32. వైరాగ్యబోధోపరతులు

చతుర్వింశతి వర్ణకము
32. వైరాగ్యబోధోపరతులు

            వైరాగ్యబోధోపరతులకు హేతుస్వరూప కార్యంబులును, వానికి అవధియును నిరూపించుచున్నారము. వైరాగ్యబోధోపరతులు వివేకులయం దొకటి కొకటి సహాయంబై శ్రవణాదుల వలన ప్రాణులను కూడుకొని యుండును. కర్మవశంబువలన నొక్కటి యొక్కొక్క సమయంబున నొక పురుషునికి లేక యుండును. ఈ వైరాగ్యబోధోపరతులకు హేతు వెయ్యది? స్వరూప మెయ్యది ? కార్య మెయ్యది ? యని ముముక్షువు ప్రత్యేకంబుగా విచారించి యెఱుఁగఁదగినది. వీనిలో వైరాగ్యంబునకు హేతుస్వరూప కార్యంబు లెవ్వియనిన, సమస్త విషయములను వాంత్యశనంబువలె, వదల వలయునని తోఁచునట్టిది హేతువు. ఈ విషయంబులయందు వృత్తి రాకుండునట్టిది స్వరూపంబు. ఆ విషయంబులను అనుభవింపక యెందుకు తోసివేసితినని తిరుగఁబడక వానియం దాసక్తి రాకుండుట కార్యంబు. ఈ మూడుఁను వైరాగ్యంబునకు నసాధారణ హేతుస్వరూప కార్యంబులు. బోధకు హేతుస్వరూపకార్యంబు లెవ్వియనిన, శ్రవణమనననిధి ధ్యాసనములు హేతువులు. ఆ శ్రవణాదులచేత దేహేంద్రియాది ప్రపంచంబు వలన ఆత్మ స్వరూపమును బంచి అద్వితీయాత్మ స్వరూపమే నేను, ఈ దేహేంద్రియాది ప్రపంచంబు నేను గాను, ఈ ప్రపంచంబు దోఁచినప్పటికిని కాలత్రయమందును నేను కానని బుద్ధియందు దృఢమైన నిశ్చయం బుంచుట బోధకు స్వరూపంబు. ఈ యనాత్మ స్వరూపమైన దేహేంద్రియాదులు నేనని తలంప కుండుట బోధకు కార్యంబు. ఈ మూఁడును బోధకు సాధారణంబైన హేతుస్వరూపకార్యంబులు. ఉపరతికి హేతుస్వరూప కార్యంబులేవి యనిన, యమనియమాదులు హేతువులు. చిత్త విరోధంబు స్వరూపంబు. సర్వ వ్యవహార నాశంబు కార్యంబు. ఈ మూడును ఉపరతికి సాధారణమైన హేతుస్వరూప కార్యంబులు. ఈ ప్రకారముగా వైరాగ్యబోధోపరతులకు స్వరూపకార్యంబు లన్యోన్య సహకారములే యని చెప్పఁబడెను. ఈ వైరాగ్య బోధోపరతులు మూఁడును మోక్షంబునకు సమప్రధానంబులో, లేక రెండు ప్రధానంబులో, లేక యొకటి యుపసర్జనంబో యని శంకరాఁగా, నాశంకను దొలఁగించుచున్నారము.

            సాధనాంతరంబు నపేక్షింపక ప్రత్యక్షంబుగ మోక్షంబు నిచ్చునది గాన బోధ ప్రదానంబు. వైరాగ్యోపరతులు రెండును బోధకు సాధనంబులు. ఇవి మూఁడు నొక పురుషునియందున్నట్లయితే మహత్తైన తపస్సు యొక్క ఫలము. ఒక పురుషునియందు మూఁడింటిలో నొకటికి కర్మ వశంబున ప్రతిబంధంబు వచ్చినను వచ్చును. ఒక పురుషునికి వైరాగ్యోపరతులు పూర్ణంబులై యుండి జ్ఞానంబు లేకున్న వానికి మోక్షంబు లేదు. అయితే యీవైరాగ్యోపరతులు వ్యర్థంబులయ్యెం గదా యనిన, వైరాగ్యోపరతులు తపస్సు. కాఁబట్టి వాని వలన పుణ్య లోకప్రాప్తి యగును. ఒక పురుషునికి జ్ఞానంబు పూర్ణంబయి యుండి వైరాగ్యోపరతులు లేకున్నను వానికి మోక్షంబు సిద్ధించును. అయితే వైరాగ్యోపరతుల వలన ప్రయోజనం బేమి యనిన, అవి లేకపోయినచో ప్రత్యక్ష దుఃఖంబు పోదు. ఈ వైరాగ్యోపరతులకు అవధి యెప్పుఁడనిన, బ్రహ్మలోక తృణీకారము కలుగు పర్యంతంబు నవధి. అజ్ఞాన కాలంబునందీ దేహేంద్రియాది సంఘాతంబు నేనని నిశ్చయంబు వచ్చినట్లు, అవి తోఁచకయే ఆత్మస్వరూపంబు నేనని దృఢ నిశ్చయము కలుగు పర్యంతంబును బోధకు అవధి. సుషుప్తి యందువలె జాగ్రత్త యందును ముముక్షువు సమస్త విషయంబులను మఱచి యుండుట యెప్పుడు సిద్ధించునో అంతపర్యంతంబు నుపరతికి అవధి. ఈ ప్రకారంబున వైరాగ్యబోధోపరతులకు తారతమ్యము నవధియును జెప్పినట్టాయెను. ప్రారబ్ధంబు నానా విధంబు కాఁబట్టి వివేకులయిన వారలు వారల యొక్క వ్యాపారమును జూచి శాస్త్రమెటువలె నున్నది, వీరలెటువలె నున్నారని భ్రమింపఁబని లేదు. వారి కర్మచేత వారు నానావిధ వ్యాపారంబులతోఁ గూడుకొని యున్నప్పటికి జ్ఞానంబును జ్ఞాన ఫలంబైన ముక్తియును సమానంబు. ఈ ప్రకారము వేదాంత శాస్త్ర సిద్ధాంతము.

ఇది చతుర్వింశతి వర్ణకము.