48. జీవేశ్వర స్వరూప నిరూపణము

చత్వారింశద్వర్ణకము
48. జీవేశ్వర స్వరూప నిరూపణము

                        జీవుఁడనఁగా అంతఃకరణంబును, అంతఃకరణాధిష్ఠానంబును, అంతఃకరణమందు ప్రతిబింబించిన చైతన్యంబును నీమూఁడును గూడి జీవుఁడని చెప్పఁబడును. అటుల చెప్పవలసినదేమి ? కేవలమైన అంతఃకరణమునకు జీవత్వము చెప్పుదమనిన, ఘటమునకు జీవత్వంబు రావలెను. దానికి జీవత్వంబు లేదు గనుక కేవలాంతఃకరణంబునకు జీవత్వంబు చెప్పఁగూడదు. అటుల కాదు. ఘటము స్వచ్ఛద్రవ్యము కాదు  గనుకను, అంతఃకరణము స్వచ్ఛద్రవ్యము గనుకను, అంతఃకరణమునకు జీవత్వముచే దర్ప ణాదులు స్వచ్ఛద్రవ్యంబులు గనుక వానికి జీవత్వంబు రావలయును. వానికి జీవత్వంబు రాఁగూడదు గనుక, కేవలాంతఃకరణంబునకు జీవత్వంబు చెప్పఁగూడదు. దర్పణాదులు బాహ్యపదార్థంబులు. అంతఃకరణంబు అంతరంబు గనుక అంతఃకరణంబునకు జీవత్వంబు చెప్పుదమనిన, ఇంద్రియాదులకును అంతరంబులేదు గనుక, వానికిని జీవత్వంబు రావలయును. వానికిని జీవత్వంబు కూడదు గనుక, అంతఃకరణంబునకు జీవత్వంబు చెప్పఁగూడదు. ఇంతేకాదు, అంతఃకరణము ఇంద్రియాదులకన్న అంతరంబు గనుక, దానికి జీవత్వంబు చెప్పుదమనిన, ఇంద్రియాదులు అజ్ఞానంబు. ఆ అజ్ఞానంబు అంతఃకరణంబున కన్న అంతరంబు గనుక, దానికి జీవత్వంబు రావలయును. దానికిజీవత్వంబు చెప్పఁగూడదు. ఇంత మాత్రమే కాదు. జీవుడు చేతనుఁడు గనుకను, అచేతనమయిన అంతఃకరణంబునకు జీవత్వంబు చెప్పఁగూడదు.

            అయితే కేవల ప్రతిబింబమునకు జీవత్వంబు చెప్పుదమనిన, అంతఃకరణము లేక ప్రతిబింబము లేదు గనుక కేవల ప్రతిబింబమునకు జీవత్వము చెప్పఁగూడదు. అయితే ప్రతిబింబము కొఱకు అంతఃకరణము నంగీకరించి కేవల ప్రతిబింబమునకు జీవత్వంబు చెప్పుదమనిన, ప్రతిబింబమునకు స్వయం వికారంబు గలిగియున్నను, కర్తృత్వాది వికారము లేదు గనుక కేవల ప్రతిబింబంబునకు జీవత్వంబు చెప్పగూడదు. అయితే అధిష్ఠాన చైతన్యమునకు జీవత్వము చెప్పుదమనిన, ఆ చైతన్యంబు నిర్వికారంబు గనుక, వికార స్వరూపమయిన జీవత్వము మాయధిష్ఠాన చైతన్యంబునకుఁ గూడదు. అయితే అంతఃకరణమును ప్రతిబింబమును గూడి జీవుఁడని చెప్పుదమనిన, ఇవి రెండును కల్పితంబులు గనుక అటువలె చెప్పితే జీవునికి నిత్యత్వము సిద్ధింపదు. అందువలన ముక్తుఁడై యుండే వాఁడెవఁడును లేకపోవుచున్నాఁడు. కాబట్టి అంతఃకరణము ప్రతిబింబము రెండును గూడి జీవుఁడని చెప్పఁగూడదు. అధిష్ఠాన చైతన్యంబును ప్రతిబింబ చైతన్యంబునుఁగూడి జీవుఁడని చెప్పుదమనిన, కేవల చైతన్యంబుమాత్రము నిర్వికారము గనుక ఆ బింబ ప్రతిబంబ చైతన్యములకు కర్తృత్వ భోక్తృత్వాది వికార లక్షణమయిన జీవత్వము చెప్పఁకూడదు. అయితే అధిష్ఠాన చైతన్యంబును అంతఃకరణంబును గూడి జీవుఁడని చెప్పుదమనిన దర్పణంబును దర్పణా ధిష్ఠాన చైతన్యంబును గూడి జీవుఁడు కావలెను. వాటికి జీవత్వము కూడదు గనుక, అధిష్ఠాన చైతన్యాంతఃకరణములకు జీవత్వము చెప్పఁగూడదు. కాఁబట్టి అంతఃకరణ, అంతఃకరణాధిష్ఠానచైతన్యము, ప్రతిబింబచైతన్యములు గూడి జీవుఁడని చెప్పవలెను.

            మఱియును జీవత్వంబునకు ఇంతమాత్రము చాలదు. కర్తృత్వ భోక్తృత్వాది విశిష్టత్వంబు జీవత్వంబు గాన కర్తృత్వ భోక్తృత్వాదులు సిద్ధించుటకు అంతఃకరణంబుతోడంగూడిన సూక్ష్మశరీరము జీవత్వంబు కావలెను. ఇంతే కాదు. సూక్ష్మశరీరము స్థూలశరీరమును విడిచి యుండదు గనుక, ఆయా గోళకము వినాగా నాయింద్రియగ్రహణము కూడదు గనుకను, బ్రాహ్మణత్వాద్యభిమానము లేక కర్తృత్వము కూడదు గనుకను, స్థూల శరీరంబునుం గావలయు. అసంగుడైన ఆత్మకు అజ్ఞానంబు లేదు. అజ్ఞానంబు లేక శరీరంబురాదు గనుక అజ్ఞానమును, అధిష్ఠాన చైతన్యంబును, ప్రతిబింబచైతన్యంబును, అంతఃకరణంబును, శరీర త్రయంబును, వీటి యందలి అధ్యాసయునుంగూడి జీవుఁడని చెప్పఁబడును.
ఈశ్వరుని యొక్క స్వరూపంబు నిరూపించుచున్నారము.

            మాయయు, మాయాధిష్ఠాన చైతన్యంబును, మాయాప్రతిబింబ చైతన్యంబునుం గూడి యీశ్వరుఁడని చెప్పఁబడును. ఇటుల చెప్పనేల ? కేవలమైన మాయకు నీశ్వరత్వము చెప్పుదమనిన, ఆకాశంబునకును ఈశ్వర త్వము చెప్పవలసి వచ్చును. దానికి నీశ్వరత్వము చెప్పఁగూడదు గనుక, కేవలమైన మాయకు ఈశ్వరత్వము చెప్పఁగూడదు. ఆకాశము ఉత్పత్తి మత్తు గనుక, ఆకాశమునకు నీశ్వరత్వము గూడకపోయినను అనాదియై యుండు నట్టి మాయకు నీశ్వరత్వంబు చెప్పఁగూడదా యనిన, అత్యంతా భావంబునకు నీశ్వరత్వంబు రావలెను. దానికి నీశ్వరత్వము చెప్పఁగూడదు. అభావము భావపదార్థంబు కాదుగావున, మాయ అభావ పదార్థము గనుక దానికి నీశ్వరత్వము చెప్పఁగూడదు. మాయ అనిర్వచనీయము. దానికి నీశ్వరత్వంబు చెప్పెదమనిన, అనిర్వచనీయములయిన శుక్తిరజతాదులకును నీశ్వరత్వంబు రావలెను. వానికి నీశ్వరత్వము కూడదు గనుక, మాయకు నీశ్వరత్వము చెప్పఁగూడదు. ఈశ్వరుఁడు చేతనుఁడు. మాయ యచేతనము. కాఁబట్టి అచేతనమైన మాయకు నీశ్వరత్వము చెప్పఁగూడదు. కేవల ప్రతి బింబమునకు నీశ్వరత్వము చెప్పుదమనిన, మాయలేకనే ప్రతిబింబము లేదు గనుక, వానికి నీశ్వరత్వము చెప్పఁగూడదు. ప్రతిబింబము కొఱకు మాయ నంగీకరించి ప్రతిబింబ మాత్రంబున కీశ్వరత్వంబు చెప్పుదమనిన, మాయ లేకయే ప్రతిబింబమునకు సర్వజ్ఞత్వాదులు  కూడదు గనుక, కేవల ప్రతిబింబమాత్రంబున కీశ్వరత్వంబు చెప్పుదమనిన మాయలేకయే ప్రతి బింబమునకు సర్వజ్ఞత్వాదులు కూడదు. గనుక కేవల ప్రతిబింబ మాత్రంబున కీశ్వరత్వంబు చెప్పఁగూడదు. అయితే అధిష్ఠాన చైతన్యంబున కీశ్వరత్వంబు చెప్పుదమనిన, నిర్వికారము గనుకను, కేవల నిర్వికార చైతన్య మునకు జగత్సృష్ట్యాదులు కూడవు గనుకను, దానికి నీశ్వరత్వంబు చెప్పఁగూడదు. అయితే అధిష్ఠాన చైతన్యంబును, మాయయు గూడి ఈశ్వరత్వమని చెప్పుదమనిన ఈ రెండునూ కల్పితంబులు. కనుక వీనికి ఈశ్వరత్వంబు చెప్పినచో నీశ్వరునికి నిత్యత్వము సిద్ధింపదు. సిద్ధింపకపోయినచో నేమి యనిన, ఈశ్వరునికి నిత్యత్వము ప్రతిపాదించెడి శ్రుతులకు విరోధము వచ్చుచున్నది గనుక, మాయా ప్రతిబింబములకు నీశ్వరత్వము చెప్పఁగూడదు. అధిష్ఠాన చైతన్యంబును నిర్వికారంబు గాన నిర్వికార చైతన్యమునకు వికారమయిన యీశ్వరత్వము చెప్పఁగూడదు. మాయ యును, మాయ యందుఁ బ్రతిబింబించిన చైతన్యంబును, మాయాధిష్ఠాన చైతన్యంబునుం గూడి యీశ్వరుండని చెప్పవలెను.

            ఈ ప్రకారంబుగ జీవేశ్వరుల నెచట నిరూపించినా రనిన విద్యారణ్య స్వాములవారు పంచదశ ప్రకరణమందు నిరూపించినారు. ఆ వాక్యము లేవి యనిన

శ్లో||  చైతన్యం యదధిష్ఠానం లింగదేహం చ యా పునః
            చిచ్ఛాయా లింగ దేహస్థా తత్సంగో జీవ ఉచ్యతే
            చిదానందమయీ బ్రహ్మ ప్రతిబింబ సమన్వితా
            తమోరజస్సత్త్వగుణా ప్రకృతిర్ద్వివిధా చ సా
            సత్త్వశుద్ధ విశుద్ధాభ్యాం మాయావిద్యా చ తే మతే
            మాయాబింబం వశీకృత్య తాం స్యాత్సర్వజ్ఞ ఈశ్వరః

            అని ఈ ప్రకారంబుగ జీవేశ్వరులయొక్క స్వరూపంబును విచారించి జీవేశ్వరులు మాయాకల్పితులని నిశ్చయించి జీవేశ్వరుల కధిష్ఠాన భూతుఁడై నిర్వికారుఁడు నిరవయవుఁడు నసంగుడు స్వప్రకాశుఁడు సర్వసాక్షియు నైన ప్రత్యగాత్మయే పరమాత్మ. ఆ పరమాత్మయే నేనుఅని యెవడెఱుఁగుచున్నాడో వాఁడే ముక్తుఁడని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.


ఇది చత్వారింశద్వర్ణకము