53. మహావాక్యార్థ విచార ఘట్టము

పంచచత్వారింశద్వర్ణకము
53. మహావాక్యార్థ విచార ఘట్టము

శ్లో||  యస్యప్రసాదాద్వశ మేవతత్త్వం బ్రహ్మైవ జానాతి నిరస్తమోహః
        తమేవ సత్యం విభుమాత్మతత్వం శ్రీవాసుదేవం శిరసా నమామి

            ‘‘లోకమందు అధికారి అనేక జన్మంబులయందు నీశ్వరార్పణంబు చేసిన నిత్యనైమిత్తిక కర్మంబులచేతను సగుణోపాసన చేతను శుద్ధాంతః కరుణుండై యీమనుష్య లోకంబు మొదలుకొని బ్రహ్మలోక పర్యంతంబును సర్వంబు కర్మనిర్మితము అని ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాదిషట్క సంపత్తి, నిత్యానిత్య వస్తువివేకము, ముముక్షుత్వము అనెడి నాలుగు విధంబులైన సాధనములతోఁ గూడుకొని కానుక మొదలైనవి చేతఁబట్టుకొని వేదాంత శాస్త్రజ్ఞుఁడయి యుపశాంత నిధియైన సద్గురుని శరణుఁబొంది సాష్టాంగ నమస్కారములను చేసి అహోస్వామిన్‌ పరమగురోఈ సంసార మందు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక రూపమైన తాపత్రయము చేత మిక్కిలి కొట్టఁబడిన వాఁడనయినితిని గనుక, ఈ సంసారభయము వలన ప్రయాసలేక సులభముగ నేను తరించునట్టి ప్రకారంబును తెలిపి సకల వేదాంతంబుల తాత్పర్యార్థంబును సంక్షేపించి నాయందు కటాక్షించి అను గ్రహము చేయుఁడని శిష్యుఁడడుగఁగా గురువులు ఉపదేశము చేయు చున్నారు. ఓయీ ! మహావాక్యార్థ విచారము వలనఁ బుట్టిన జీవపరమా త్మైక్య జ్ఞానమే మోక్ష సాధనము. ఇదియే సకల వేదాంతంబుల యందును నిర్ణయింపఁబడిన అర్థమని గురువులుపదేశించఁగానే శిష్యుఁడు మరల నిట్లని విన్నవించును. స్వామీ! మహావాక్యమనఁగా నేదియో వాక్యార్థ విచార మనఁగా నేదియో జీవుండను నెవ్వండో ఈశ్వరుఁడన నెవ్వఁడో నేనెఱుఁగను. ఆ జీవేశ్వరుల యొక్క ఐక్యానుసంధానం బేదియో యెఱుగను. మఱియు నాకు బంధంబు వచ్చిన విధంబును ఇఁక మోక్షమును పొందఁదగిన విధంబును నెఱుంగను. కాఁబట్టి పరమ దయాపరమూర్తులగు మీరు నాయందు కరుణించి సవిస్తారంబుగ నానతీయవలయునని ప్రశ్న చేయఁగానే గురుస్వామిట్లు చెప్పెను. మంచి ప్రశ్నవేసితివి, చెప్పెదను. సావధా నంబుగ వినుము. నాలుగు వేదముల యొక్కయు నుపనిషత్తుల యందును నాలుగు మహా వాక్యంబులు గలవు.

            అవి యేవి యనిన, ‘ప్రజ్ఞానం బ్రహ్మఅని ఋగ్వేదోపనిషత్తుల యందును అహం బ్రహ్మాస్మిఅని యజుర్వేదోపనిషత్తులయందును తత్త్వమసిఅని సామవేదోపనిషత్తుల యందును ఆయమాత్మా బ్రహ్మఅని యథర్వణ వేదోపనిషత్తులయందును కలవు. ఈ వాక్యములకు అర్థమేమి యనిన, వాక్యార్థ జ్ఞానంబునకు కారణంబు పదార్థంబు గనుక పదార్థ విచారమే ముందుగాఁ జేయఁదగినది. పదమెద్ది ! పదార్థమెయ్యదనిన త్వంపదము, తత్పదము, అసిపదమునని మూఁడు పదములు. త్వం పదార్థము జీవుఁడు, తత్పదార్థ మీశ్వరుఁడు, అసి యనుట ఆ రెంటి యొక్క ఐక్యార్థము. త్వంపదార్థమైన జీవుని యొక్క స్వరూప మెయ్యది యనిన, అధిష్ఠాన చైతన్యంబును దానియందుఁ గల్పితమైన లింగశరీరమును లింగ శరీరంబునందుఁ బ్రతిఫలించిన చిదాభాసుండును చిదాభాసుని యొక్క ధర్మంబులైన కించిద్‌జ్ఞత్వ కర్తృత్వ భోక్తృత్వాదులును గూడి త్వంపదార్థ భూతుఁడైన జీవుని యొక్క స్వరూపము. తత్పదార్థమైన ఈశ్వరుని యొక్క స్వరూపమేది యనిన, మాయయు మాయాధిష్ఠాన బ్రహ్మ చైతన్యంబు మాయ యందు ప్రతిఫలించిన చిదాభాసుండును ఆతని ధర్మంబులయిన సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాది గుణంబులునుగూడి తత్పదార్థ భూతుఁడయిన ఈశ్వరుని యొక్క  స్వరూపము. అసియనఁగా జీవుఁడే బ్రహ్మము. బ్రహ్మమే జీవుఁడు అని ఐక్యార్థము. ఈ ప్రకారంబుగ గురువులపదేశింపఁగా శిష్యుడు హే సచ్చిదానందగురో! కించిద్‌జ్ఞత్వాది గుణంబులతోడం గూడుకొనిన జీవునికి సర్వజ్ఞత్వాది గుణంబులతోడఁ గూడుకొనిన ఈశ్వరునికి ఐక్యమెటువలె కూడును? ఈ విరుద్ధార్థమును శ్రుతులు ఎటువలె బోధించు చున్నవి? ఇది నాకు సంశయముగా నున్నది. ఈ సంశయంబును పరిహరించి రక్షించవలయుననిన, గురువులు శిష్యునింజూచి ఓ శిష్యుఁడా! నీవు అడుగదగిన మంచి ప్రశ్నము నడిగితివి. ఈ వాక్యంబునకు లక్ష్యార్థమనియు వాచ్యార్థమనియు నర్థము రెండు విధంబులు. వాచ్యార్థ మంగీకరించినచో నెక్కడ  ప్రత్యక్ష విరోధముండునో అక్కడ లక్ష్యార్థ మంగీ కరింపఁదగినది కాఁగా, ఈ మహావాక్యమం దీలక్షణ చేతను ఐక్యంబు బోధింపఁబడుచున్నది.

            లక్షణలెన్ని విధంబులనిన, జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణ యని మూఁడు విధంబులు. విడిచిన లక్షణ, విడువని లక్షణ, విడిచి విడువని లక్షణయని వీటికి పేర్లు. ఒక బ్రాహ్మణుఁడు గంగాతీరంబునందుండి వచ్చెనేని అతనింజూచి మఱియొక బ్రాహ్మణుండు గంగాతీరమందు విశేషంబు లేమి యని అడిగిన అతఁడు గంగాయాం ఘోషఃఅనఁగా గంగయందు గొల్లపల్లెయున్నదని చెప్పెను. ఈ మాటకు తాత్పర్య మేమి యనిన, గంగ యనుపదమునకు ప్రవాహమర్థము గనుక ఆ ప్రవాహమందు గొల్లపల్లెయున్నదని అంగీకరించినచో ప్రత్యక్ష విరోధము గనుక, గంగ యను పదంబునకు అర్థమైన ప్రవాహమును సర్వాత్మనా విడిచి ఆ ప్రవాహపు గట్టునందు గొల్లపల్లెయున్నదని తాత్పర్యము చేసుకోవలెను. ఇది జహల్లక్షణ. ఇటువలె మహావాక్యమందును జహల్లక్షణ చెప్పుదమనిన కూడదు. అది యెటువలెననిన త్వంపదార్థమైన కూటస్థచైతన్య పర్యంతంబును విడిచి పెట్టినచో ముముక్షువులయొక్క స్వరూపమే లేకపోవు చున్నది. కనుకను ప్రత్యక్ష విరోధము గనుకను, ఈ జహల్లక్షణ కూడదు. ఏ లక్షణచేత నే వాక్యము బ్రహ్మజ్ఞానమును బోధించుచున్నదనిన, అన్నమయ కోశము మొదలుకొని విజ్ఞానమయకోశ పర్యంతంబును పరబ్రహ్మమని చెప్పెడి వాక్యమందు జడమైన కోశంబులు బ్రహ్మమని చెప్పఁగూడదు గనుక, వాటిని విడిచి వాటికి అధిష్ఠాన భూతమయిన చైతన్యంబునకే తాత్పర్యము చెప్ప వలెను. ఇది యిప్పుడు జహల్లక్షణ. అజహల్లక్షణ అనఁగా మంచాః క్రోశంతిఅను వాక్యమందు మంచములు కూఁతలు పెట్టుచున్నవని చెప్పితే ప్రత్యక్ష విరోధము గనుక, మంచములను విడువకనే మంచములమీద పురుషులు కూతలు పెట్టుచున్నారని అజహల్లక్షణచేత తాత్పర్యము నిర్ణయింపఁ దగినది. అటువలెనే వేదమందు సత్యంజ్ఞాన మనంతం బ్రహ్మఅనెడి వాక్యంబునకు ఆ వాక్యమందానందమయ కోశముతోఁ గూడనుండు ఆత్మను చెప్పుచున్నారు గనుక, సచ్చిదానందంబులను విడువకనే ఆనంద మయకోశము చెప్పుచున్నది. ఈ యర్థము మహా వాక్యమందంగీకరింత మనిన కించిద్‌జ్ఞత్వాదిగుణములతోఁ గూడుకొనిన చైతన్యమే జీవుఁడు గనుక, గుణవిశిష్టుఁడయిన వానికి ఐక్యంబు చెప్పఁగూడదు గనుక, ఇక్కడ అజహల్లక్షణ కూడదు. జహదజహల్లక్షణ యనఁగా సోయం దేవదత్తఅనెడి వాక్యంబున గంగాతీర మందు అయిదోయేట దేవదత్తుని చూచితిమి. ఆ దేవదత్తుని ఈ కావేరీ తీరమందు నేఁబదియవ యేట చూచితిమి. అనే వ్యవహారమందు ఆ దేశ కాలంబులు ఈ దేశ కాలంబులు వీట్లను కూడు కొనిన పురుషుఁడే వాక్యార్థ మని అంగీకరించితి మేని బహు విరోధమున్నది.

            అది యెటువలెననఁగా గంగాతీరము కావేరీ తీరము కాదు, కావేరీ తీరము గంగాతీరము కాదు. ఆ కాలము ఈ కాలము కాదు. ఈ కాలము ఆ కాలము కాదు. ఆ వయసు ఈ వయసు కాదు. ఈ వయసు ఆ వయసు కాదు. కాఁబట్టి ప్రమాణాంతరమైన ప్రత్యక్షంబునకు విరుద్ధమై యున్నది గనుక, వాచ్యార్థమయిన తద్దేశ తత్కాలంబులను ఏతద్దేశ ఏతత్కాలంబులను విడిచి లక్ష్యభూతుఁడయిన దేవదత్తుఁడే వాచ్యార్థముగా నూహింపవలెను. మహావాక్యమందును తత్పదార్థంబగు వాచ్యార్థమయిన మాయా ప్రతిబింబ సర్వజ్ఞత్వాది గుణంబులకును త్వంపదార్థంబునకు వాచ్యార్థమైన అవిద్యా ప్రతిబింబ చిదాభాసునకును వానియొక్క గుణంబు లయిన కించిద్‌జ్ఞత్వాదులకును అన్యోన్యము ఐక్యమంగీకరించిన పక్షమందు ప్రత్యక్ష విరోధమైనను, మాయా సర్వజ్ఞత్వాది గుణంబులను ఆద్యత్వాది గుణంబులను తోసివేసి లక్ష్యభూతమైన చైతన్య మాత్రమునుఁబట్టి ఆ సచ్చిదానంద బ్రహ్మమే నీవు, నీవే ఆ సచ్చిదానంద బ్రహ్మము అని, జహదజహల్లక్షణములను మహావాక్యములు బోధించుచున్నవి గనుక, నీవే బ్రహ్మము, సంశయంబు లేదు. ఇఁక నీ నాలుగు వాక్యంబుల యొక్క అర్థంబును క్రమం జెప్పెదము. ప్రజ్ఞానంబ్రహ్మయను వాక్యమందు ప్రజ్ఞాన మనెడి పదంబునకు అర్థమును ప్రతిపాదించుట:

శ్లో||  యేనేక్షతే శృణోతీదం జిఘ్రతివ్యా కరోతి చ     
            సాధ్వసాధు విజానాతి తత్ప్రజ్ఞాన మితీర్యతే

            అనఁగా స్వాధిష్ఠాన చిదాభాసుఁడైన ఈ జీవుఁడైన పురుషుఁడు కన్నుల వలన బయలుదెలిసిన అంతఃకరణ వృత్తితోఁ గూడుకొని ఏజ్ఞానంబు  వలన నలుపు తెలుపు మొదలయినవాని నెఱుఁగుచున్నాఁడో, చెవుల వలన బయలు దెలిసిన అంతఃకరణ వృత్తితోఁగూడుకొని యే జ్ఞానంబు వలన శబ్దమును వినుచున్నాఁడో, ఘ్రాణేంద్రియంబు వలన బయలు దెలిసిన అంతఃకరణ వృత్తితోఁ గూడుకొని యేజ్ఞానంబువలన గంధంబు నెఱుంగు చున్నాఁడో, వాక్కువలన బయలు తెలిసిన అంతఃకరణ, వృత్తులతోఁ గూడు కొని యేజ్ఞానంబు వలన మాటలాడుచున్నాఁడో, నాలుక వలన బయలు దెలిసిన అంతఃకరణ వృత్తితోఁ గూడుకొని యే జ్ఞానంబువలన నుప్పు పులుసు వగరు కారము మొదలైనవాని నెఱఁగుచున్నాఁడో మఱియును, సకలేంద్రియముల వలనను బయలు దెలిసిన అంతఃకరణ, వృత్తులతోఁ గూడుకొని యేజ్ఞానంబువలన సకల బాహ్యంబుల నెఱుఁగుచున్నాఁడో, ఆ జ్ఞానము మాత్రమే ప్రజ్ఞానమనెడి పదమునకు లక్ష్యార్థము.

శ్లో||  చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గవాదిషు
            చైతన్య మేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మ మయ్యపి |

            చతుర్ముఖుఁడు మొదలైన దేవతలయందును, మనుష్యులు గుఱ్ఱములు గోవులు మొదలైనవాని యందును, అనుస్యూతమై యేచైతన్యము కలదో ఆ చైతన్యమే బ్రహ్మమనెడి పదమునకు లక్ష్యార్థము. బ్రహ్మపదంబునకు బ్రహ్మ మొదలుకొని వీరి శరీరపర్యంతంబును సకల శరీరంబులును వాచ్యార్థము గనుక మాయాకార్యమని తోసివేయఁదగినది. ఓయీ ! యిటుల నీవు నిశ్చయించుకొన్న యేవాచ్యార్థమును బట్టి సర్వత్ర అనుస్యూతమయిన ఏ చైతన్యము బ్రహ్మస్వరూపమో, అదియే నాయందుండెడి ప్రజ్ఞానమనెడి చైతన్యము. అదియే బ్రహ్మస్వరూపము, చైతన్యము, ప్రజ్ఞానము, బ్రహ్మము, ఆత్మ అను వీనికి పేళ్ళు మాత్రము వేఱుగాని, వస్తువొకటియే కాన, నేనే బ్రహ్మమని నిశ్చయించుకొనుము. ఇది బ్రహ్మజ్ఞానము. బ్రహ్మ స్వరూపమని వాక్యార్థము. అహం బ్రహ్మస్మిఅనఁగా, అహం బ్రహ్మ అస్మి అని మూడు పదములు. అహం అనుపదమునకు,

శ్లో||  పరిపూర్ణః పరాత్మాస్మిన్‌ దేహేవిద్యాధికారిణి
            బుద్ధేస్సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహ మితీర్యతే

            సర్వత్ర పరిపూర్ణమయిన పరమాత్మ బ్రహ్మవిద్యకు యోగ్యమయిన యే శరీరమందు బుద్ధికి సాక్షిగానుండి స్ఫురించుచున్న అహమనెడి పదము లక్షణవృత్తిచేత చెప్పఁబడుననిన, అహమనునప్పుడు చైతన్యంబు నిర్వి కారంబు గనుక అహమననేరదు. అహంకారము జడము గనుక అహమని తోఁచనేరదు. పరమాత్మ భూతమయిన చైతన్యమే అహంకారంబు తోడఁ గూడుకొని అహమని స్ఫురించుచున్నది. కాఁబట్టి జడమయి అహంకార మయిన వాచ్యమును, అహంకారము తోసివేసి చైతన్య మాత్రమే అహమనెడి పదమునకు అర్థము ఎట్లనిన,

శ్లో||  స్వతః పూర్ణః పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణితః
            అస్మీత్యైక్య పరామర్శస్తేన బ్రహ్మభవామ్యహమ్‌

స్వతః తానై పరిపూర్ణమయిన పరాత్మ ఈ మహా వాక్యమందు బ్రహ్మమనెడి పదమునకు లక్ష్యార్థము. ఏదే నొక కారణమును బట్టి సర్వత్ర పరిపూర్ణుఁడై యుండెడి ఆత్మ బ్రహ్మమో ఆ కారణమును బట్టి బుద్ధికి సాక్షియైయుండెడి నేనే బ్రహ్మమైతిని. అస్మి యనెడు పదముచేత ఐక్యము ప్రతిపాదింపఁ బడుచున్నది. కనుక నీ విటుల నిశ్చయించుకొనుము. సామవేదమందలి మహావాక్యంబునకు అర్థము: తత్పదము, త్వంపదము, అసిపదము అని మూఁడు పదములు. తత్పదంబునకు అర్థము:

శ్లో||  ఏకమే వాఽద్వితీయం సన్నామరూప వివర్జితమ్‌
            సృష్టేః పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే

సృష్టికి పూర్వమందు ఏకమై నామరూప రహితమై యేచిద్రూపుఁడైన ఆత్మ యుండెనో, ఆ యాత్మకు నిప్పుడు స్థితి సమయమందును, ఉపదేశ కాల మందును తత్‌అను పదము చేతను నామరూప రహితమయి లక్ష్యార్థ మయిన చైతన్యము మాత్రమే తత్పదార్థము చెప్పఁబడును. త్వంపదంబునకు అర్థము:


శ్లో||  శ్రోతు ర్దేహేంద్రియాతీతం వస్త్వత్ర త్వం పదేరితమ్‌
            ఏకతా గ్రాహ్యతేఽ సీతి తదైక్య మనుభూయతామ్‌

            వినునట్టి యధికారియొక్క దేహేంద్రియాదులకు అతీతమై సాక్షి భూతమయిన చైతన్యమే త్వంపదము చేతను చెప్పఁబడుచున్నది. అసియనెడి పదంబు చేతను ఐక్యము. ఆ తత్పద లక్ష్యార్థమయిన చైతన్యమే నీవు. త్వంపద లక్ష్యార్థమయిన నీవే ఆ తత్పద లక్ష్యార్థంబు. ఇట్లని ఐక్యంబు ప్రతిపాదించుచున్నది. కనుక అధికారియైన నీవు ఈ వాక్యార్థంబును అనుసంధానము చేయుము. ఇంకను అధర్వణ మందలి మహా వాక్యమునకు అర్థము అయ మాత్మా బ్రహ్మయనెడి వాక్యంబునకు అయం ఆత్మా బ్రహ్మ యని మూఁడు పదంబులు. అయం అను పదంబున కర్థము:

శ్లో||  స్వప్రకాశాపరోక్షత్వ మయ మిత్యుక్తితో మతమ్‌
            అహంకారాది దేహాంతా త్ప్రత్యగాత్మేతి గీయతే

            అయం అనెడి పదంబు చేతను స్వవశమై నిత్యాపరోక్షమై యుండునది యీ ఆత్మయని చెప్పఁబడుచున్నది. అహంకారము మొదలు కొని స్థూలదేహ పర్యంతంబును నాయహంకారంబు నా దేహంబని యెఱుఁగుచుండెడి చైతన్యమే ప్రత్యగాత్మ రూపంబు. ఇందుకు అర్థంబు చూడఁబడెడి సమస్తము నా జగత్తు యొక్క తత్త్వం బ్రహ్మమనెడి శబ్దంబు చేతను చెప్పఁబడిన లక్ష్యార్థంబు. జగదధిష్ఠానభూతమయిన బ్రహ్మమే స్వప్రకాశ మయిన ఆత్మ. ఆ యాత్మ స్వరూపమే తాను. ఈ నాలుగు మహా వాక్యంబుల యందు నీవే సచ్చిదానంద స్వరూపమయి అద్వితీయమయిన ఆత్మ స్వరూపుఁడవు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణంబులు నీకు లేవు. బ్రహ్మ చర్యాదులగు నాలుగాశ్రమంబులును వానియొక్క ధర్మంబులును నీకు లేవు. నీవు అసంగుఁడవు. కాలత్రయమందును నీవు జీవుఁడవు కావు. కనుక నీకు ఆగామి సంచిత ప్రారబ్ధకర్మంబులు లేవు. అఖండైకరసమై సుఖస్వరూప మయిన ఆత్మవు నీవు. ఇట్లని గురువుల వారు హస్త స్పర్శ చేసి శిరస్సుపై తమయొక్క శ్రీహస్తంబునిచి పూర్ణానుగ్రహంబు చేసిరి. అటు తర్వాత నా శిష్యుఁడు బాహ్యంబు మఱచి, పలుతడవలకు కన్నులు దెఱచి చూచి, దిగ్గున లేచి గురుస్వాములకు అనేక సాష్టాంగ వందనంబులు చేసి విజ్ఞాపనము చేయుచున్నాఁడు. హే స్వామీ! నేను కృతార్థుఁడనైతిని. నాకు మోహనివృత్తి యాయెనని విజ్ఞాపనంబు చేసిన వాఁడాయెను. కనుక ఈ నాలుగు మహావాక్యంబుల యొక్క వివేక మెవఁడు వినినను చదివినను వ్రాసి అర్థంబు విచారించినను వాఁడు కృతార్థుఁడగును.

శ్లో||  తాపత్రయార్క తప్తానాం సదాపాప విమోచనం
        కామాది రహిత శ్రీమద్వాసుదేవగురుం భజే

ఇది పంచచత్వారింశద్వర్ణకము.