణులకు వైచిత్య్రంబు కలదు. అయిన ప్రాణి వైచిత్య్రంబు దేశ కాలంబులచేత వచ్చుచున్నదని చెప్పుద మన, దేశకాలంబులు సర్వ ప్రాణులకును సాధారణంబులుగా నున్నవి. కనుక దేశకాలాదులచేతను జగద్వైచిత్య్రము వచ్చుచున్నదని చెప్పఁగూడదు. ఆ దేశ కాలాదులు సాధారణ కారణంబులునుం గానివాని చేతను జగద్వైచిత్య్రంబు రానీ యనఁగా అసాధారణమైన దేశ కాలాదులచేతను ఘటాది వైచిత్య్రంబు గానము గనుక, దేశ కాలాదులచేత జగద్వైచిత్య్రము వచ్చుచున్నదని చెప్పగూడదు. మఱి యెందువలన ఘటాదివైచిత్య్రము వచ్చుచున్నదనఁగా, అసాధారణ కారణంబులైన కులాలవైచిత్య్రంబు వలన తోఁచుచున్నది. అటులనే పంచీకృతంబులును శుక్ల శోణితాకారంబుగాఁ బరిణమించి సాధారణ కారణమైన దేశకాలాదుల నపేక్షించి యున్నప్పటికినీ అసాధారణ కారణమయిన కారణాంతరంబు నపేక్షించి విచిత్ర శరీరాద్యా కారంబులుగాఁ బరిణమించుచున్నవని చెప్పవలెను. ఆ కారణాంతరం బెయ్యది యనిన, కర్మంబే కావలయు. అటుల నయ్యెనేని, కర్మంబున కిట్టి సామర్థ్యంబున్నయదిగాన, కేవలం బగుకర్మ చేతనే శరీరంబు వచ్చెనని చెప్పుద మనిన కర్మంబు నిరాశ్రయంబై యుండలేదు. గనుకను త్రిక్షణా వస్థయై యున్నది గనుకను, కేవలంబగు కర్మంబువలన శరీరంబు వచ్చెనని చెప్పఁగూడదు. మఱియెట్లనిన, కర్మంబుతోడఁగూడు కొనిన పంచీకృత పంచమహాభూతంబులవలననే శరీరంబు వచ్చెనని చెప్పవలెను. ఇటుల చెప్పుటచేత రెండు కారణములచేత శరీరంబు పుట్టెనని చెప్పఁబడును. ఆ రెండు కారణంబు లెవ్వియనిన, కర్మంబులును పంచ మహాభూతంబులును. ఈ రెండు కారణంబుల లోపల నిమిత్త కారణంబగు కర్మ వైచిత్య్రంబు వలన శరీర వైచిత్య్రంబు వచ్చుచున్నది. ఈ యర్థంబునందు దృష్టాంతం బేమియైనం గలదా యనినఁ, గలదు. అది యెట్టులనిన ఘటము పుట్టుట యందు కేవలంబగు నుపాదానకారణంబైన మృత్తు చేతను కార్యం బెటులఁ బుట్టలేదో, కేవల నిమిత్త కారణంబగు కులాల వ్యాపారము మృత్తును ఆశ్రయించినందు చేతనే కార్యం బెటులఁబుట్టుచున్నదో, మృత్తు ఏక రూపమయి యున్నప్పటికిని కులాల వ్యాపారము చేత కార్యమందు వైచిత్య్రం బెటుల వచ్చుచున్నదో, అటులనే దార్టా ్షంతికమందును కేవల పంచమహా భూతముల చేతను దేహము పుట్టలేదు. కేవల కర్మచేతను శరీరము పుట్టలేదు. కర్మముతోడం గూడుకొనిన పంచీకృత పంచమహాభూతంబుల వలననే శరీరము పుట్టుచున్నది. కర్మ వైచిత్య్రము చేతనే శరీర వైచిత్య్రంబు వచ్చుచున్నదని కనుంగొనుటకు దృష్టాంతమందు ఉపాదాన కారణమైనట్టి మృత్తుండినను, నిమిత్తకారణమైన కులాల వ్యాపారము లేకపోయినచో ఘటం బెటుల పుట్టలేదో, అటులనే దార్టా ్షంతికమందు ఉపాదాన కారణమయిన యీశ్వర సృష్టంబగు భూతంబులును కార్యంబగు భౌతిక ప్రపంచంబును స్థాయియై యున్నప్పటికిని, అద్వితీయుండగు ఆత్మ నేననే జ్ఞానము చేతను నిమిత్త కారణంబగు కర్మం బెవనికి నశించిపోవుచున్నదో వానికి శరీరము రాదు. ఇది సిద్ధము. ప్రపంచము కాలత్రయంబుల యందును లేకున్నను తోఁచుచున్నది. అటులఁ దోఁచినను, లేదను నిశ్చయం బెవనికి కలిగి యుండునో వానికి జన్మము లేదనుట యన్వయ వ్యతిరేకముల చేత సిద్ధము. అన్వయ వ్యతిరేకంబు లన నెయ్యవి యనిన, కర్మము గలిగెనేని శరీరంబునుం గలదు. కర్మంబు లేకున్న శరీరంబు లేదనుట, అటుల నెక్కడ ననుభవింపఁబడెను? అనిన, జాగ్రత్స్వప్నముల యందు స్థూలసూక్ష్మభోగ ప్రదమైన కర్మము ఉన్నది గనుక, శరీరంబు నున్నది. సుషుప్తియందు స్థూల సూక్ష్మభోగప్రదంబగు కర్మంబులేదు గావున, శరీరంబు లేదు. కర్మము గలిగిన శరీరమునుం గలదనుట శ్రుతియుక్త్యను భవముల చేత సిద్ధము.

            సశరీరులయ్యును శరీరమును కుణపమువలె భావించి దేహాభిమాన శూన్యులై సర్వావస్థలయందును పరబ్రహ్మనిష్ఠులై ప్రపంచస్మృతి లేనివారలే జీవన్ముక్తు లని భావము.

            శ్లో||  సశరీరస్య దుఃఖిత్వాద్వ్యాప్తితో వ్యాహతా యతః
                       అతో ఽశరీరముక్త్యర్థం యత్నం కుర్యా దతంద్రితః
                       సభూతపంచకం నాడీకరణః కేవలాదపి
                       ఉభాభ్యాం మిళితాభ్యాం తచ్ఛరీర ముపజాయతే
                       తచ్ఛరీరానవాప్తిశ్చ జ్ఞానా దేవచ్చ శూన్యతః,
                       అతస్సర్వ ప్రయత్నేన జ్ఞానాభ్యాసరతో భవేత్‌

ఇది చతుర్థ వర్ణకము