41. ప్రారబ్ధ త్రయ స్వరూప నిరూపణము

త్రయస్త్రింశద్వర్ణకము
41. ప్రారబ్ధ త్రయ స్వరూప నిరూపణము

            ఇచ్ఛా ప్రారబ్ధమనియు, అనిచ్ఛా ప్రారబ్ధమనియు, పరేచ్ఛా ప్రారబ్ధ మనియును, ప్రారబ్ధము మూఁడు విధంబులు. ఈ త్రివిధ ప్రారబ్ధమును వివేకులకును నవివేకులకును సమానమై యుండును. ఉన్నప్పటికిని వివేకి యొక్క ప్రారబ్ధంబునకును అవివేకియొక్క ప్రారబ్ధంబునకును భేదంబు గలదు. అది యెటులనఁగా అవివేకి యొక్క ప్రారబ్ధ మాశ్వీజమాసమందలి మేఘంబు వంటిది. ఆ మేఘమెట్టిదనిన ఆశ్వీజమాసమందు స్వల్పంబుగా నుండును. ఆ స్వల్పమయిన మేఘంబు సర్వత్ర వ్యాపించి కుంభ ద్రోణం బుగా వర్షించి పైర్లను మునిగిపోవునట్లు చేసి యిండ్లు గోడలు పడునట్లు చేసి ప్రాణులకు అనేకంబులగు ననర్థంబుల నెటుల సేయుచున్నదో అటులే అజ్ఞునికిని స్వల్పంబుగానే యిచ్ఛ పుట్టును. ఆ పుట్టిన యిచ్ఛ ఆ మేఘంబు వలెనే సర్వత్ర వ్యాపించుకొని పరుల కనేక దుఃఖంబులను చేసి వానికిని ఇహపరలోక సుఖములను దొలఁగించి నరకంబును సంపాదించును. వివేకి యొక్క ఇచ్ఛ మకరమాసమందలి మేఘంబువంటిది. ఆ మేఘ మెట్టిదనిన మకరమాసమందు మేఘము సర్వవ్యాపియై యుండును. అట్టుండినను స్వల్పంబుగా వర్షంబు గురిసి సస్యాదులకు నష్టము సేయక ప్రాణులకును అనర్థంబును చేయక తాను నశించిపోవును. అటులే వివేకియొక్క యిచ్ఛయును కర్మవశంబు వలన మకరమాసమందలి మేఘంబువలెనే విస్తారంబుగా వ్యాపించియున్నదానివలె నున్నప్పటికిని పుష్కలమైన వివేకంబు వలన పరుల నుపద్రవ పెట్టక తనయొక్క పరలోక సౌఖ్యంబునకు హానిని సంపాదింపక దేహధారణ మాత్రమందే నిల్చును. ఈ ప్రకారంబున వివేకి యొక్క యిచ్ఛా ప్రారబ్ధంబునకును అవివేకియొక్క ప్రారబ్ధంబునకును భేదము. ఇప్పుడు ప్రారబ్ధంబును సామాన్యంబుగా నిరూపించితిమి. ఇంకను విశేషంబుగా నిరూపించుచున్నారము.

            అది యెటులనగా, లోకమందు వివేకులైనవార లసత్యంబు చేసి చచ్చిపోయిన వారలను, దొంగిలించి తలగొట్టబడినవారలను, రాజ స్త్రీలను బట్టి బాడిసెలచేత ఛేదింపబడిన వారలను జూచి మన మీ కార్యంబులను చేయరాదు. చేసితిమేని, మనకు గండంబులు వచ్చునని తద్విషయంబు నెఱింగియుండియు నది యంతయు లేక, వాండ్రసమర్థులనియు తాము సమర్థులమనియు నెంచుకొని యావ్యాపారంబుల యందు ప్రవర్తించి తుదకు తామే తలఁగొట్టఁబడుచున్నారు. ఈ ప్రకారంబున అవివేకియొక్క ప్రారబ్థంబు. అయినను వివేకులైన వారలు ప్రవృత్తులనియు ననర్థంబు లనియు విచారించి యర్థాసక్తులైన సంసారులర్థంబును సంపాదించుట యందును దాని సంరక్షణ మందును ఆ యర్థంబు నాశనంబు చేయుట యందును దుఃఖపడుటను చూచి యీయర్థమందాసక్తి చేయరాదు. చేసితిమేని వారికి దుఃఖము వచ్చినట్లే మనకును దుఃఖము వచ్చునని విచారించి సమస్త విషయంబుల యందును ఆసక్తిని వదలి యదృచ్ఛాలాభ సంతుష్టులై యుందురు. వారలకు శరీరధారణ మాత్రమైన క్రియల యందును, శౌచాదిక్రియలయందును ఇచ్ఛ పుట్టును. అంతేకాని అన్యత్ర యిచ్ఛ పుట్టదు. ఆ ప్రకారంబుగా వివేకుల యొక్క యిచ్ఛా ప్రారబ్ధము. అనిచ్ఛా ప్రారబ్ధం బెయ్యది యనిన, కోరక సంప్రాప్తమగునట్టి ప్రారబ్ధము. అది వివేకులకును, అవివేకులకును సమానమై యుండును. అది యెటులనిన తలతాకుటయును, కాలు తాఁకుటయును, కన్నీరు ఉఱియుటయు, వానలో దడియుటయు, ఎండచే గొట్టువడుటయు, క్షయాది వ్యాధులును, పిడుగులు పడుటయు, గుడి గోపుర ప్రాకార మంటపాదులు పడుటయు, ఇవి మొదలైనవానిచేత వచ్చిన దుఃఖంబులు. ఎండవలన, వాన వలన, అగ్ని వలన వచ్చిన సుఖంబులు  ఇవి మొదలైన సుఖంబులు వివేకులకును, అవివేకులకును సమానమయి యుండును. వీనియొక్క అనుభవంబులే అనిచ్ఛా ప్రారబ్ధంబులని పేరు. పరేచ్ఛాలబ్ధంబును నిరూపించుచున్నారము. ఆ ప్రారబ్ధంబును వివేకులకును, అవివేకులకును సమముగానే యుండును. అది యెటులనిన, ఒక పురుషుడు మౌనియై కూర్చుండి యుండఁగా అన్యుండొకఁడువచ్చి వానికి నమస్కరించి నీవీ కార్యంబును చేయవలెనని చాల అడుగుకొనఁగా దాక్షిణ్యంబుచేతచేసి వానివలన వచ్చిన సుఖదుఃఖంబులను అనుభవించుట. ఈ యనుభవము వివేకులకు అవివేకులకు సహా పరేచ్ఛా ప్రారబ్ధంబు. ఈ ప్రకారంబుగా ప్రారబ్ధ త్రయంబును విచారించి యీ ప్రారబ్ధత్రయానుభవంబు అహం కారంబునకే కాని అహంకార సాక్షియైన తనకు (ఆత్మకు) లేదని యెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.
ఇది త్రయస్త్రింశద్వర్ణకము.