34. అసురవాసనా నిరూపణము

షడ్వింశతి వర్ణకము
34. అసురవాసనా నిరూపణము

            అసుర వాసనాస్వరూపమైన ప్రతిబంధమును నిరూపించు చున్నారము. ఆ ప్రతిబంధము తనయందును లేనిదిగా తోచినప్పటికి, నొక సమయమందు పరుని యొక్క ఆచారంబును చూచి తరువాతను అపేక్షాదుల చేతను ఆ ప్రతిబంధము ప్రకటమౌను. అది యెటువలె ననిన, ఓరీ భ్రష్టా! ఆచారంబులు ఇటులనా చేయుట? భ్రష్టుఁడవయి పోతివి. సందేహము లేదు. నీకు ఆచారంబు చెప్పిన గురువెవఁడో వాఁడు భ్రష్టుఁడే. సందేహంబు లేదు. ఓరీ! రేపు మొదలుకొని నీవు మా సముఖంబునకు రావలదు. లేచిపోరా! అనియును, ఓరీ! మమ్ము నమస్కరించి బ్రతికిపోరా! అనియును, గురుపాద తీర్థంబు పుచ్చుకొని బ్రతికిపోరా ! అనియును, మాకు శుశ్రూష చేయుటకన్న వేదాంత విచారమందు ఏమియున్నది ! మమ్ము బూజించితివేని నీకు సకలా భీష్టంబులు సిద్ధింపుచున్న వనియును, మమ్ము వినాగా నెవరికిని శుశ్రూష సేయవలదనియును, ఓరీ ! యెవ్వరికైనా మా వారికి సమస్తమును నీయవేని నీవు మా యొద్దకు రావద్దనియును, ఒకడు మమ్ము సడ్డసేయక లేవకపోయెను. వానికి ఆయుస్సు ఇంతమట్టుకు సరి అంటిమి. వాడు భస్మమయి పోయెను. మఱియొకఁడు ఐశ్వర్య మదము చేత మమ్ము పరామర్శింపక పోయెను. ఓరీ ! మా వద్ద మంత్రము పదేశించుకొని యొకఁడు మమ్ము గణింపక పోయెను. వానిని భస్మమయి పోదునని చెప్పితిమి. వాడు అటు వలెనే భస్మమయిపోయె ననియును, మా మహిమ మావంటి వారు ఎఱిఁగిరి. ఇంతేకాని యెవరు ఎఱుఁగఁబోవుచున్నారనియును, మేము భూత భవిష్యద్వర్తమాన కాల వృత్తాంతము లెఱింగిన వారలమనియును, గతంబున ననేకుల రక్షించితిమి. ఇప్పుడు అనేకులను రక్షించుచున్నార మనియును, ఇఁకమీఁద ననేకుల రక్షింపఁబోవుచున్నారమనియును మాచేత ననేక ద్రవ్యంబులు సంపాదింపబడెను. అవి యన్నియు దానము చేసితి మనియును, తన మనసున నేమి కోరుచున్నాఁడో అదియంతయు ముందట వచ్చి నిలుచునననియు, తనకింత ద్రవ్యము రాఁబోవుచున్నదనియును, వీడు నాచేతఁ బెంపఁబడెను. ఇంతమాత్రమేకాదు. వీఁడు తలక్రిందుగాఁ బడుచున్నాఁడు. వాఁడు తలక్రిందుగా బడుచున్నాడు. మఱికొందరు తలక్రిందుగాఁ బడుఁచున్నారు. వీరినందఱిని సంహరింపఁబోవుచున్నా మనియును, నీ మనస్సు రావలె ననియును, నేనీశ్వరుఁడననియును, భోగిననియును, సిద్దుడననియును, బల వంతుడననియును, ఆఢ్యుడననియును, నాకు సమానమయన వాఁడెవ్వఁడున్నాఁడనియును, యజ్ఞము చేసినను బ్రాహ్మణ భోజనము చేయించినను, దానము చేసినను నేనే చేయవలననియును,నాయంత సామర్థ్యమును, బుద్ధియును, సుగుణంబులును, లోకమం దెవరికినిని లేవనియును, తాను మంత్ర శాస్త్రంబునం దతిసమర్ధుండననియును, తనకొక ద్వేషియుండఁగా  వాని నొక  మంత్ర ప్రయోగంబుచేత భస్మంబు చేసితి ననియును, మఱియొకఁడు నాకు శిష్యుఁడై యుండెను. వాని కొక మంత్రముప దేశించితిని. వానికి సకలైశ్వర్యంబులు వచ్చెననియును, మరియొకండు చచ్చిపోవలయునని యొక మంత్రంబు నుపదేశించితిని. వాఁడా మంత్రంబును మూఁడు దినంబులు జపియించి భస్మమయి పోయెను. పూర్వమందు పెద్ద లెందఱో యుండిరి గాని, వారల కీపాటి మహిమలు లేవు. వంచనలేక యెవరు శుశ్రూష చేయుచున్నారో వారే కృతార్థులు. నా శరీరంబు నెవ్వరు రక్షింపుచున్నారో వారే ధన్యులౌదురు. ఇచ్చునట్టి సమస్తంబును మాకే యెవరిత్తురో వారికి పరలోకము సిద్ధించును. మా యొక్క దర్శన మెవరికి దొరుకుచున్నదో వారలకు సర్వ పాపములు నశించును. మా పాదరేణువు లెవ్వరిగృహమందుఁ బడుచున్నవో ఆ గృహమే గృహము. మా పాదరేణువులెవఁడు శిరసా వహింపుచున్నాఁడో వాడే కృతార్థుఁడు. మా కింతటి మహిమ లేక పోయినచో అందరును మమ్ము నెందుకొఱకుపాసింపుదురు? మేము దొడ్డవారము సందేహము లేదు. బహు ప్రకారంబులుగాఁ జెప్పెడిదేమి యున్నది అనియును, మనో వాక్కాయంబుల చేత నీ శరీరంబు నీశ్వరునిఁగా నెంచి యెవరు పూజించు చున్నారో వారలకు దోషపరిహారమనియు, ఈ ప్రకారంబుగా ననర్థ రూపమయి వచ్చునట్టి చిత్తవృత్తి అసురవాసనా ప్రతిబంధమని చెప్పఁబడును.

            ప్రతిబంధంబు మిగుల ననర్థ హేతువు గనుకను అనాత్మ విష యంబు గనుకను ఆత్మ జ్ఞానంబునకు విరోధంబు గనుకను మోక్షేచ్చ గలవా రీప్రతిబంధంబు విచారించి విడువఁదగినది. ఈ ప్రతిబంధంబుండఁగానే శ్రవణా దులెవరు చేయుచున్నారో వారికి ఆ జన్మమందు జ్ఞానంబు రానేరదు. అయితే యీ శ్రవణాదులు వ్యర్థమైపోవునా యనిన, పోవు. మఱి యేమౌనిన, అశ్వమేధాది క్రతువులు చేసిన వారికి ఏ లోకంబు కలదో ఆ లోకంబునకు పోయి ఆ లోకమందు బహు భోగంబులు అనుభవించిన తర్వాతను బ్రహ్మ నిష్ఠుల గర్భమందు పుట్టును. పుట్టిన తర్వాత సంసారాసక్తుఁడై యున్నప్పటికిని పూర్వ జన్మవాసనా వశంబువలన శ్రవణాదులయందే అభిరుచి గలిగి తర్వాత తనకు ప్రతిబంధంబులు ఏవైనఁ గలవాయని విచారించి ప్రతిబంధంబులను పోఁగొట్టుటకై శ్రవణాదులు చేసి ఆ శ్రవణాదులచేత జ్ఞానంబు సంపాదించి ముక్తుఁడౌనని శ్రుతి స్మృతి పురాణంబులచేత చెప్పబడుచున్నది. ఈ ప్రకారంబుగా ప్రతిబంధంబుల నెవఁడు పోఁగొట్టుకొని శ్రవణాదులచేసి జ్ఞానంబు సంపాదించుచున్నాఁడో వాడు ముక్తుఁడవునని వేదాంత సిద్ధాంతము.

ఇది షడ్వింశతి వర్ణకము.